ఆ జీవోను ఉపసంహరించుకోవాలని కేసీఆర్​కు రేవంత్​రెడ్డి లేఖ

author img

By

Published : Dec 29, 2021, 4:47 PM IST

tpcc chief revant reddy letter to cm kcr about New zonal policy

ముఖ్యమంత్రి కేసీఆర్​కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు.. ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనోవేదనకు గురిచేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. జీవో నెంబర్ 317ను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

రాష్ట్రంలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన.. కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్​కు రేవంత్​రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు.. ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనోవేదనకు గురిచేస్తున్నాయని తెలిపారు. సొంత జిల్లాలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికేతరులుగా మారే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం డిసెంబర్ 6న జారీ చేసిన జీవో నెంబర్ 317ను ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు.

స్థానికేతరులుగా బతకాల్సిన దుస్థితి..

"ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉమ్మడి జిల్లా యూనిట్​గా అనుభవాన్ని ప్రతిపాదికగా తీసుకొని సీనియర్లకు వారి అప్షన్ మేరకు పోస్టింగులు ఇస్తున్నారు. దీంతో దాదాపు 20-30 ఏళ్లు స్థానికేతరులుగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బదిలీల కారణంగా సొంత జిల్లాను ఉన్నపళంగా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. రిటైర్మెంట్ వరకు ఆ జిల్లాలోనే బాధ్యతలు నిర్వర్తించాలి. తిరిగి సొంత జిల్లాకు వచ్చే మార్గమే లేదు. సీనియార్టీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను, ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే విధంగా విడుదల చేసిన జీవో 317ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలతో చర్చించిన తర్వాత రూపొందించే నూతన గైడ్​లైన్స్ ఆధారంగా బదిలీలు చేపట్టాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటివరకు జరిపినట్టు ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు.. జీవో నెంబర్ 3 ఆధారంగానే చేపట్టాలి. అవసరమైతే జూనియర్ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలి. ఉపాధ్యాయుల కేటాయింపునకు కౌన్సిలింగ్ విధానాన్ని అనుసరించాలి." -రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.