ETV Bharat / city

ఇలా చేస్తే.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ ఈజీగా గట్టెక్కొచ్చు

author img

By

Published : May 25, 2022, 11:24 AM IST

Police job Exams
Police job Exams

Police job Exams : తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ప్రకటించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ నియామకాల కోసం అభ్యర్థులు దీక్షగా సిద్ధమవుతున్నారు. ఈ రెండింటి ప్రిలిమినరీ పరీక్షల్లో కొన్ని ప్రధాన అంశాలపై అధిక దృష్టి కేంద్రీకరించి చదవాలి. అప్పుడే సులభంగా నెగ్గటం సాధ్యమవుతుంది!

Telangana Police job Exams : ప్పటికే పోలీసు ఉద్యోగాల కోసం 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా సమయం ఉన్నందున లక్ష నుంచి రెండు లక్షల దరఖాస్తులు పెరిగే అవకాశం ఉంది. బోర్డ్‌ చైైర్మన్‌ సూచనప్రాయంగా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలను ఆగస్టు 7, ఆగస్టు 21 తేదీల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడున్న 60+ రోజుల వ్యవధిలో అవసరమైన 60 మార్కులు సాధించేందుకు నిరంతర శ్రమతో స్మార్ట్‌వర్క్‌ చేయాలి. ఈ విధంగా సన్నద్ధ్దమయితే ప్రిలిమినరీని సులభంగా ఛేదించవచ్చు.

Preparation for Police Jobs : ప్రిలిమినరీ అర్హత పరీక్ష అయినందున ప్రశ్నపత్రం కఠినస్థాయిలో ఇస్తారు. అందుకే సబ్జెక్టు అంశాలతోపాటు సమకాలీన అంశాలతో సన్నద్ధమవ్వాల్సివుంటుంది. ప్రతి అభ్యర్థీ 2019-2023 మధ్య జరిగిన సబ్జెకు సంబంధిత వర్తమాన అంశాలపై పట్టు సాధించగలిగితే ప్రశ్నలకు సమాధానాలు సులువుగా గుర్తించవచ్చు.

Preparation for SI Jobs : తక్కువ సమయంలో ఎక్కువ మార్కులను సాధించాలంటే అటు ఎస్‌ఐ, ఇటు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షల్లో కామన్‌గా ఉన్న సబ్జెక్టు అంశాలను ఎంచుకోవాలి. వీటిని ప్రణాళిక ప్రకారం చదివితే 100 శాతం అర్హత సాధించవచ్చు. ప్రతి అభ్యర్థీ గమనించవలసిన అతి ముఖ్యమైన అంశం నెగిటివ్‌ మార్కులు. కచ్చితంగా తెలిసిన 80/200 ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించగలిగితే క్వాలిఫై కావచ్చు.

అరిథ్‌మెటిక్‌ : ఇది నాన్‌ మ్యాథ్స్‌ విద్యార్థులకు క్లిష్టంగా తోచే అంశం. కానీ రెండు పరీక్షల్లో ఉన్న ఉమ్మడి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి స్మార్ట్‌ వర్క్‌ చేయటం ముఖ్యం. ఇలా చదివితే కానిస్టేబుల్‌ అభ్యర్థులు కనీసం 15 మార్కులు, ఎస్‌ఐ అభ్యర్థులు 30 మార్కులు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న తక్కువ వ్యవధిలో 10వ తరగతి వరకున్న పుస్తకాల్లో ప్రాథమిక అంశాలను సాధన చేయాలి.

రీజనింగ్‌ : ఈ సబ్జెక్టు పోటీ పరీక్ష అభ్యర్థుల మెదడుకు మేతలాంటిది. తికమక చేస్తూ మానసిక సామర్థ్యాన్ని పరీక్షిస్తుంది. అందువల్ల జనరల్‌ అంశాలను తీసుకొని ప్రిపేర్‌ అయితే ఎస్‌ఐ ప్రిలిమ్స్‌లో 20 మార్కులు, కానిస్ట్టేబుల్‌ ప్రిలిమ్స్‌లో 12 నుంచి 15 మార్కులు సాధారణ పరిజ్ఞానం ద్వారా సాధించవచ్చు. అలోచన, అవగాహనతో పరిశీలించి మానసిక సామర్థ్యాన్ని ఉపయోగిస్తే సరైన సమాధానాలు గుర్తించవచ్చు.

చరిత్ర - తెలంగాణ ఉద్యమం : రాష్ట్ర ప్రభుత్వ నోటిఫికేషన్లలో తెలంగాణ ఉద్యమం, చరిత్రలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టి మ్యాథ్స్‌, నాన్‌ మ్యాథ్స్‌ విద్యార్థులు వీటిపై దృష్టి పెట్టి పరిణామ క్రమంలో చదవాలి. సులభంగా 20 ప్రశ్నలకు సమాధానం గుర్తించవచ్చు. ఇందులో భారత జాతీయోద్యమంతో పాటు తెలంగాణ చరిత్రకు సంబంధించిన యాస, భాష, సంస్కృతి, వారసత్వం, ఉద్యమ పరిణామ క్రమంపై దృష్టి సారించాలి. అంటే 1948-1970, 1970-2014 తర్వాత జరిగినవాటిని సంవత్సరాలు, తేదీలు గుర్తుపెట్టుకొని చదవాలి.

కరెంట్‌ అఫైర్స్‌ : సిలబస్‌లో ఉన్న సబ్జెక్టుతో వర్తమాన అంశాలను జోడించి చదవాలి. ప్రధానంగా కరెంట్‌ అఫైర్స్‌లో బాగంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, తాజా పర్యావరణ, సైన్స్‌ అంశాలు, రాజ్యాంగానికి సంబంధించి పాలిటీ, కరెంట్‌ ఎకానమీకి సంబంధించిన అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు నోట్ల రద్దు, బ్యాంకు సంస్కరణలు, వాతావరణ మార్పులు, వైరస్‌లు, బాక్టీరియా, సుస్థిరాభివృద్ధి, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రస్తుత యుద్ధ పరిణామాలపై దృష్టి సారిస్తే 15 మార్కులు సాధించవచ్చు.

.

భౌగోళికాంశాలు : ప్రపంచ, జాతీయ, ప్రాంతీయ భౌగోళిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ చదివితే అధిక మార్కులను పొందటం సాధ్యమవుతుంది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన నూతన అంశాలపై, రాష్ట్ర భౌగోళిక, ఆర్థిక విధానాలపై దృష్టి సారించాలి. భౌగోళికంగా వ్యవసాయం, నీటిపారుదల, పరిశ్రమలు, పథకాలు, నీటి వనరులు తదితర అంశాలపై దృష్టి పెడితే ఎక్కువ మార్కులకు అవకాశం ఉంటుంది.

ఈ సారి తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ నూతనంగా ‘ప్రిన్సిపుల్స్‌ జాగ్రఫీ’ అనే అంశాన్ని చేర్చింది. అందుకని ప్రాంతీయ భౌగోళికాంశాలే కాకుండా ప్రపంచ భూగోళ అంశాలైన అక్షాంశాలు, రేఖాంశాలు, సముద్రాలు, వాతావరణం, శిలావరణం అంశాలపై అవగాహన పెంచుకుంటే 10-12 మార్కులు సాధించవచ్చు.

ప్రిలిమ్స్‌ వెయిటేజి ఎలా ఉంటుంది? : తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌లో రుణాత్మక ప్రశ్నల విధానాన్ని అమలు చేస్తోంది. అన్ని సామాజిక వర్గాల వారికీ సమానంగా 30 శాతం అంటే 60 మార్కులను అర్హతగా నిర్ణయించారు. అందువల్ల మూస పద్ధతితో కాకుండా తెలిసిన ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తిస్తే మార్కులను కోల్పోయే ప్రమాదం ఉండదు. ప్రతి అభ్యర్థీ అంచనాలతో సంబంధం లేకుండా సవ్యమైన సొంత మార్గంలో ప్రిపేరవ్వాలి.

2016, 2018 సంవత్సరాల్లో టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నిర్వహించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్స్‌ ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాన్ని పరిశీలించి, అవగాహన కోసం ప్రతి సబ్జెకుల్టో ప్రశ్నల వెయిటేజిని ఇస్తున్నాం.

.
.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.