ETV Bharat / city

Viveka Murder: వైఎస్‌ వివేకా హత్య జరిగి నేటికి మూడేళ్లు.. దర్యాప్తులో ఎన్నో మలుపులు!

author img

By

Published : Mar 15, 2022, 9:31 AM IST

Viveka murder: వై.ఎస్.వివేకానందరెడ్డి దారుణహత్య జరిగి ఇవాళ్టికి మూడేళ్లయింది. ఈ మూడేళ్ల కాలంలో సిట్, సీబీఐ దర్యాప్తులో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. హత్యకేసులో నలుగురు పాత్రధారులను గుర్తించిన సీబీఐ.. సూత్రధారులే లక్ష్యంగా దర్యాప్తు సాగిస్తోంది. మూడేళ్లుగా వివేకా హత్యకేసు విచారణ సాగిన విధానం, నిందితుల అరెస్టు, కేసు పురోగతిపై ప్రత్యేక కథనం.

Viveka Murder case updates
ys Viveka

Viveka Murder: వైఎస్‌ వివేకా హత్య జరిగి నేటికి మూడేళ్లు.. దర్యాప్తులో ఎన్నో మలుపులు..!

Viveka murder: ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి.. 2019 మార్చి 15న పులివెందులలోని నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. హత్య జరిగిన రోజు తొలుత వివేకా గుండెపోటుతో చనిపోయారని వారి బంధువులు, వైకాపా నాయకులు ప్రకటించారు. ఆరోజు ఉదయం అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. మధ్యాహ్నానికి హత్య కేసుగా మార్చారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వివేకా హత్య కేసును తేల్చడానికి అదేరోజు సిట్‌ను ఏర్పాటు చేసింది. సార్వత్రిక ఎన్నికల నెల రోజుల ముందు జరిగిన వివేకా హత్య.. రెండు ప్రధాన పార్టీలకు ప్రచారాస్త్రంగా మారింది. హైకోర్టు జోక్యంతో నేతల ఆరోపణలకు అప్పట్లో అడ్డుకట్ట పడింది.

వారు ముగ్గురు అరెస్ట్..

వివేకా హత్య జరిగిన సమయంలో కడప జిల్లా ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మపై ఆరోపణలు రావడంతో బదిలీ వేటు పడింది. ఆ తర్వాత వచ్చిన ఎస్పీ అభిషేక్ మహంతి సారథ్యంలో మరో సిట్ ఏర్పాటైంది. కేసులో కీలక సాక్షులు, అనుమానితులను అధికారులు ప్రశ్నించారు. హత్యా స్థలంలో సాక్ష్యాధారాలు చెరిపివేశారనే అభియోగాలతో ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్‌ అనే ముగ్గురిని.. 2019 మార్చి 28న సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఏపీలో ప్రభుత్వం మారింది. అప్పటికి కేసు కొంతమేర కొలిక్కి వచ్చినట్లు భావించారు. అలాంటి సమయంలో ఎస్పీ అభిషేక్ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం సంచలనం సృష్టించింది. ఆయన తర్వాత వచ్చిన కడప జిల్లా ఎస్పీగా నియమితులైన అన్బురాజన్ నేతృత్వంలో మూడో సిట్ ఏర్పాటైంది. మొత్తం మూడు సిట్‌లు కలిపి.. దాదాపు 13 వందల మంది సాక్షులు, అనుమానితులను విచారించినా అసలు దోషులెవరో తేలలేదు.

హైకోర్టును ఆశ్రయించిన వివేకా కుమార్తె సునీత

సిట్‌ల విచారణతో ప్రయోజనం లేదని భావించిన వివేకా కుమార్తె సునీత.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. వివేకా హత్య కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరారు. ఆ పిటిషన్‌ను విచారణ చేసిన హైకోర్టు.. వివేకా కేసును సీబీఐకి అప్పగిస్తూ 2020 మార్చి 11న ఆదేశాలు జారీ చేసింది. కరోనా కారణంగా కొంత కాలం తర్వాత రంగంలోకి దిగిన అధికారులు.. 2020 జులై 18న కడప జిల్లాలో విచారణ మొదలు పెట్టారు.

వారంతా కలిసి హత్యచేశారని..

కడప, పులివెందుల ప్రాంతాల్లో దాదాపు 250 మంది వరకు సాక్షులు, అనుమానితులను ప్రశ్నించారు. ఆ తర్వాత సునీల్ యాదవ్, దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, రంగన్నను ఎక్కువ రోజుల పాటు ప్రశ్నించింది. ఆ విచారణ తర్వాత 2021 ఆగస్టు 2న వివేకా హత్యకేసులో సునీల్‌ యాదవ్‌ను అరెస్ట్ జరిగింది. సెప్టెంబరు 9న ఉమాశంకర్‌రెడ్డిని రెండో అరెస్ట్ చేసింది. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి కలిసి వివేకాను హత్య చేశారంటూ.. 2021 అక్టోబర్‌ 26న పులివెందుల కోర్టులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలుచేసింది. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి ప్రధాన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని ఐదో నిందితుడిగా చేర్చిన సీబీఐ... గత ఏడాది నవంబర్ 17న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. దస్తగిరి అప్రూవర్ గా మారడంతో కడప కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఎర్ర గంగిరెడ్డిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న సీబీఐ.. బెయిలు రద్దు కోసం ఏపీ హైకోర్టులో వేసిన పిటిషన్ ప్రస్తుతం విచారణ దశలో ఉంది.

వారిపై అనుమానం

వివేకా హత్య కేసులో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన అనేకమంది సాక్షులు.. కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో సీబీఐ ఏవిధంగా ముందుకు వెళ్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఇవీచూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.