ETV Bharat / city

Neet Ranks 2021: నీట్​లో తెలంగాణ విద్యార్థికి తొలి ర్యాంక్​

author img

By

Published : Nov 2, 2021, 4:44 AM IST

నీట్‌ ఫలితాల్లో (NEET RANKS 2021) తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. జాతీయ ర్యాంకుల్లో ఒకటో ర్యాంకులో ముగ్గురు నిలవగా.. ఇందులో రాష్ట్ర విద్యార్థి మృణాల్‌ కుట్టేరి తొలిస్థానాన్ని సొంతం చేసుకున్నారు. తర్వాత రెండు స్థానాల్లో దిల్లీకి చెందిన తన్మయ్‌గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జీ నాయర్​​ నిలిచారు. ఐదో ర్యాంకుకు 12 మంది విద్యార్థులు పోటీపడగా ఇందులో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కందవల్లి శషాంక్‌ కూడా ఒకరు. దీంతో తొలి 10 ర్యాంకుల్లో తెలంగాణ విద్యార్థులు రెండింటిని దక్కించుకున్నారు.

NEET RANKS 2021
NEET RANKS 2021

తొలి ర్యాంకు సాధించిన మృణాల్‌ కుటోరి

జాతీయ వైద్యవిద్య అర్హత ప్రవేశ పరీక్ష(నీట్‌)-2021 ఫలితాలు (NEET RANKS 2021) సోమవారం విడుదలయ్యాయి. అఖిల భారత ర్యాంకుల్లో తెలంగాణ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. జాతీయ ర్యాంకుల్లో ఒకటో ర్యాంకును ముగ్గురు సాధించారు. వారిలో రాష్ట్ర విద్యార్థి మృణాల్‌ కుటోరి అగ్రస్థానం సొంతం చేసుకున్నారు. వీరు ముగ్గురూ నూటికినూరు శాతం మార్కులు సాధించడం గమనార్హం. ఆర్మీ వైద్యుడిగా సేవలందించడం తన లక్ష్యమని, ఇష్టపడి చదివితే మంచి ర్యాంకును సొంతం చేసుకోవడం కష్టంకాదని మృణాల్‌ ‘ఈనాడు’తో తెలిపారు. తర్వాత రెండు స్థానాల్లో దిల్లీకి చెందిన తన్మయ్‌గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి నాయర్‌ నిలిచారు. ఐదో ర్యాంకుకు 12 మంది విద్యార్థులు పోటీపడగా.. ఇందులో రాష్ట్రానికి చెందిన కందవల్లి శశాంక్‌ కూడా ఒకరు. దీంతో తొలి 10 ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థులు రెండింటిని దక్కించుకున్నట్లయింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు చందం విష్ణు వివేక్‌, గొర్రిపాటి రుషిల్‌ కూడా ఐదో స్థానంలో నిలిచారు. తొలి 100 ర్యాంకుల్లో రాష్ట్ర విద్యార్థులు కాస లహరి(30), ఈమని శ్రీనిజ(38), దసికా శ్రీనిహారిక(56), పసుపునూరి శరణ్య(60), విశ్వాస్‌రావు(60), లాస్య చౌదరి(75), సమీహనరెడ్డి(87)లతో కలిపి మొత్తంగా 9 మంది ప్రతిభ చాటారు. ఏపీకి చెందిన అయిదుగురు తొలి 100 ర్యాంకుల్లో నిలిచారు. గతేడాది మాదిరిగానే ఈసారీ బాలుర హవా కొనసాగింది. కేవలం 2 ర్యాంకులనే బాలికలు సొంతం చేసుకున్నారు. బాలికల విభాగంలో తొలి 21 ర్యాంకులను పరిశీలించగా.. తెలంగాణకు చెందిన విద్యార్థినులు ముగ్గురున్నారు. జాతీయ స్థాయిలో ఎయిమ్స్‌, జిప్‌మర్‌ సహా అన్ని స్వయంప్రతిపత్తి వైద్యసంస్థల్లోనూ నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికనే సీట్లను భర్తీ చేయనున్నారు.

ఫలితాల్లో తీవ్ర జాప్యం

నీట్‌ పరీక్షను 2021 సెప్టెంబరు 12న దేశం మొత్తమ్మీద 3,858 కేంద్రాల్లో నిర్వహించారు. ఫలితాలు నెల రోజుల్లోపే వెల్లడవ్వాల్సి ఉండగా.. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌లలో ప్రశ్నపత్రం ముందస్తుగా బయటకు వెల్లడైందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై సీబీఐ విచారణ జరగడం, కోర్టులో కేసులు వేయడంతో ఫలితాల్లో జాప్యం జరిగింది. ఫలితాల వెల్లడికి గత శుక్రవారమే న్యాయస్థానం పచ్చజెండా ఊపిన క్రమంలో సోమవారం రాత్రి ఫలితాలను విడుదల చేయడంతో ఉత్కంఠకు తెరపడింది. దేశం మొత్తమ్మీద 15,44,275 మంది పరీక్ష రాయగా.. 56.34 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.

ముందుగా అఖిల భారత కోటా ప్రవేశాలు

జమ్మూకశ్మీర్‌ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ వైద్యకళాశాలల నుంచి సేకరించిన 15 శాతం ఎంబీబీఎస్‌ సీట్లతో నిర్వహించనున్న అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమి ప్రవేశాల ప్రక్రియను తొలుత నిర్వహిస్తారు. తెలంగాణ నుంచి అఖిల భారత కోటాకు 240 ఎంబీబీఎస్‌ సీట్లను అందజేస్తున్నారు. రాష్ట్ర ప్రవేశాలకూ, అఖిల భారత వైద్యవిద్య సీట్ల కూటమి ప్రవేశాలకూ వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే అఖిల భారత ప్రవేశాల సమాచారం కోసం అభ్యర్థులు ‌www.mcc.nic.in వెబ్‌సైట్‌లో చూడాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. రాష్ట్రస్థాయిలో నిర్వహించే కన్వీనర్‌, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా సీట్ల ప్రవేశాలను కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భర్తీ చేస్తారు. ఈ ఏడాది అఖిల భారత కోటాకు కేటాయించిన సీట్లు పోనూ.. మొత్తంగా 4,800 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి.

గతేడాది కంటే పోటీ పెరిగింది

ఈసారి నీట్‌లో ఐచ్ఛికాలను ప్రశ్నల్లో ఎంపిక చేసుకోవడాన్ని ప్రతిభావంతులు బాగా వినియోగించుకున్నారు. గతేడాది 700 మార్కులు వస్తే 100 మంది పోటీలో ఉండగా.. ఈసారి అవే మార్కులకు 200 మందికి పైగా ఉన్నారు. గతేడాది 682 మార్కులకు 500వ ర్యాంకు రాగా.. ఈదఫా 685 మార్కులకు 700వ ర్యాంకు వచ్చింది. దీన్నిబట్టి పోటీ బాగా పెరిగిందని అర్థమవుతోంది. అఖిల భారత స్థాయిలో తెలుగు విద్యార్థులు బాగా సీట్లు సంపాదించే అవకాశం ఉంది. టాప్‌ 100లో తెలుగు విద్యార్థులు గతేడాది అయిదారుగురు ఉండగా ప్రస్తుతం సుమారు 20 మందికి పెరగడం గమనార్హం. ఈసారి ప్రశ్నపత్రం కొంత కఠినంగా ఉండటం.. ఆన్‌లైన్‌ చదువుతో విద్యార్థులు వెనకబడిన కారణంగా కటాఫ్‌ మార్కులు తగ్గాయి.

- పి.శంకర్‌రావు, డీన్‌, శ్రీచైతన్య విద్యాసంస్థలు

జాతీయ స్థాయిలో మెరిసిన తెలుగు తేజాలు


సైన్యంలో వైద్యుడైతే సాహసోపేత వాతావరణంలో సేవ చేయొచ్చు. చిన్నప్పుడు అలాంటి సినిమాలు చూసి నాలో ఆ ఆసక్తి పుట్టింది. అందుకు తగ్గట్టే చదువు మొదలుపెట్టా. నాన్న మురళీధర్‌, అమ్మ రతీరవీంద్రన్‌ హెచ్‌.ఆర్‌. విభాగంలో చేస్తారు. కేరళ నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. విద్యాభ్యాసమంతా ఇక్కడే జరిగింది. ఇంట్లో లభించిన స్వేచ్ఛతో నాకు నచ్చినప్పుడే చదువుకున్నా. రాత్రింబవళ్లు కష్టపడలేదు. ఆన్‌లైన్‌ శిక్షణ కష్టాలన్నీ దాటి దిల్లీ ఎయిమ్స్‌ లక్ష్యంతో పరీక్ష రాశా. అనుకున్నది సాధించా.

ఆర్మీ డాక్టర్‌ కావాలని: మృణాల్‌ కుటోరి, 1వ ర్యాంకు

ఎన్ని అడ్డొచ్చినా లక్ష్యం చెదరలేదు..

పదో తరగతి వరకు కర్నూలులో, ఇంటర్‌ హైదరాబాద్‌లో చదివా. చిన్నప్పటి నుంచి వైద్యుడిని కావాలనేది లక్ష్యం. నాన్న రాజశేఖర్‌ ఫార్మా రంగంలో పనిచేస్తున్నారు. కొవిడ్‌తో శిక్షణ ఆన్‌లైన్‌కు మారడంతో ఇంట్లోనే సాధన చేయాల్సి వచ్చింది. దిల్లీ ఎయిమ్స్‌ సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నా.. అడ్డంకులన్నీ మొదట్లోనే తుంచేశా. సిలబస్‌కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నా. అనుకున్నట్లే అయిదో ర్యాంకు సాధించా. న్యూరో సర్జన్‌ కావాలనుకుంటున్నా.

- కందవల్లి శశాంక్‌, అయిదో ర్యాంకు

తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహం

మాది తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ. గతంలో అనారోగ్యానికి గురికావడంతో తరచూ న్యూరాలజిస్ట్‌ వద్దకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో న్యూరాలజిస్ట్‌ కావాలనే ఆకాంక్ష పెరిగింది. దాని సాధనకు రోజుకు 14 గంటలు శ్రమించా. పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదివా. మా నాన్న వెంకటేశ్వరరావు వెల్డింగ్‌ పని చేస్తుంటారు. అమ్మ లక్ష్మి గృహిణి. అన్న భాగ్వేష్‌ భువనేశ్వర్‌ ఎయిమ్స్‌లో మెడిసిన్‌ రెండో ఏడాది చదువుతున్నాడు. దుకాణంలో నాన్న పడుతున్న కష్టం చూసి, ఎలాగైనా నీట్‌లో ర్యాంకు సాధించాలని నిర్ణయించుకున్నా. ఎలా చదవాలి? ఏం చదవాలి? అనే ప్రణాళికతో ముందుకు సాగా.

- సి.విష్ణు వివేక్‌, అయిదో ర్యాంకర్‌

తప్పుల్ని సరిదిద్దుకుంటూ..

మాది హైదరాబాద్‌. అమ్మ రత్న గృహిణి, నాన్న శివశంకర్‌ ఫార్మా సంస్థలో మేనేజర్‌. నీట్‌లో మంచి ర్యాంకు కోసం ఎప్పటికప్పుడు తప్పుల్ని సరిదిద్దుకుంటూ సన్నద్ధమయ్యా. రోజుకి కనీసం 10 నుంచి 12 గంటలు ప్రణాళికా ప్రకారం చదివేదాన్ని. పాత పరీక్షా పత్రాల సాధన, విషయంపై పట్టు సాధించడం కలిసొచ్చింది. వారాంతపు పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు భయమేసేది. అక్క, అమ్మానాన్నలు నాలో ధైర్యాన్ని నింపేవారు. మనసు తేలిక పడి మళ్లీ సాధన మొదలెట్టేదాన్ని. ఎంబీబీఎస్‌ తర్వాత ఆంకాలజిస్టు, కార్డియాలజిస్ట్‌, న్యూరాలజిస్ట్‌.. వీటిలో ఏదో ఒకటి కావాలని ఉంది.

- కాస లహరి, 30వ ర్యాంకు

చిన్నప్పుడే లక్ష్యాన్ని గుర్తించా..

మాది జగిత్యాల జిల్లా కోరుట్ల. నాన్న డాక్టర్‌ వేణుగోపాల్‌ పీడియాట్రిషన్‌, అమ్మ డా.అనురాధ గైనకాలజిస్టు. వారి స్ఫూర్తితోనే అయిదో తరగతి నుంచే వైద్యురాలిని కావాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నా. తర్వాత కూడా ప్రణాళికలు రూపొందించుకున్నా. ఇంటి వద్దే ఉంటూ ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకున్నా. కొన్నాళ్లపాటు ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండి సన్నద్ధమయ్యా. న్యూరాలజిస్టుగా సేవలందించాలనుకుంటున్నా.

- శరణ్య, 60వ ర్యాంకు

అనుకుంటే చదివేయాల్సిందే

మాది హనుమకొండ. టీచర్లు చెప్పినవి ప్రణాళికాబద్ధంగా విభజించుకున్నా. ఈ గంటలో దీన్ని పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకొని.. అలాగే చదివా. పూర్తిగా చదువులోనే తలమునకలు కాలేదు. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్లతో, స్నేహితులతో కాలక్షేపం చేసేవాడిని. ఆన్‌లైన్‌ తరగతుల వల్ల కొంత ఇబ్బంది కలిగినా పట్టుదలతో ముందుకెళ్లా. అమ్మానాన్న, టీచర్లు ఎక్కువగా ప్రోత్సహించారు. న్యూరాలజిస్ట్‌ కావాలని ఉంది.

- బి. విశ్వాస్‌రావు, 60వ ర్యాంకు

ఇబ్బందులు అధిగమించి..

ఆన్‌లైన్‌లో నీట్‌ శిక్షణ తరగతులు మొదట రెండుమూడు వారాలు ఇబ్బందిగా అనిపించింది. తర్వాత అలవాటుపడ్డా. దిల్లీ ఎయిమ్స్‌, జిప్‌మర్‌లో సీటు లక్ష్యంగా చదివా. ఇంట్లో ఉండటంతో కొంచెం శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలపై దృష్టి పడేది. కానీ చక్కదిద్దుకున్నా. ఒత్తిడి దరిచేరకుండా అమ్మానాన్నలు ప్రోత్సహించారు. ఆంకాలజీ విభాగంలో సేవలందించాలనేది లక్ష్యం.

- లాస్య చౌదరి కన్నెకంటి, 75వ ర్యాంకు

ఒత్తిడి లేకుండా చదివా..

మాది నల్గొండ జిల్లా సుబ్బారెడ్డిగూడెం. నాన్న కరుణాకర్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. అమ్మ ఫణిజ సివిల్‌ ఇంజినీరు. నీట్‌ కోసం రెండేళ్లపాటు రాత్రింబవళ్లు చదివా. ఎప్పటికప్పుడు పునశ్చరణ చేసుకున్నా. టీవీకి, సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉన్నా. వారాంతపు పరీక్షలయ్యాక మాత్రం సినిమాలు చూసేవాణ్ని. మార్కులు తగ్గినప్పుడు కొంత మందలించినా.. అమ్మానాన్న, అధ్యాపకులు వెన్నంటి ప్రోత్సహించారు.

- గజ్జల సమీహనరెడ్డి, 87వ ర్యాంకు

ఈసారీ ఆన్‌లైన్‌లోనేనా?

నీట్‌ అఖిల భారత ర్యాంకులు విడుదలైనా.. ఆ సమాచారం రాష్ట్రానికి చేరడానికి మరో 2 వారాలు పట్టవచ్చని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఆ సమాచారం ఆధారంగా ప్రాథమిక ర్యాంకులను విడుదల చేస్తారు. కచ్చితమైన ర్యాంకులు రాష్ట్ర స్థాయిలో వెల్లడవ్వాలంటే.. దరఖాస్తుల పరిశీలన అనంతరమే తెలుస్తుందని, ఆలోగా ఒక అంచనాకు రావడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నాయి. ఈనెల 20 తర్వాత రాష్ట్రంలో వైద్యవిద్య ప్రవేశ ప్రకటన జారీ చేయనున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. ముందుగా కన్వీనర్‌ కోటాలో వైద్యవిద్య ప్రవేశ ప్రకటనను విడుదల చేసి, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తారు. కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా గతంలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు. ఈసారి ఎలా అన్నదానిపై స్పష్టత లేదు.

భారీగా తగ్గిన కటాఫ్‌ మార్కులు

నీట్‌లో ఈసారి కటాఫ్‌ మార్కులు బాగా తగ్గాయి. గతేడాది జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు(అన్‌ రిజర్వ్‌డ్‌)... 147 మార్కులు వస్తే(720కి) కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఈసారి అవి 138కి తగ్గడం గమనార్హం. మిగిలిన కేటగిరీల్లో గత ఏడాది 113 మార్కులుండగా.. 108కి తగ్గాయి.

నీట్‌ ఫలితాల్లో నారాయణ జయభేరి

నీట్‌ 2021 ఫలితాల్లో తమ విద్యార్థులు జాతీయస్థాయి అన్ని కేటగిరీల్లో అత్యద్భుత ఫలితాలు సాధించి జయభేరి మోగించారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 2, 3, 4, 8, 9 ర్యాంకులను కైవసం చేసుకున్నారన్నారు. పది లోపు అయిదు ర్యాంకులు, వంద లోపు 16 ర్యాంకులు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారన్నారు. దేశవ్యాప్తంగా లక్షల మంది పోటీ పడిన నీట్‌లో పోటీని తట్టుకుని టాప్‌ ర్యాంకుల్లో స్థానం సాధించడం నారాయణ ఎన్‌-40 ప్రోగ్రామ్‌ సత్తాకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

ఇదీచూడండి: NEET 2021 Results: 'నీట్‌' పరీక్షా ఫలితాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.