ETV Bharat / city

కొత్తగా ఆరు లెదర్ పార్కులు... 3 వేల మందికి ఉపాధి

author img

By

Published : Jul 30, 2020, 5:19 AM IST

రాష్ట్రంలో లెదర్‌ ఉత్పత్తుల పరిశ్రమలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లాల్లో చిన్న తరహా పార్కుల ఏర్పాటు కోసం..164 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమల ఏర్పాటు ద్వారా దాదాపు 3 వేల మందికి ఉపాధి కల్పించేందుకు సర్కార్‌ సంకల్పించింది

కొత్తగా ఆరు లెదర్ పార్కులు... 3 వేల మందికి ఉపాధి
కొత్తగా ఆరు లెదర్ పార్కులు... 3 వేల మందికి ఉపాధి

రాష్ట్రంలో లెదర్‌ (తోలు) ఉత్పత్తుల పరిశ్రమలను పెద్దఎత్తున అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లాల్లో చిన్న తరహా పార్కుల ఏర్పాటు కోసం 164 ఎకరాల భూమిని కేటాయించింది. వీటి ద్వారా మూడువేల మందికి ఉపాధి కల్పనను లక్ష్యంగా నిర్దేశించింది. ఈ పార్కులను ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించేందుకు వీలుగా చెన్నైలోని కేంద్ర లెదర్‌ పరిశోధన సంస్థ (సీఎల్‌ఆర్‌ఐ)తో ఒప్పందం కుదుర్చుకుంది. బహుళజాతి సంస్థలు, దేశీయ సంస్థలను పార్కుల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్య విధానం అమలుచేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్రంలో బూట్లు, చెప్పులు, కోట్లు, బ్యాగ్‌లు, బెల్టులు, కీచైన్లు తదితర ఉత్పత్తులకు భారీగా ఆదరణ ఉంది. తోలు పరిశ్రమాభివృద్ధి సంస్థ 2018-19లో రూ.16.33 కోట్లు, 2019-20లో రూ.18.32 కోట్ల మేరకు లెదర్‌ ఉత్పత్తులను విక్రయించింది.

మొదటి దశలో ఆరు జిల్లాలు..

దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ గురుకుల విద్యాలయాల విద్యార్థులకు, జాతీయ నిర్మాణ సంస్థ శిక్షణార్థులకు అవసరమైన బూట్ల విక్రయాలు ఈ సంస్థ ద్వారానే నిర్వహిస్తున్నారు. లెదర్‌ మార్కెటింగుకు రూ.200కోట్ల వరకు అవకాశాలున్నాయని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనికి అనుగుణంగా కొత్త లెదర్‌ పార్కులను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మొదటిదశలో ఆరు జిల్లాలను ఎంపిక చేసి, భూకేటాయింపులు జరిపింది. ఈ సంవత్సరాంతంవరకు వీటిని ప్రారంభించాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర తోలు ఉత్పత్తుల పరిశ్రమల ప్రోత్సాహక సంస్థను నిర్దేశించారు.


కేంద్ర సంస్థ సహకారంతో..


చెన్నైలోని కేంద్ర లెదర్‌ పరిశోధన సంస్థ దక్షిణాదిలో ఈ రంగం అభివృద్ధికి కృషి చేస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని వాటి అభివృద్ధి బాధ్యతలను అప్పగించింది. పార్క్‌లు ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ప్రజల స్థితిగతులను అధ్యయనం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటు వల్ల ప్రయోజనాలు కల్పించడం, లే అవుట్‌, మానవ వనరుల లభ్యత, యంత్రాలు, ముడిసరకు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, వ్యాపార ప్రణాళికలను రూపొందిస్తుంది. త్వరలోనే ఈ సంస్థ పార్కు ఎంపిక ప్రాంతాల్లోని దళిత యువకులకు అవగాహన, ప్రదర్శనల నిర్వహణ, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనుంది. లెదర్‌ ఉత్పత్తులను విస్తృతంగా వినియోగించే ప్రముఖ సంస్థలు దీనికి హాజరవుతాయి.

ఇవీ చూడండి: సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.