గణేశ్​ నిమజ్జనంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్

author img

By

Published : Sep 14, 2021, 3:53 PM IST

Updated : Sep 14, 2021, 4:58 PM IST

Supreme Court

15:52 September 14

గణేశ్​ నిమజ్జనంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్

హుస్సేన్​సాగర్​లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. రేపు ఉదయం సీజేఐ ధర్మాసనం ఎదుట ప్రభుత్వం మెన్షన్ చేయనుంది. హుస్సేన్‌సాగర్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం చేయొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. 

హైకోర్టు తీర్పులో ఏం చెప్పిందంటే..

సాగర్‌లో నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు విధించింది. హుస్సేన్‌ సాగర్‌లో గణేశ్‌, దుర్గాదేవి విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ టి.వినోద్‌ కుమార్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది. హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలు నిమజ్జనం చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ ఏర్పాటు చేసిన 25 కుంటల్లో నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. 

అభ్యంతరాలుంటే సుప్రీంలో సవాలు చేసుకోవచ్చు

కృత్రిమ రంగులు లేని ఇతర విగ్రహాలను సాగర్‌లో నిమజ్జనం చేయడానికి ధర్మాసనం అనుమతిచ్చింది. అయితే... ట్యాంక్‌ బండ్‌ వైపు విగ్రహాల నిమజ్జనం చేయవద్దని స్పష్టం చేసిన హైకోర్టు.. పీవీ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్‌, సంజీవయ్య పార్క్‌ వైపు నుంచి చేసుకోవచ్చని తెలిపింది. సాగర్‌లో ప్రత్యేక రబ్బర్‌ డ్యామ్‌ ఏర్పాటు చేసి.. అందులో నిమజ్జనం చేయాలని పేర్కొంది. వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని ఉన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీం కోర్టులో సవాలు చేసుకోవచ్చని సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

సమీక్షించిన సీఎం 

హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనం కార్యాచరణపై సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, పోలీసు కమిషనర్‌, పురపాలక అధికారులు, అడ్వొకేట్‌ జనరల్‌ ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు. సుప్రీంకోర్టుకు వెళ్తే ఎలా ఉంటుందనే అంశమూ ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. దీనిపై న్యాయనిపుణుల సలహా తీసుకొని ముందుకుసాగాలని సమావేశంలో నిర్ణయించారు.

సంబంధిత కథనం : Ganesh immersion: గణేశ్​ నిమజ్జనంపై తీర్పును సవరించేందుకు హైకోర్టు నిరాకరణ 

Last Updated :Sep 14, 2021, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.