ETV Bharat / city

లీజు భూములపై సర్కారు నజర్‌... ఆదాయ వనరుగా మార్చుకునే ఆలోచన

author img

By

Published : Jun 3, 2022, 7:20 AM IST

Government Nazar on leased lands
Government Nazar on leased lands

Lease Lands in Telangana : రాష్ట్రంలో వివిధ సంస్థలు, వ్యక్తులకు లీజుకిచ్చిన స్థలాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే కోణంలో ఆరా తీస్తోంది. అత్యవసరంగా వాటి వివరాలు పంపాలని కలెక్టర్లకు ఆదేశాలు పంపింది.

Lease Lands in Telangana : తెలంగాణ సర్కార్ రాష్ట్రంలో ఉన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్లు, ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చిన స్థలాలపై దృష్టి కేంద్రీకరించింది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే కోణంలో ఆరా తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థలు, రాష్ట్ర కార్పొరేషన్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు, కంపెనీలు, అసోసియేషన్లు, సొసైటీలు, ఇన్‌స్టిట్యూషన్లు, కార్పొరేట్‌ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులకు వివిధ సందర్భాల్లో భూములను లీజుకు ఇచ్చారు. వీటి వివరాలను అత్యవసరంగా పంపాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ ఆదేశించారు.

ఎనిమిది అంశాలతో నమూనా పత్రం లీజుకిచ్చిన భూములపై గతంలోనూ ఈ తరహా కసరత్తు జరిగినా ప్రభుత్వం ఇంత వేగంగా వివరాలను కోరలేదు. ప్రస్తుతం తమకు పంపే సమాచారం స్పష్టంగా ఉండాలంటూ మొత్తం ఎనిమిది అంశాలతో కూడిన నమూనాను కలెక్టర్లకు పంపింది. మండలం, గ్రామం, సర్వే నంబరు, లీజు విస్తీర్ణం, లీజు పొందిన వారి పేరు, లీజు వ్యవధి, లక్ష్యం, సంబంధిత జీవోలను పంపాలని సూచించింది. దీంతో లీజు భూములున్న ప్రాంతాల్లోని రెవెన్యూ యంత్రాంగాన్ని కలెక్టర్లు గురువారం అప్రమత్తం చేశారు.

వినియోగంలో అవకతవకలపై దృష్టి.. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, సంస్థలు, అసోసియేషన్లు తాము పొందిన లీజు భూములను నిర్దేశిత లక్ష్యానికి వినియోగించడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో భూములు తీసుకున్న కొన్ని సంస్థలు లీజు మొత్తాన్ని కూడా సమయానికి చెల్లించడం లేదన్న అభియోగాలు ఉన్నాయి. మరికొన్ని సంస్థలు భూములను ఇతర సంస్థల పేర్లపైకి మార్చాయనే ఆరోపణలూ ఉన్నాయి. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు కొన్ని సంస్థలకు అప్పటి ప్రభుత్వం వేలాది ఎకరాలను కేటాయించినా వాటిని లక్ష్యం మేరకు ఉపయోగించలేదు.

ఇదే విషయమై నాలుగేళ్ల క్రితం రెవెన్యూ శాఖ వివరాలను కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్థిరాస్తిరంగం జోరందుకుంటున్న నేపథ్యంలో.. ఆయా భూములను స్థిరాస్తి రంగానికి అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ చేపట్టింది. నిబంధనలను ఉల్లంఘించిన లీజుదారులను గుర్తించి భూములను వెనక్కి తీసుకోవడమా లేదా మరింత ఆదాయం వచ్చేలా ప్రణాళికను రూపొందించడమా అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న పలు కీలక సంస్థలకు కొన్ని జిల్లాల్లో భూమి లభించడంలేదు. ఈ నేపథ్యంలో లీజు భూములపై ప్రభుత్వం దృష్టి సారించడం చర్చనీయాంశమైంది.

ఇవీ చదవండి:నేటి నుంచి మరో దఫా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.