ETV Bharat / city

ఖరీఫ్ సాగుకు ముందే రైతు నెత్తిన విత్తనభారం

author img

By

Published : Apr 24, 2021, 7:25 AM IST

seed price hike, seed price hike in telangana, telangana farmers, kharif season in telangana
పెరిగిన విత్తన ధర, తెలంగాణలో పెరిగిన విత్తన ధరలు, తెలంగాణ రైతులపై విత్తన భారం, తెలంగాణ రైతులు

అకాల వర్షాలతో నష్టాల పాలవుతున్న అన్నదాతలకు.. వానాకాలం పంటపైనా ఆశలు వదులుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. పెరుగుతున్న విత్తన ధరలు చూసి.. రైతు గుండె గుభేలుమంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్​ సీజన్​కు విత్తన రాయితీ ప్రకటించకపోవడం వల్ల విత్తన వాణిజ్య ధరలను రాయితీ లేకుండా అమ్మడానికి టీఎస్​సీడ్స్ నిర్ణయించింది. పెరిగిన ఖర్చుల ప్రకారం ధరలు పెంచింది.

వానాకాలం (ఖరీఫ్‌) పంటల సాగు సీజన్‌ ప్రారంభానికి ముందే విత్తనాల ధరలు మండిపోతున్నాయి. ప్రైవేటు కంపెనీలతో పాటు ప్రభుత్వ సంస్థలు కూడా విత్తన ధరలు పెంచేశాయి. పత్తి తప్ప మిగతా పంటల విత్తన ధరలపై ప్రభుత్వానికి నియంత్రణ లేకపోవడంతో ఒక్కో కంపెనీ ఒక్కోరీతిన ధరలు పెంచేస్తున్నాయి.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రాయితీ ధరలకు విత్తనాలను రైతులకు విక్రయించేది. ఇందుకోసం విక్రయ ధర ఎంత, ప్రభుత్వం భరించే రాయితీ ఎంతనేది నిర్ణయించేది. ఈ సీజన్‌లో రాయితీ ఇస్తామని ప్రభుత్వం ఇంతవరకూ ప్రకటించలేదు. దీంతో విత్తన వాణిజ్య ధరలను రాయితీ లేకుండా అమ్మడానికి ‘రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ’(టీఎస్‌ సీడ్స్‌) ఖరారు చేసింది. ఇది ప్రభుత్వ సంస్థ అయినా పెరిగిన ఖర్చుల ప్రకారం ధరలను పెంచింది. ప్రైవేటు కంపెనీల సంగతి ఇక చెప్పనక్కర్లేదు.

బ్రాండు పేరు చెప్పి బాదేస్తున్నారు

రాష్ట్రంలో గతేడాది(2020) వానాకాలం సీజన్‌లో 53.50 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సీజన్‌లో వరి విత్తనాలకు డిమాండు పెరిగినందున సన్నరకాలైన సాంబమసూరి(బీపీటీ 5204) వరి విత్తన ధరను క్వింటాకు రూ.350 చొప్పున అదనంగా టీఎస్‌ సీడ్స్‌ పెంచేసింది. సాంబమసూరి.. తెలంగాణ సోనా.. కాటన్‌దొర సన్నాలు.. వీటి మూల విత్తనం ఒకటే అయినా ఒక్కో కంపెనీ ఒక్కో బ్రాండు పేరు పెట్టి ధరలు పెంచుతున్నాయి. టీఎస్‌ సీడ్స్‌ క్వింటా సాంబమసూరి విత్తనాల ధరను రూ.3450గా నిర్ణయించడంతో.. కొన్ని ప్రైవేటు కంపెనీలు రూ.4000- 4500 దాకా ధర చెబుతున్నాయి.

జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా పరిశోధన కేంద్రాల్లో విత్తన పంటలు సాగు చేయించింది. తెలంగాణ సోనా రకం క్వింటాకు రూ.4400కి అమ్ముతోంది. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 12.16 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను రైతులు కొంటారని వ్యవసాయశాఖ అంచనా. పత్తి విత్తనాల ప్యాకెట్‌ ధరను రూ.730 నుంచి 767 రూపాయలకు ఇటీవల కేంద్రం పెంచింది. కోటిన్నర ప్యాకెట్లను రైతులు కొంటారని అంచనా. సోయాచిక్కుడు విత్తనాల ధరను రూ.6645 నుంచి 9700 రూపాయలకు పెంచారు. అంటే క్వింటాకు రూ.3055 అదనంగా పెరిగింది. ఈ సీజన్‌లో కంది పంటను భారీగా వేయాలని వ్యవసాయశాఖ రైతులకు సూచించింది. లక్ష క్వింటాళ్ల కంది విత్తనాలు రైతుల కొంటారు. ఇదే అదనుగా కంది విత్తనాల ధరను క్వింటాకు అదనంగా రూ.877 టీఎస్‌ సీడ్స్‌ పెంచింది.

ఏదైనా ఒకటే :

వరి మూల విత్తనాలు ఒకటే. తెలంగాణ సోనా రకం సన్న విత్తనాలను జయశంకర్‌ వర్సిటీ అభివృద్ధి చేసింది. వీటి మూల విత్తనాలను అన్ని ప్రైవేటు కంపెనీలకు వర్సిటీ ఇచ్చింది. కానీ కంపెనీలు బ్రాండ్‌ పేరు పెట్టి అధిక ధరలు నిర్ణయించడం వల్ల రైతులపై అదనపు ఆర్థికభారం పడుతోంది.

- డా. జగదీశ్వర్‌, పరిశోధన సంచాలకుడు, జయశంకర్‌ వర్సిటీ

విత్తన ధరలు పెరిగిన తీరు
రైతులపై అదనపు ఆర్థిక భారం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.