Corn Farmers problems: అమ్ముకోలేక.. ఉంచుకోలేక.. మొక్కజొన్న రైతుల అవస్థలు

author img

By

Published : Nov 21, 2021, 5:24 AM IST

telangana Corn Farmers problems to sell Crop yield in market

వరి రైతులతోపాటు రాష్ట్రంలో మొక్కజొన్న పండించే(maize cultivation in telangana)వారి పరిస్థితి అధ్వానంగా మారింది. పండించిన పంటను ప్రభుత్వం అధికారికంగా కొనుగోలు(maize farmers market) చేయకపోవడంతో... మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే ధరలు పడిపోవడం, వర్షాలకు మక్కలు తడిసిపోయాయన్న సాకుతో.... వ్యాపారులు నానా కొర్రీలు పెట్టి దోపిడి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు(maize farming in telangana) మరోసారి నష్టపోతున్నారు. ప్రభుత్వం, మార్క్‌ఫెడ్ సంస్థ మక్కలు కొనకపోవడంతో... వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో... పంట చేతికొచ్చిన తర్వాత ధరలు పడిపోవడంతో... రైతులు నష్టాలే మిగులుతున్నాయి. గత నెల వరకు మొక్కజొన్న క్వింటాల్ ధర 2 వేల100 రూపాయలు ఉండగా... ఇప్పుడు 1800కు చేరింది. దానికి తోడు వర్షాలు కురుస్తుండటంతో మక్కలు ఎక్కడివక్కడే తడిసి ముద్దవుతున్నాయి. దీంతో వ్యాపారులు తేమ కారణం చూపించి ధర మరింత తగ్గించి ఇస్తున్నారు. చాలా గ్రామాల్లో పూర్తి నాణ్యత దెబ్బతినడంతో కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతోన్నారు. ధరల తగ్గుదల, వాతావరణ ప్రభావంతో చివరకు నష్టాలే మిగులుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో విస్తారంగా పంటలు సాగయ్యాయి. వరి మినహా మిగిలిన పంటలు మద్దతు ధరలకు కొనుగోలు చేసే అవకాశాల్లేవు. పంటల కొనుగోళ్లు లేక మార్క్‌ఫెడ్‌ ఏడాదిగా ఖాళీగా ఉంటోంది. వర్షాలు, తెగుళ్లకు మొక్కజొన్న పంట దెబ్బతింటుండగా... చేతికొచ్చే కొద్ది దిగుబడికీ ధర కరవై రైతులు నష్టపోతున్నారు. మొక్కజొన్న పంటను తెలంగాణలో మద్దతు ధరకు కొనడానికి కేంద్రం నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని సొంతంగా కొనేదిలేదని సంకేతాలు ఇవ్వడంతో తమకు పోటీ లేదని భావిస్తున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ధరలు అమాంతం తగ్గించేసి కొనుగోలు చేస్తున్నారు. ఈ సీజన్‌లో మొక్కజొన్న 7.04 లక్షల ఎకరాల్లో సాగవగా... 13.81 లక్షల దిగుబడి వస్తుందని అధికారిక అంచనా. వ్యాపారులు క్వింటాల్‌కు ఎంఎస్‌పీ కంటే 200 నుంచి 300 రూపాయలకు పైగా తగ్గించి కొనుగోలు చేస్తుండటంతో రైతులు కోట్ల రూపాయలు నష్టపోయే ప్రమాదముంది.

తాజా పరిణామాలతో మొక్కజొన్న రైతుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. వరుణుడు కన్నెర్రజేయడంతో వరి, మొక్కజొన్న రైతులు... ఈ సారి గోస అంతా ఇంతా కాదు. అన్ని విధాలుగా ప్రకృతి సహకరించి పచ్చటి పైరు మెరిసి... ఇళ్లూ వాకిళ్లూ నింపితే... మురిసిపోయిన రైతులు... ఆ కుప్పల వద్దే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఇటీవల కురుస్తున్న వర్షాలకు మొక్కజొన్న పంటంతా తడిసిపోయి దెబ్బతినడంతో నాణ్యత కొరవడటం వల్ల పౌల్ట్రీ వర్గాలు తిరస్కరిస్తుండటంతో తాము కూడా కొనాలంటే ఇబ్బందిగా ఉందని వర్తకులు చెబుతున్నారు.

రాష్ట్రంలో పండిన మొక్కజొన్నను ప్రభుత్వం నేతృత్వంలో రైతుల నుంచి సేకరించడంతోపాటు తడిసిపోయిన పంటంతా కూడా పరిగణలోకి తీసుకోవాలన్న డిమాండ్‌ తెరపైకి వచ్చింది. భారీగా పెట్టుబడులు పెట్టి నాణ్యమైన పంట చేతికొస్తున్న వేళ ప్రకృతి సహకరించకపోవడంతో జరిగిన నష్టం భర్తీ చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.