ETV Bharat / city

మరింత సులభంగా ధరణి పోర్టల్.. సమీక్షలో సీఎం కేసీఆర్

author img

By

Published : Jan 11, 2021, 7:06 PM IST

Updated : Jan 11, 2021, 7:31 PM IST

ప్రగతిభవన్‌లో మంత్రులు, కలెక్టర్లతో సమీక్షించిన సీఎం రెవెన్యూ శాఖకు పలు సూచనలు చేశారు. ధరణి పోర్టల్‌తో పాటు వివాదాస్పద భూములపై మార్గనిర్దేశం చేశారు. ఉద్యోగుల పదోన్నతులపైనా సంక్రాంతి వేళ సీఎం తీపికబురు అందించారు.

telangana cm kcr review with ministers and collectors on all departments
ధరణి పోర్టల్​ మార్పులు అవసరం

వారంలోగా మార్చాలి

రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులకు మార్గనిర్దేశం చేశారు. వారం రోజుల్లో ధరణి పోర్టల్‌లో మార్పులు, చేర్పులు పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ధరణి పోర్టల్ వంద శాతం విజయవంతమైందన్న ముఖ్యమంత్రి.. అవసరమైన మార్పులను వారం రోజుల్లో పూర్తిచేయాలని కలెక్టర్లకు నిర్దేశం చేశారు. రెవెన్యూ సమస్యలను కలెక్టర్లే స్వయంగా పూనుకొని పరిష్కరించాలని సీఎం స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్లు పూర్తయిన భూముల మ్యుటేషన్‌ను కలెక్టర్లే నిర్వహించాలన్నారు. పెండింగ్ మ్యుటేషన్ల కోసం తాజాగా దరఖాస్తులు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి.. వారం రోజుల్లోగా ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

ఫిబ్రవరిలో బడి గంట

అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని.. ఖాళీలన్నీ ఒకేసారి భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. కరోనా ప్రభావంతో మూతపడిన పాఠశాలలు.. సుదీర్ఘ విరామం తర్వాత పాక్షికంగా తెరచుకోనున్నాయి. ఫిబ్రవరి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖను ఆదేశించారు. 9వ తరగతితోపాటు ఆపై తరగతుల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఉద్యోగులకు గుడ్​న్యూస్

పదోన్నతుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు వరమిచ్చారు. పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత దస్త్రంపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, కలెక్టర్లతో సమీక్షించిన సీఎం-కేసీఆర్..కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ, రెవెన్యూ, ఉద్యోగ ఖాళీలు తదితర అంశాలపై మార్గనిర్దేశం చేశారు.

మరో అవకాశం

ఎన్​ఆర్​ఐలకు పాస్‌పోర్ట్ నంబర్‌ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని.. కంపెనీలు, సొసైటీల భూములకు పాస్‌బుక్‌లు అందించాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. గతంలో ఆధార్‌ నంబర్‌ ఇవ్వని వారికి మరో అవకాశం కల్పించాలన్నారు. ఆధార్ నంబర్‌ నమోదు చేసుకొని పాసుపుస్తకాలు ఇవ్వాలని ఆదేశించారు. కోర్టు కేసులు మినహా పార్ట్‌-బిలో చేర్చిన అంశాలు.. సాదాబైనామాల క్రమబద్దీకరణ దరఖాస్తులను కలెక్టర్లు పరిష్కరించాలని స్పష్టం చేశారు. జీపీఏ, ఎస్పీఏ, ఏజీపీఏ చేసుకోవడానికి ధరణిలో అవకాశం కల్పించాలని కలెక్టర్లు, మంత్రులతో భేటీలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

వ్యాక్సినేషన్​కు రంగం సిద్ధం

రాష్ట్రంలో 1,213 కేంద్రాల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు. టీకా తరలించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వ్యాక్సిన్ కోసం అన్ని స్థాయిల్లో వాలంటీర్లు సిద్ధం చేశామన్న కేసీఆర్.. ముందస్తుగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. టీకా వేసిన తర్వాత అవసరమైన చికిత్సకు ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. వ్యాక్సినేషన్​ను సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. జిల్లా, మండల స్థాయిలో టాస్క్​ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యాక్సినేషన్​లో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు.

మంత్రులకు అభినందనలు

అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు నిర్మించాలన్నారు. జనాభాకు అనుగుణంగా వైకుంఠధామాలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వైకుంఠధామాల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. పల్లెప్రగతి బాగా అమలవుతోందన్న సీఎం-కేసీఆర్.. మంత్రి ఎర్రబెల్లి, అధికారులను అభినందించారు. రైతువేదికలను త్వరగా పూర్తి చేశారని మంత్రి నిరంజన్‌రెడ్డిని అభినందించారు. పట్టణప్రగతిపై మరోసారి సమావేశం నిర్వహిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు.

Last Updated : Jan 11, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.