ETV Bharat / city

Dalit Empowerment: బ్యాంక్ గ్యారంటీ లేకుండానే ఎస్సీలకు రుణాలు, ఆర్థికసాయం: సీఎం

author img

By

Published : Jun 27, 2021, 7:10 PM IST

Updated : Jun 27, 2021, 7:31 PM IST

ఎస్సీ యువత పారిశ్రామిక, సాంకేతిక సహా ఇతర రంగాల్లో స్వయం ఉపాధి పొందాలని సీఎం కేసీఆర్​ ఆకాంక్షించారు. ప్రగతిభవన్​లో సీఎం దళిత సాధికారతపై.. సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలని.. అట్టడుగున ఉన్న వారి నుంచి సహాయం ప్రారంభించి వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ అభిలషించారు. గోరటి వెంకన్న.. గల్లీ చిన్నది.. పాటను గుర్తుచేసుకున్న సీఎం.. మనసు పెట్టి వింటే దళితుల సమస్యకు ఆ పాటలో పరిష్కారాలు దొరుకుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Cm kcr Meeting on  Dalit Empowerment
Cm kcr Meeting on Dalit Empowerment

దళిత సాధికారతను సాధించడానికి ప్రభుత్వం మిషన్ మోడ్​లో పనిచేయడానికి నిశ్చయించుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు. అందుకు అఖిలపక్ష నేతలందరూ కలిసిరావాలని సీఎం కేసీఆర్ కోరారు. ఈ బడ్జెట్​లో సీఎం దళిత సాధికారత పథకానికి వాస్తవానికి రూ.1000 కోట్లు కేటాయించాలనుకున్నాం.. కానీ వాటితో పాటు మరో రూ.500 కోట్లు పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో 35 నుంచి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చుచేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని వివరించారు. ఈ బడ్జెట్ ఎస్సీ సబ్​ప్లాన్​కు ఇది అదనమని పేర్కొన్నారు.

ప్రగతిభవన్​లో సీఎం దళిత సాధికారతపై.. కేసీఆర్​ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. తనకు భగవంతుడిచ్చిన సర్వ శక్తులన్నీ ఉపయోగించి సీఎం దళిత సాధికారత పథకాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నానని అఖిలపక్ష నేతలతో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఇన్నాళ్లు ఇలా.. ఇప్పుడు మరోలా..

రైతుబంధు పథకం, ఆసరా పింఛన్ల మాదిరి నేరుగా ఆర్థికసాయం అందే విధంగా... అత్యంత పారదర్శకంగా, దళారీలు లేని విధానం కోసం సూచనలు సలహాలు ఇవ్వాలని అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులకు సీఎం కేసీఆర్ కోరారు. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగిందని... మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో దళిత యువత స్వయం ఉపాధి అన్వేషించాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.

భేటీ మధ్యలో 'గల్లీ చిన్నది' పాటను గుర్తుచేసుకున్న సీఎం..

దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరపాలని.. అట్టడుగున ఉన్న వారి నుంచి సహాయం ప్రారంభించి వారి అభ్యున్నతిని సాంకేతిక విధానం ద్వారా నిత్యం పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ అభిలాషించారు. అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. ఈ సందర్భంగా గోరటి వెంకన్న.. గల్లీ చిన్నది.. పాటను సీఎం స్మరించుకున్నారు. మనసు పెట్టి వింటే దళితుల సమస్యకు ఆ పాటలో పరిష్కారాలు దొరుకుతాయని సీఎం అభిప్రాయపడ్డారు.

15 రోజులు ఎస్సీల భూముల గణన మీదే..

ఎస్సీలకు ఉన్న భూమి గణన చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశించారు. లెక్కలు స్థిరీకరించి సమగ్ర నివేదిక అందజేయాలని సూచించారు. 15 రోజులు ఎస్సీల భూముల గణన మీదే యంత్రాంగం పనిచేయాలని నిర్దేశించారు. ఎస్సీల కోసం చేపట్టాల్సిన కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం స్పష్టం చేశారు.

అసైన్డ్‌ భూములకు కూడా పట్టాభూముల ధరనే చెల్లిస్తున్నామన్న సీఎం.. గ్యారంటీ లేకుండానే ఎస్సీలకు బ్యాంక్ రుణాలు, ఆర్థికసాయం చేస్తామన్నారు. ఎస్సీ బిడ్డలు నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకోవాలని.. అందుకు ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.

పటిష్ఠంగా సీఎం దళిత సాధికారత..

గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను విడివిడిగా గుర్తించి పరిష్కారాలు వెతకాలని అఖిలపక్ష నేతలకు సూచించారు. దళితుల సామాజిక, ఆర్థిక సమస్యలను గుర్తించి సమష్టి కృషితో ఫలితాలు సాధించాలన్నారు. దళితుల అభ్యున్నతికి సీఎం దళిత సాధికారతను పటిష్ఠంగా అమలుచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్​ స్పష్టం చేశారు.

సఫాయన్న నీకు సలాం..

సఫాయన్న నీకు సలాం అనే నినాదం తనదని సీఎం అన్నారు. సఫాయి కార్మికులు తల్లిదండ్రుల కన్నా ఎక్కువన్నారు. ఎవరూ అడగకుండానే ప్రతిసారీ సఫాయి కార్మికుల జీతాలు పెంచుతున్నామని చెప్పారు. వారికి ఉద్యోగ భద్రతతో కూడిన నిర్మాణాత్మక జీతభత్యాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

వారి ప్రవర్తనలో ఇకనైనా మార్పు రావాలి..

ఎస్సీల కోసం తెచ్చిన పథకాలను పటిష్ఠంగా అమలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచించారు. సీఎం ఆలోచనలను అధికారులు అమలు చేస్తారనే విశ్వాసం ఉందన్నారు. మరియమ్మ ఘటనలో ఎస్సీలకు భరోసా, ధైర్యాన్ని ఇచ్చారని కొనియాడారు. పోలీసుల ప్రవర్తనలో ఇకనైనా మార్పు రావాలని భట్టి అభిప్రాయపడ్డారు. ఎస్సీ బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అఖిలపక్ష సమావేశంలో భట్టి విక్రమార్క సూచించారు.

అప్పట్లోనే కేసీఆర్​ అలా..

దళిత సాధికారత కోసం సీఎం స్వయంగా ముందుకు రావడం, అటువంటి ఆలోచన చేయడం సంతోషంగా ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్​రెడ్డి అభిప్రాయపడ్డారు. 2003లోనే దళిత సాధికారత కోసం కేసీఆర్.. సమావేశం ఏర్పాటు చేసి, అనేక అంశాలు చర్చించడం తనకు ఇంకా గుర్తుందని చాడ అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణ లక్ష్మి వంటి పలు అభివృధ్ధి సంక్షేమ పథకాలు దళితులకు భరోసానిస్తున్నానని చాడ తెలిపారు.

దళిత సమాజంలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయి..

దళిత సాధికారత కోసం.. సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవ, దృఢ నిశ్చయం.. సంతోషాన్ని కలిగిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. మరియమ్మ లాకప్​డెత్ కేసులో.. సీఎం తక్షణం స్పందించి తీసుకున్న నిర్ణయాలు దళిత సమాజంలో ఆత్మస్థైర్యాన్ని పెంచాయని అభిప్రాపడ్డారు. దళిత సాధికారత కోసం, ప్రభుత్వ నిర్ణయాలను అధికారులు చిత్తశుద్ధితో అమలుపరచాలని.. సర్కారుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

మోత్కుపల్లి స్పందన..

ఎస్సీల అభివృద్ధికి కోసం అందరి సలహాలు తీసుకోవడం హర్షణీయమని భాజపా నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సీఎం నిర్ణయాల వల్ల ఎస్సీల్లో నూతనోత్తేజం కలిగిందని అభిప్రాయపడ్డారు.

అన్యాయానికి గురైన ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. దళారులు లేకుండా ఎస్సీలకు నేరుగా ఆర్థికసాయం చేస్తేనే మేలని మోత్కుపల్లి అభిప్రాయపడ్డారు. రైతుబంధు తరహాలో నేరుగా ఆర్థికసాయం చేయాలని అఖిలపక్ష భేటీలో సూచించారు. గురుకులాలతో ఎస్సీ విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని తెలిపారు.

కులాంతర వివాహాలను ప్రోత్సహించడం సహా దళితుల మీద దాడులు జరిగితే ఊరుకొనేది లేదని రీతిలో కార్యాచరణ చేపట్టి.. దళితులకు మరింత ధైర్యం నింపాలని అఖిలపక్ష సమావేశంలో పలువురు నేతలు సూచించారు.

మోత్కుపల్లిపై సీరియస్​..

ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉండాలన్న భాజపా నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ పార్టీ నేత మోత్కుపల్లి హాజరయ్యారు. ఈ విషయంపై నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో భాజపా దళిత నాయకులు సమావేశమయ్యారు. సీఎం అఖిలపక్ష సమావేశానికి మోత్కుపల్లి నర్సింహులు పాల్గొనడాన్ని తీవ్రంగా పరిగణించారు.

ఇదీచూడండి: జులై 7న పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతా: రేవంత్‌రెడ్డి

Last Updated :Jun 27, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.