ETV Bharat / city

విమానాలు నడిపేస్తుంది... అనుభవాలు చెప్పేస్తుంది!

author img

By

Published : Jul 4, 2020, 8:50 AM IST

ritu rathee taneja
ritu rathee taneja

‘ఆడపిల్లకు పెద్ద చదువులే దండగ... పెళ్లి చెయ్యడం మానేసి అమెరికా పంపిస్తామంటున్నారు. బావుంది వరుస’ అంటూ బంధువులు తలోమాట అన్నారు. ఇలాంటి దెప్పిపొడుపులే కాదు.. అమ్మ మరణం, అప్పుల బాధలు ఇవేమీ రీతూ రతి తనేజాని అనుకున్న లక్ష్యం నుంచి వెనక్కి లాగలేకపోయాయి. పైలట్‌ కావాలన్న లక్ష్యాన్ని సాధించింది. అంతటితో ఆగిపోలేదు.. భర్తతో కలిసి ప్రారంభించిన ఫ్లైయింగ్‌బీస్ట్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ ఆమెని సెలెబ్రిటీని చేసింది...

వృత్తిరీత్యా పైలట్‌ అయిన రీతూది హరియాణాలోని ఓ కుగ్రామం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచీ చదువుల్లో ప్రతిభ చూపేది. అందుకే ఎంత కష్టపడైనా బాగా చదివించాలనుకునేవారు రీతూ తల్లిదండ్రులు. బంధువులు మాత్రం ఆడపిల్లకు పెద్దచదువులు, ఉద్యోగాలు అవసరమా? పెళ్లి చేసేయండి అంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారు. అలాంటి వాతావరణంలోనే రీతూ డిగ్రీ పూర్తి చేసింది. ఓ స్నేహితురాలి సలహాతో పైలట్‌ శిక్షణకు దరఖాస్తు చేసుకుంది. ఎనిమిదినెలల తరువాత శిక్షణకు రమ్మని పిలుపొచ్చింది. అప్పటివరకూ ఆ విషయం ఇంట్లో వాళ్లకి తెలియదు. అమెరికాలో ట్రైనింగ్‌. బాగా ఖర్చవుతుంది. అమ్మానాన్నలు ఏమంటారో అని భయపడుతూనే తనకొచ్చిన అవకాశం గురించి చెప్పింది. తన పెళ్లికోసం దాచిన డబ్బుని శిక్షణకోసం ఇస్తే... కచ్చితంగా వాళ్లని గర్వపడేలా చేస్తానని హామీ కూడా ఇచ్చింది. మొదట వద్దనుకున్నా...రీతూ పట్టుదల చూసి తల్లిదండ్రులు సరే అన్నారు. ఈ విషయం తెలిసిన చుట్టాలు మాత్రం ఆడపిల్లను దేశం కాని దేశం పంపిస్తున్నారు. అబ్బాయిలతో తిరిగి చెడిపోతుంది అంటూ పాతపాటే పాడారు. కానీ రీతూ తల్లిదండ్రులు ఆమె శక్తిసామర్థాల్యపై నమ్మకం ఉంచి పూర్తి స్వేచ్ఛనిచ్చారు.

పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసింది...

అమెరికాలో ఏడాదిన్నర శిక్షణ తరువాత ఇండియాకు తిరిగి వచ్చింది రీతూ. మొదట్లో ఆమెకు నో వేకెన్సీ అన్నమాటే ఎక్కువగా వినబడేది. దాంతో కొన్నాళ్లు ఇంట్లో ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమె తల్లి బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చనిపోయింది. తర్వాత ఆర్థిక ఇబ్బందులూ చుట్టుముట్టాయి. ఇల్లు గడవడానికి తండ్రి అప్పులు చేయాల్సి వచ్చింది. దాంతో రీతూ ఓ నిర్ణయానికి వచ్చింది. పార్ట్‌టైమ్‌ ఉద్యోగం ఏమైనా చేస్తూనే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని. ఇంటి పనంతా చేసుకుని ఉద్యోగానికి వెళ్లేది... తిరిగి వచ్చాక మరో మూడునాలుగు గంటల పాటు చదివేది. పట్టు వదలకుండా ప్రయత్నించి ఎయిర్‌లైన్స్‌లో కోపైలట్‌గా ఉద్యోగాన్ని అందుకుంది. ఉద్యోగంలో చేరిన నాలుగేళ్లలో 60 విమానాలు నడిపి...కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుంది. ఇదంతా ఒకెత్తు. ఊహించని మరోమలుపే రీతూని సెలెబ్రిటీగా మార్చింది.

యూట్యూబ్‌తో పాపులర్‌...

రీతూకి గౌరవ్‌తో పెళ్లయ్యింది. ఇద్దరికీ ఫిట్‌నెస్‌ అంటే మహాఇష్టం. ఇద్దరూ కలిసి లైవ్‌ కార్యక్రమాలు చేసేవారు. వాటికి ఆదరణ పెరగడంతో ‘ఫిట్‌మజిల్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ని ఏర్పాటు చేశారు. జనాల నుంచి విపరీతమైన ఆదరణ వచ్చింది. ఒక్క ఫిట్‌నెస్‌ ప్రేమికుల కోసం మాత్రమే కాకుండా అందరికీ చేరువకావాలనే ఉద్దేశంతో ‘ఫ్లైయింగ్‌ బీస్ట్‌’ పేరుతో మరో యూట్యూబ్‌ ఛానెల్‌ని ఏర్పాటు చేసింది. రోజురోజుకీ ఆ ఛానెల్‌కి అభిమానులు పెరుగుతుండటంతో ఫిట్‌నెస్‌, ఫ్యామిలీ, పర్సనల్‌ లైఫ్‌, ట్రావెల్‌ అంటూ ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో వ్లాగ్‌లను రీతూ చేయడం మొదలుపెట్టింది. పైలట్‌గా తాను ఆకాశంలో చూసిన అద్భుతాలని వీక్షకులతో పంచుకోవడం ప్రారంభించింది. అద్భుతమైన ఆదరణ లభించింది. లాక్‌డౌన్‌ సమయంలో ఈ జోరు మరింత పెంచింది రీతూ. వీరి ఛానెల్‌ని చూసే వారి సంఖ్య ప్రస్తుతం ముప్ఫైలక్షలు దాటేసింది. దాంతో యూట్యూబ్‌ ఫ్యాన్‌ మీట్‌కి హాజరయ్యే అవకాశం దక్కించుకున్నారు ఈ జంట. దుబాయ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మన దేశం నుంచి ముగ్గురు హాజరైతే అందులో ఈ జంట కూడా ఉండటం విశేషం. మరోపక్క దేశ పర్యటక అభివృద్ధి కోసం భారతప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. వాటికోసం ప్రత్యేక వీడియోలూ చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.