ETV Bharat / city

సమస్యలకు చిరునామా.. వనస్థలిపురం దవాఖానా

author img

By

Published : Nov 6, 2020, 11:54 AM IST

హైదరాబాద్​లోని వనస్థలిపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సౌకర్యాల లేమి.. రోగుల మృతికి దారితీస్తోంది. విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులకు ఏర్పాటు చేసిన వెల్​నెస్ సెంటర్​లో మందుల కొరత తీవ్ర ఇబ్బందికి గురిచేస్తోంది. ఇప్పటికే హోమియో ఆసుపత్రికి వైద్యులు లేకపోవటం వల్ల దాన్ని మొత్తమే మూసేశారు. ఓ వైపు పెరుగుతున్న రోగుల తాకిడితో పాటు సమస్యలు సైతం హెచ్చుతూ... ఇబ్బందులకు కేంద్రంగా మారుతోంది.

వనస్థలిపురం సర్కారు దవాఖానా... సమస్యలకు చిరునామా
వనస్థలిపురం సర్కారు దవాఖానా... సమస్యలకు చిరునామా

హైదరాబాద్​లోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి సమస్యలకు నెలవుగా మారింది. వైద్య సిబ్బంది కొరత, చికిత్స అత్యవసర విభాగాలు లేకపోవడం వల్ల ఆసుపత్రికి వచ్చిన కొందరు రోగులు తీవ్ర ఇబ్బందులు పడగా... మరికొందరి ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.

గతంలో నిత్యం 200 నుంచి 400 మంది రోగులు ఆసుపత్రికి వచ్చేవారు. కాలక్రమేణా ఈ సంఖ్య 1500కి చేరింది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మీర్​పేట్ పరిధిలో ఈ ఆసుపత్రి ఒక్కటే ఉండటం వల్ల నెలకు సుమారు 5000 గర్భణీలు వైద్య సేవల కోసం వస్తారు. సోమ, బుధవారాల్లో ఆసుపత్రిలో గర్భిణుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇటీవల కరోనా పరిక్షల కోసం వచ్చేవారు సైతం ఎక్కువే. పెరుగుతున్న రోగుల సంఖ్యతో పాటు ఆసుపత్రిలో సేవలు సైతం మెరుగుపడాల్సింది పోయి... తరుగుపడుతున్నాయి. వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవటం వల్ల ప్రజలు పడిగాపులు పడుతున్నారు. సౌకర్యాలు, మందులు లేకపోవటం వల్ల వేరే ఆసుపత్రి కోసం సుదూర ప్రాంతాలకు పయనమవుతూ ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వెల్​నెస్​ సెంటర్లను ఏర్పాటు చేసింది. నగరంలో ముందుగా ఖైరతాబాద్... ఆ తర్వాత వనస్థలిపురం సెంటర్లను ప్రారంభించారు. మొదట్లో అన్ని రకాల పరీక్షలతోపాటు వైద్యులు, మందులు అందుబాటులో ఉండేవి. కానీ... ఏడాది కాలంగా ఈ వెల్​నెస్​ సెంటర్లలో సేవలు క్రమంగా నిలిచిపోతున్నాయి. పరీక్షలకు నారాయణగూడ ఐపీఎం సెంటర్​కు పంపిస్తున్నారు. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా వినియోగించే షుగర్, బీపీ మందులు సైతం ఉండటం లేవని సిబ్బంది చెప్పటం పరిపాటిగా మారింది.

ఇప్పటికైనా అధికారులు స్పందించి వైద్యులు, మందుల కొరత లేకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అన్ని రకాల పరీక్షల విభాగాలను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇదీ చూడండి: యథేచ్ఛగా ఇసుక దందా... చూసీచూడనట్లు అధికారుల పంథా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.