ETV Bharat / city

Viveka Murder Case: వివేకా హత్య కేసులో ఉమాశంకర్‌రెడ్డి పాత్ర.!

author img

By

Published : Nov 7, 2021, 9:23 AM IST

ఏపీ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో.. సీబీఐ కీలక విషయాలు రాబట్టింది. నిందితుడు గజ్జల ఉమాశంకర్‌ రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలున్నాయని సీబీఐ పేర్కొంది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో.. ఆయన రహదారిపై పరుగు తీస్తున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని దుకాణం వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని వెల్లడించింది.

Viveka Murder Case
వివేకా హత్య కేసు

ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు గజ్జల ఉమాశంకర్‌రెడ్డి పాత్రకు సంబంధించి ఆధారాలున్నాయని సీబీఐ పేర్కొంది. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో.. ఆయన రహదారిపై పరుగు తీస్తున్నట్లు వివేకా ఇంటి సమీపంలోని దుకాణం వద్ద అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని వెల్లడించింది. వివేకా వద్ద పీఏగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి సోదరుడు, ఈ కేసులో నిందితుడిగా జైల్లో ఉన్న గజ్జల ఉమాశంకర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ శనివారం కడపలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక సెషన్స్‌ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా దాఖలు చేసిన కౌంటర్‌లో సీబీఐ సంచలన విషయాలను వెల్లడించింది. వివేకా హత్యలో ఎర్ర గంగిరెడ్డి, యాదటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్‌ దస్తగిరి పాత్ర ఉందని పులివెందుల కోర్టులో అక్టోబరు 27న సీబీఐ ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేసింది. ఇవన్నీ పరిశీలించిన కోర్టు కేసులో వాస్తవాలను తేల్చేందుకు సీబీఐ ప్రయత్నిస్తున్నందున, ప్రస్తుత దశలో బెయిల్‌ ఇవ్వడం సాధ్యం కాదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

ధ్రువీకరించిన ఎఫ్‌ఎస్‌ఎల్‌
విచారణలో భాగంగా సీబీఐ తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు విన్పించారు. వివేకా హత్యకు కుట్రలో ఉమాశంకర్‌రెడ్డి పాత్ర కీలకమని, ఆయన నార్కో అనాలసిస్‌ పరీక్షకు కూడా అంగీకరించలేదని పేర్కొన్నారు. ‘తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఉమాశంకర్‌రెడ్డి రహదారిపై పరుగు తీస్తున్న దృశ్యాలు వివేకా ఇంటి సమీపంలోని బ్రిడ్జ్‌ స్టోన్‌ దుకాణం వద్ద సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆయన పరుగు తీరును స్వతంత్ర సాక్షులు, వ్యక్తుల సమక్షంలో వీడియో రికార్డు చేశాం. దీన్ని, సీసీటీవీ రికార్డును గుజరాత్‌ గాంధీనగర్‌లోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ డైరెక్టర్‌, బెంగళూరులోని ఫిల్మ్‌ ఫ్యాక్టర్‌కు పంపాం. రెండు పరుగుల్లోనూ సారూప్యత ఉందని అవి అభిప్రాయపడ్డాయి’ అని సీబీఐ పేర్కొంది.

వ్యూహాత్మకంగా వ్యవహరించారు
వివేకానందరెడ్డి హత్య విషయంలో తమ కదలికలు బయటపడకుండా నిందితులు వ్యూహాత్మకంగా వ్యవహరించారని సీబీఐ వెల్లడించింది. ‘హత్యకు పది రోజుల ముందు వివేకా ఇంట్లోని కుక్కను.. సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి కారుతో ఢీకొట్టి చంపారు. నిందితుల్ని గుర్తించే ప్రక్రియలో ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, దస్తగిరి, ఉమాశంకర్‌రెడ్డిలను కాపలాదారు రంగన్న గుర్తించారు. హత్య జరిగిన రోజు రాత్రి సంఘటనాస్థలి నుంచి వారు వెళ్లడం చూశానని ఆయన వాంగ్మూలంలో పేర్కొన్నారు. సునీల్‌, ఉమాశంకర్‌, దస్తగిరిలు గోడదూకి పారిపోయారని, ఎర్రగంగిరెడ్డి బయటకు వెళ్తూ.. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని తనను బెదిరించారని రంగన్న చెప్పారు. 2019 మార్చి 15న ఎర్ర గంగిరెడ్డి ఇంట్లో వారంతా సమావేశమయ్యారు. పోలీసుల సంగతి తాను చూసుకుంటానని ఆయన హామీ ఇచ్చినట్లు రంగన్న వాంగ్మూలంలో పేర్కొన్నారు’ అని సీబీఐ తెలియజేసింది. నిందితుడిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారించారని, సీబీఐ ప్రాథమిక అభియోగపత్రాన్ని దాఖలు చేసిందని, విచారణ కూడా పూర్తయిందని ఉమాశంకర్‌రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. దర్యాప్తునకు తన క్లయింట్‌ సహకరిస్తారని, బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ప్రాథమిక అభియోగపత్రం దాఖలు చేసినప్పటికీ.. హత్య వెనక కుట్ర, ఉద్దేశాలేమిటో తేల్చేందుకు తదుపరి విచారణ చేయాల్సి ఉందని సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదించారు. సునీల్‌తో కలిసి దాడి చేసిన నేపథ్యంలో ఉమాశంకర్‌రెడ్డి బెయిల్‌కు అనర్హుడని, ఆయన పిటిషన్‌ కొట్టేయాలని అభ్యర్థించారు.

ఈ దశలో బెయిల్‌ ఇవ్వలేం

కుట్రదారులెవరో తేల్చేందుకు తదుపరి విచారణ చేయాల్సి ఉందని సీబీఐ ప్రాథమిక అభియోగపత్రంలో పేర్కొందని ప్రత్యేక సెషన్స్‌ జడ్జి వి.శ్రీనివాస శివరామ్‌ ఉత్తర్వుల్లో తెలిపారు. వివేకాను గొడ్డలితో నరికి చంపినవారిలో ప్రధాన కుట్రదారుడైన గంగిరెడ్డితో పాటు డ్రైవర్‌ దస్తగిరి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి ఉన్నారని కాపలాదారు రంగన్న తన వాంగ్మూలంలో పేర్కొన్నారని గుర్తుచేశారు. కుట్రకోణం తేల్చడానికి తదుపరి విచారణ కొనసాగించాల్సి ఉన్నందున, ఈ దశలో బెయిల్‌ ఇవ్వలేమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: TSRTC: త్వరలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగే అవకాశం.. నేడు కీలక భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.