ఇంటింటా జ్వరాలు.. పొరపాటు జరిగితే తీవ్ర అనర్థానికీ దారి..

author img

By

Published : Aug 2, 2022, 6:40 AM IST

fevers

Seasonal Fevers in Telangana : జ్వరమొచ్చింది! ఎవరి నోట విన్నా ఇదే మాట. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు. అందరినీ చుట్టుముట్టేస్తోంది. ఇప్పటికే కొవిడ్‌తో సతమతమవుతుండగా. దీనికి తోడు డెంగీ, మలేరియా, ఫ్లూ జ్వరాల వంటివీ విజృంభిస్తున్నాయి. ఈ విష జ్వరాలన్నీ దాదాపు ఒకేలాంటి లక్షణాలు కలిగుండటం వల్ల ఏది ఏ జ్వరమో తేల్చుకోలేని గందరగోళం నెలకొంటోంది. అవటానికి జ్వరాలే అయినా చికిత్సలు వేర్వేరు. పొరపాటు జరిగితే తీవ్ర అనర్థానికీ దారితీయొచ్చు. కాబట్టి ఆయా జ్వరాల కారణాలు, లక్షణాలు, చికిత్సల గురించి తెలుసుకొని ఉండటం మంచిది.

Seasonal Fevers in Telangana : రెండున్నరేళ్లుగా అందరినీ కలవరపెడుతున్న, భయాందోళనలకు గురిచేస్తున్న సమస్య కొవిడ్‌. ఇది సార్స్‌-కొవీ-2 వైరస్‌ ద్వారా సంక్రమిస్తుంది. దీని బారినపడ్డవారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వెలువడే తుంపర్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

కొవిడ్‌..

కొవిడ్‌..


లక్షణాలు: ఒక మాదిరి నుంచి మధ్యస్థ కొవిడ్‌లో- జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, నిస్సత్తువ. ఒళ్లు నొప్పులు, తలనొప్పి, రుచి, వాసన తెలియకపోవటం, గొంతునొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, వాంతి, వికారం, విరేచనాల వంటివి వేధిస్తాయి.

తీవ్రమైతే- ఆయాసం, రక్తంలో ఆక్సిజన్‌ శాతం తగ్గటం, న్యుమోనియా, ఊపిరితిత్తుల వైఫల్యం, షాక్‌లోకి వెళ్లిపోవటం, అవయవాలు దెబ్బతినటం సంభవిస్తాయి.

నిర్ధరణ: ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షతో వైరస్‌ బయటపడుతుంది.

చికిత్స: జ్వరం, దగ్గు మామూలుగా ఉంటే పారాసిటమాల్‌, దగ్గు మందులతోనే ఉపశమనం లభిస్తుంది. గొంతునొప్పి ఉన్నట్టయితే ఉప్పునీటితో నోరు పుక్కిలించొచ్చు. సమస్య తీవ్రమైతే యాంటీవైరల్‌, స్టిరాయిడ్‌ మందులతో పాటు ఇతరత్రా చికిత్సలూ అవసరమవుతాయి. పరిస్థితి మరీ విషమిస్తే వెంటిలేటర్‌ అమర్చాల్సి రావొచ్చు. కాబట్టి లక్షణాలు ఎక్కువవుతున్నా, రక్తంలో ఆక్సిజన్‌ 90% కన్నా కిందికి పడిపోతున్నా, శ్వాస చాలా వేగంగా తీసుకుంటున్నా వెంటనే ఆసుపత్రిలో చేర్చి, చికిత్స చేయాల్సి ఉంటుంది.

నివారణ: బయటకు ఎక్కడికి వెళ్లినా విధిగా మాస్కు ధరించాలి. మాస్కును పెట్టుకున్నాక ముందు భాగాన్ని చేత్తో తాకకూడదు. తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.

డెంగీ..

డెంగీ..

కొవిడ్‌ కన్నా ముందు నుంచే భయపెడుతున్న సమస్య డెంగీ. దీనికి మూలం డెంగీ వైరస్‌లు. ఈడిస్‌ జాతి దోమలు కుట్టటం ద్వారా ఇవి వ్యాపిస్తాయి. దోమ కుట్టిన 3-14 రోజుల్లో ఎప్పుడైనా ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు.

లక్షణాలు: డెంగీ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించినా అందరికీ జ్వరం లక్షణాలు ఉండకపోవచ్చు. కేవలం 10% మందిలోనే లక్షణాలు కనిపిస్తాయి. చాలామందికి ఒకట్రెండు లక్షణాలతోనే ఆగిపోవచ్చు. కొందరికి మాత్రం తీవ్రం కావొచ్చు. తీవ్రతను బట్టి దీని లక్షణాలు కనిపిస్తుంటాయి.

తొలిదశలో- ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం.. తల పగిలిపోతోందేమో అన్నంతగా తలనొప్పి.. కళ్ల వెనక నొప్పి, వాంతి, వికారం, ఒళ్లు నొప్పులు, నడుం నొప్పి, కీళ్ల నొప్పులు, ఆకలి తగ్గటం వంటివి వేధిస్తాయి.

విషమదశలో- కడుపునొప్పి, ఆయాసం, పొట్టలో లేదా ఛాతీలో నీరు చేరటం, చిగుళ్ల వంటి జిగురు పొరల నుంచి రక్తం రావటం, చర్మం మీద ఎర్రటి చుక్కల్లాంటి మచ్చలు, రక్తపోటు పడిపోవటం, అపస్మారం, కాళ్లు చేతులు చల్లబడటం, నిస్సత్తువ, అస్థిమితం, చిరాకు, మగత, కాలేయం పెద్దగా అవ్వటం, రక్తంలో హిమోగ్లోబిన్‌ ఎక్కువవటం, అదే సమయంలో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా పడిపోతుండటం.

నిర్ధరణ: జ్వరం మొదలైన 1 నుంచి 5 రోజుల్లో ఎన్‌ఎస్‌1 యాంటీజెన్‌ పరీక్ష చేస్తే డెంగీ ఉన్నదీ లేనిదీ బయటపడుతుంది. ఈ యాంటీజెన్‌ పాజిటివ్‌గా ఉంటే డెంగీ ఉన్నట్టు అర్థం. జ్వరం మొదలైన 5 రోజుల తర్వాత అయితే ఐజీఎం యాంటీబాడీ పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇది పాజిటివ్‌గా ఉంటే డెంగీ ఉందనే. డెంగీని త్వరగా గుర్తించటానికి ర్యాపిడ్‌ పరీక్షలూ ఉన్నాయి. వీటిల్లో పాజిటివ్‌గా తేలినా ప్రామాణిక పరీక్షలతోనే నిర్ధరించుకోవటం అవసరం.

చికిత్స: ఒక మాదిరి డెంగీ జ్వరానికి పారాసిటమాల్‌ మాత్రలే సరిపోతాయి. ఓఆర్‌ఎస్‌ పొడిని కలిపిన నీళ్లు తాగాలి. వాంతులు అవుతుంటే వీటిని తగ్గించే మందులతో పాటు ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికీ తగ్గకపోతే ఆసుపత్రిలో చేర్చి, చికిత్స చేయించాలి. ప్లేట్‌లెట్లు బాగా తగ్గుతున్నా, రక్తం చిక్కబడుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నా ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది. రక్తం చిక్కదనాన్ని తెలిపే హిమటోక్రిట్‌/ప్యాక్డ్‌ సెల్‌ వాల్యూమ్‌, ప్లేట్‌లెట్ల సంఖ్య తెలుసు కోవటానికి తరచూ రక్త పరీక్షలు చేస్తూ వీరిని జాగ్రత్తగా కనిపెట్టుకోవాల్సి ఉంటుంది. నోటితో ద్రవాలు తీసుకోలేకపోతున్నా, రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం ఎక్కువున్నా, రక్తపోటు బాగా పడిపోయినా సెలైన్‌ ఎక్కించాల్సి ఉంటుంది. ఊపిరితిత్తుల్లోకి ప్లాస్మా ద్రవం లీకవటం వల్ల ఆయాసం వస్తున్నట్టయితే కొందరికి వెంటిలేటర్‌ అమర్చాల్సి ఉంటుంది కూడా.

ప్లేట్‌లెట్ల సంఖ్య లక్ష కన్నా తగ్గినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలి. ప్లేట్‌లెట్లు 50వేల కన్నా తక్కువకు పడిపోతే నిశితంగా గమనిస్తూ ఉండాలి. ఒకవేళ ప్లేట్‌లెట్లు 20వేల కన్నా తగ్గి, రక్తస్రావ లక్షణాలు కనిపిస్తుంటే బయటి నుంచి ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. అదే 10వేలకు పడిపోతే రకస్రావం అవుతున్నా, కాకున్నా ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సి ఉంటుంది.

నివారణ: దోమలు కుట్టకుండా చూసుకుంటే డెంగీని పూర్తిగా నివారించుకోవచ్చు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. పడుకునేటప్పుడు దోమతెరలు వాడుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు పొడుగు చేతుల చొక్కాలు, ప్యాంట్లు ధరించాలి. దోమలు కుట్టకుండా కాళ్లకు, చేతులకు క్రీములు రాసుకోవాలి.

జలుబు..

జలుబు..

పడిశం పది రోగాల పెట్టు అని ఊరికే అనలేదు. అవటానికిది మామూలు జలుబే అయినా తీవ్రంగా వేధిస్తుంది. ఇది రైనోవైరస్‌ తరగతి వైరస్‌లు దాడి చేయటం వల్ల వస్తుంది. ఈ వైరస్‌లు ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటుంటాయి. కొన్ని కొత్తగానూ పుట్టుకొస్తుంటాయి. అందువల్ల మన రోగనిరోధక వ్యవస్థకివి ఎప్పుడూ కొత్తే. జలుబు తరచూ వస్తుండటానికి ఇదీ ఒక కారణమే.

లక్షణాలు: ముక్కు కారటం, ముక్కు బిగుసుకుపోవటం, గొంతునొప్పి, తుమ్ములు, దగ్గు, కళ్ల వెంట నీరు రావటం, ఒళ్లునొప్పులు, అలసట, బడలిక, కొద్దిగా జ్వరం వంటివి బాగా వేధిస్తాయి.

చికిత్స: జలుబు సాధారణంగా వారం వరకు ఉంటుంది. చాలావరకు దానంతటదే తగ్గిపోతుంది. తగినంత నీరు తాగటం, మంచి పోషకాహారం తినటం మేలు చేస్తుంది. లక్షణాలు మరీ ఎక్కువగా వేధిస్తుంటే మందులు వాడుకోవచ్చు. జ్వరం ఎక్కువగా ఉంటే తడిబట్టతో ఒళ్లంతా తుడుచుకోవటం మంచిది. అవసరమైతే జ్వరం తగ్గటానికి పారాసిటమాల్‌ మాత్రలు వేసుకోవచ్చు. జలుబుకు యాంటీబయాటిక్‌ మందులు పనిచేయవు. వారం దాటినా బాధలు తగ్గకుండా.. పసుపు లేదా ఆకుపచ్చ రంగులో కఫం పడుతుంటే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ మొదలైందని భావించొచ్చు. ఇలాంటి సమయంలోనే యాంటీబయాటిక్స్‌ ఉపయోగపడతాయి. వీటిని డాక్టర్‌ సలహా మేరకే వాడుకోవాలి. అదీ పూర్తికాలం వేసుకోవాలి.

మలేరియా..

మలేరియా..

అనాదిగా పట్టి పీడిస్తున్న సమస్య మలేరియా. మనదేశంలో ఏటా కోటి మంది దీని బారినపడుతున్నారని అంచనా. వీరిలో 40-50 వేల మంది మరణిస్తుండటం గమనార్హం. పసిపిల్లలు, ఐదేళ్లలోపు పిల్లలు, గర్భిణులకు ఇది ఇంకాస్త ఎక్కువ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. మలేరియా జ్వరానికి మూలం ‘ప్లాస్మోడియం’ పరాన్నజీవి. ఇది ఆడ అనాఫిలెస్‌ దోమల ద్వారా వ్యాపిస్తుంది. మలేరియా గలవారిని కుట్టిన దోమలు తర్వాత మరొకరిని కుట్టినప్పుడు ప్లాస్మోడియం పరాన్నజీవి ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీనిలో ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌, ఒవేల్‌, మలేరియే అని నాలుగు రకాలున్నాయి. వీటిల్లో ఫాల్సిఫారమ్‌తో వచ్చే జ్వరాలే ఎక్కువ.

లక్షణాలు: విపరీతమైన చలి, వణుకుతో తీవ్రమైన జ్వరం ముంచుకురావటం దీని ప్రధాన లక్షణం. కొందరికి తలనొప్పి, ఒళ్లునొప్పులు, వాంతులు కూడా ఉండొచ్చు. చిన్నపిల్లల్లో కొందరికి నీళ్ల విరేచనాలు కావొచ్చు. మలేరియా ముదురుతున్నకొద్దీ రక్తహీనత, కామెర్ల వంటి సమస్యలూ వేధించొచ్చు. ఎర్ర రక్తకణాలు విచ్ఛిన్నం కావటం వల్ల హిమోగ్లోబిన్‌ కిడ్నీల ద్వారా బయటకు రావొచ్చు. దీంతో మూత్రం నల్లగా వచ్చే అవకాశముంది.

నిర్ధరణ: ర్యాపిడ్‌ డయాగ్నొస్టిస్‌ టెస్ట్‌ (ఆర్‌డీటీ) పారాసైట్‌ ఎఫ్‌, వి ద్వారా ఫాల్సిఫారమ్‌, వైవాక్స్‌ రకం మలేరియాలను నిర్ధరిస్తారు. రెండు కన్నా ఎక్కువ రకాల పరాన్నజీవులను గుర్తించటానికీ ఇప్పుడు పారామ్యాక్స్‌ కిట్‌ అందుబాటులో ఉంది. ఈ పరీక్షలను ఎక్కడైనా చేయొచ్చు. ఖర్చూ తక్కువే.

చికిత్స: మలేరియాకు ఆర్టీమినిసిన్‌ మందు బాగా పనిచేస్తుంది. అయితే మలేరియా పరాన్నజీవి దీన్ని తట్టుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటోంది. అందుకే దీనికి తోడు లూమిఫాంటిన్‌, మెఫ్లోక్విన్‌, సల్ఫాడాక్సిన్‌/పైరిమెథమైన్‌ వంటి ఇతరత్రా మందులను కలిపి చికిత్స చేస్తున్నారు. వైవాక్స్‌ రకంతో వచ్చే మలేరియా మళ్లీ తిరగబెట్టే అవకాశముంది కాబట్టి రెండు వారాల పాటు ప్రైమాక్విన్‌ మందునూ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జీ6పీడీ ఎంజైమ్‌ లోపం గలవారికి ఈ మందుతో రక్తం విచ్ఛిన్నమయ్యే ప్రమాదముంది. కాబట్టి ముందుగా దీని లోపాన్ని గుర్తించే రక్తపరీక్ష చేయటం మంచిది.

నివారణ: దోమలు కుట్టకుండా చూసుకోవటం ముఖ్యం. పడకగదిలో దోమతెరలు వాడుకోవాలి. మలేరియాను వ్యాప్తి చేసే దోమలు సాధారణంగా మనుషులను కుట్టిన తర్వాత ఇంటి గోడలపై, కప్పులపై వాలి విశ్రాంతి తీసుకుంటాయి. కాబట్టి ఇంట్లో గోడలు, కప్పుల మీద దోమలను చంపే స్ప్రే మందులను చల్లుకోవచ్చు. ఒకసారి చల్లితే 3-6 నెలల వరకు పనిచేస్తాయి.

ఫ్లూ..

ఫ్లూ..

జలుబు మాదిరిగా కనిపించినా ఫ్లూ జ్వరాలు వేరు. దీనికి మూలం ఫ్లూ వైరస్‌లు. ఇవి ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల మీద దాడి చేసి ఇన్‌ఫెక్షన్‌ కలగజేస్తాయి. ఇది చాలావరకు దానంతటదే తగ్గుతుంది. కానీ కొందరికి తీవ్ర సమస్యలనూ తెచ్చిపెడుతుంది. చిన్న పిల్లలకు, వృద్ధులకు, గర్భిణులకు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారికి.. ఆస్థమా, గుండెజబ్బు, కిడ్నీజబ్బు, కాలేయ జబ్బు, మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులు గలవారికి ఫ్లూతో తలెత్తే సమస్యల ముప్పు ఎక్కువ.

లక్షణాలు: ఫ్లూ జ్వరంలో శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుంది. ఒళ్లునొప్పులూ ఎక్కువే. తలనొప్పి, గొంతునొప్పి కూడా ఉండొచ్చు. పొడి దగ్గు, శ్వాస సరిగా తీసుకోలేకపోవటం, అలసట, నీరసం, ముక్కు కారటం, ముక్కు దిబ్బడ, కంటి నొప్పి వంటివి వేధిస్తాయి. కొందరికి వాంతులు, విరేచనాలూ కావొచ్చు. ముఖ్యంగా పిల్లల్లో వాంతులు, విరేచనాలు కనిపిస్తుంటాయి.

చికిత్స: జ్వరం, ఒళ్లు నొప్పుల వంటివి రెండు మూడు రోజుల తర్వాత వాటంతటవే తగ్గుతాయి. అందువల్ల మొదట్లో పెద్ద చికిత్సల అవసరమేమీ ఉండదు. ద్రవాలు ఎక్కువగా తాగటం, విశ్రాంతి తీసుకోవటం వల్ల త్వరగా కోలుకోవచ్చు. అవసరమైతే జ్వరం తగ్గటానికి పారాసిటమాల్‌ తీసుకోవచ్చు. మూడు రోజులైనా ఇబ్బందులు విడవకుండా వేధిస్తుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొందరిలో ఫ్లూ వైరస్‌ ఊపిరితిత్తులకూ వ్యాపించొచ్చు. న్యుమోనియా తలెత్తొచ్చు. కాబట్టి శ్వాస తీసుకోవటం కష్టమవుతున్నా, దగ్గు, ఆయాసం వేధిస్తున్నా, జ్వరం తగ్గకుండా కొనసాగుతూ వస్తున్నా, కళ్లెతో పాటు రక్తం పడుతున్నా నిర్లక్ష్యం చేయటం తగదు.

నివారణ: దీని నివారణకు టీకా ఉంది. దీన్ని ఏటా తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్లూ ఆరంభం కాకముందే ఈ టీకాను తీసుకుంటే చాలావరకు రక్షణ కల్పిస్తుంది.

టైఫాయిడ్‌..

టైఫాయిడ్‌..

జ్వరమా? టైఫాయిడ్‌ కావొచ్చు.. అని చాలామంది అనటం చూస్తుంటాం. అంత తరచుగా వేధించే సమస్య ఇది. వానకాలంలో మరింత ఎక్కువగానూ కనిపిస్తుంటుంది. టైఫాయిడ్‌కు మూలం సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా. ఇది కలుషితమైన ఆహారం, నీరు ద్వారా వ్యాపిస్తుంది. దీని బారినపడ్డవారు మల విసర్జన చేసినప్పుడు సాల్మొనెల్లా టైఫీ బ్యాక్టీరియా బయటకు వస్తుంది. దీంతో కలుషితమైన ఆహార పదార్థాలు, నీరు తీసుకుంటే ఇతరులకూ సంక్రమిస్తుంది.

లక్షణాలు: విడవకుండా జ్వరం రావటం దీని ప్రత్యేకత. సాధారణంగా 103 నుంచి 104 డిగ్రీల వరకూ జ్వరం ఉంటుంది. వాంతులు, విరేచనాలు, ఆకలి మందగించటం, కడుపునొప్పి, ఒళ్లు నొప్పులు, నీరసం వంటివీ వేధించొచ్చు.

నిర్ధరణ: రక్తం, మలం, మూత్ర నమూనాల పరీక్షతో దీన్ని తేలికగానే నిర్ధరించొచ్చు.

చికిత్స: యాంటీబయాటిక్‌ మందులను పూర్తికాలం వాడితే నయమై పోతుంది. మందులు మధ్యలో మానేస్తే మళ్లీ తిరగబెడుతుంది.

నివారణ: అప్పుడే వండిన ఆహారం తినటం, కాచి చల్లార్చిన నీటిని తాగటం ద్వారా టైఫాయిడ్‌ బారినపడకుండా కాపాడుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.