ETV Bharat / city

పోలీసుల ఉదారత.. పేదలు, యాచకులు, హిజ్రాలకు టీకాలు

author img

By

Published : Jun 16, 2021, 4:57 AM IST

Updated : Jun 16, 2021, 6:25 AM IST

కరోనా మహమ్మారి కట్టడిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తూ... కేసులు తగ్గడానికి దోహదపడుతున్న పోలీసులు... టీకా కార్యక్రమంలోనూ ముందు వరుసలో ఉంటున్నారు. యాచకులు, పేదలు, హిజ్రాలు, దిగువ మధ్యతరగతి కుటుంబాల ప్రజలకు ఉచితంగా టీకా వేయిస్తున్నారు.

police vaccination drive to poor people
police vaccination drive to poor people

కరోనా వైరస్ కట్టడికి టీకానే ప్రధాన మార్గమని నిపుణులు చెబుతున్న వేళ.... వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో.... హైదరాబాద్‌ పోలీసులు తమవంతు కృషి చేస్తున్నారు. ప్రభుత్వం టీకా కార్యక్రమం కొనసాగిస్తున్నప్పటికీ.... దశలవారీగా నడుస్తోంది. డబ్బున్న వాళ్లు ప్రైవేటులో వ్యాక్సిన్‌ వేయించుకుంటున్నప్పటికీ..... పేద, దిగువ మధ్య తరగతికి చెందిన వాళ్లలో చాలా మంది ఇప్పటికీ టీకా వేయించుకోలేదు. అలాంటి వారికి హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు అండగా నిలుస్తున్నారు. తమ కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటి వరకు టీకా వేయించుకోలేని వాళ్లను గుర్తించి ప్రత్యేక టీకా కార్యక్రమం ఏర్పాటు చేశారు. పేదలు, యాచకులు ఇలా టీకాకు నోచుకోని వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పశ్చిమ మండలంలో 13 పోలీస్ స్టేషన్లున్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్‌ పరిధిలో 500మందిని ఎంపిక చేశారు. వారికి పోలీసుల తరఫున ఒక పాస్ ఇచ్చారు. గత పదిహేను రోజులుగా ఈ క్రతువును పూర్తి చేశారు. 6వేల టీకాలను మేఘా ఇంజినీరింగ్ సంస్థ సాయంతో పోలీసులు సమకూర్చుకున్నారు. వృద్ధులు, వికలాంగులకు రవాణా సదుపాయం, భోజన వసతి కల్పించారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజా కళాశాలలో టీకా కార్యక్రమం ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ పరిధిలో ఉన్న 200మందికి పైగా హిజ్రాలు టీకా తీసుకున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి గంటల తరబడి నిలబడి టీకా లభించక వెనుదిరిగి వచ్చామని... పోలీసులు సులభంగా వ్యాక్సిన్‌ లభించేలా ఏర్పాట్లు చేశారని పలువురు సంతోషం వ్యక్తం చేశారు.

మిగతా పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ సామూహిక టీకా కార్యక్రమం నిర్వహించేలా హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు ప్రణాళిక రచిస్తున్నారు.

ఇదీ చూడండి: KTR:సంతోష్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది..

Last Updated : Jun 16, 2021, 6:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.