ETV Bharat / city

Polavaram Protest: పోలవరం నిర్వాసితుల కష్టాలు.. దయ చూపమంటూ సమ్మెలు

author img

By

Published : Dec 22, 2021, 9:22 AM IST

పోలవరం
పోలవరం

Polavaram Protest: పోలవరం ప్రాజెక్టు పూర్తయితే.. ఏపీ పచ్చని పొలాలతో విలసిల్లుతుందని ప్రభుత్వం చెప్పిన మాట విన్నారు. అందుకోసం ఇళ్లు, భూములు ఇచ్చేశారు. వాటికి బదులుగా ప్రభుత్వం ఇస్తామన్నా పరిహారం ఇప్పటికీ రాకపోవడం వల్ల ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వానికి సాయం చేసేందుకు ముందుకొచ్చిన తమను.. ఇప్పుడు సర్కారే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

protest for rehabilitation at polavaram: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంపు గ్రామాల ప్రజలు సర్వస్వం త్యాగం చేశారు. ఏపీ సస్యశ్యామలం అయితే చూసి మురిసిపోవాలనుకున్నారు. అందుకోసం తరతరాల వారసత్వంగా సంక్రమించిన ఇళ్లు, పొలాలను ప్రభుత్వానికి అప్పగించి.. నిరాశ్రయులుగా మిగిలారు. ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇవ్వకపోవడం.. పునరావాస ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో.. దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కరించడం లేదంటూ నిర్వాసిత గ్రామాల ప్రజలు ఈ నెల 10 నుంచి నిరవధిక నిరసన దీక్షలు చేస్తున్నారు.

ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధిలోని 72 గ్రామాల నుంచి 11,433 కుటుంబాలను తరలించాల్సి ఉంది. ఇప్పటి వరకు పోలవరం మండలంలో 2,482 కుటుంబాలు స్వచ్ఛందంగా బయటకు వచ్చాయి. కొరుటూరు, సిరివాక, శివగిరి, చీడూరు, గాజులగొంది, పెద్దూరు గ్రామాల పరిధిలోని 716 కుటుంబాలు ముంపు ప్రాంతంలోనే నివాసం ఉంటున్నాయి. మూడు మండలాల్లో 9,609 కుటుంబాలకు పరిహారం రావాల్సి ఉంది. వీరిలో 1,348 గిరిజన కుటుంబాలు, 11 గిరిజనేతర కుటుంబాలకు మాత్రమే రూ.92.83 కోట్ల సొమ్ము జమైంది. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఇప్పటి వరకూ ఒక్క కుటుంబానికీ పరిహారం జమ కాలేదు. నూతన ప్రభుత్వం వచ్చిన తరువాత పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచింది. మూడేళ్లు గడిచినా ఒక్క కుటుంబానికి కూడా పెరిగిన మొత్తం అందలేదు. పోలవరం మండలం చీడూరుకు చెందిన సంకురు ప్రసాదరెడ్డి ప్రాజెక్టు నిర్మాణానికి ముందు కౌలుకు అయిదెకరాలు సాగు చేసేవారు. పెట్ట్టుబడి ఖర్చులు పోను రూ.50 వేలు మిగిలేది. ప్రాజెక్టు కారణంగా వ్యవసాయ భూములు లేక.. కూలి పనులూ దొరక్క కుటుంబపోషణకు అప్పులు చేస్తున్నారు. ఇలాంటి వారు నిర్వాసితుల్లో వందలాది మంది ఉన్నారు.

పునరావాసానికి ఇంకెన్నాళ్లు?

ప్రాజెక్టు నిర్వాసితుల కోసం.. పోలవరం, గోపాలపురం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో పునరావాస కాలనీల నిర్మాణం చేపడుతున్నారు. ఇప్పటివరకు ఒక్క కాలనీలోనూ పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. చాలా మంది నిర్వాసితులు బయట అద్దెలు చెల్లించే స్థోమత లేక.. అరకొర సౌకర్యాలున్న కాలనీల్లోనే బతుకుతున్నారు. పోలవరం మండలం గాజులగొంది పునరావాస కాలనీల్లో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నాయి. బయటకు వచ్చిన నిర్వాసితులు ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

వారం రోజుల్లో జమవుతాయి

పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇంకా అందలేదన్నది వాస్తవమే. ఇప్పటి వరకు పోలవరం మండలంలో కొందరికి చెల్లించాం. మిగిలినవారికి వారంలో సొమ్ము జమవుతుంది. వేలేరుపాడు, కుక్కునూరు నిర్వాసితుల పరిహారం గురించి త్వరలో బిల్లులు పెడతాం. పునరావాస కాలనీల నిర్మాణం చాలా వరకు పూర్తయింది. త్వరలో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం. భూమికి భూమి ఇచ్చిన చోట లబ్ధిదారులకు ఇబ్బందులు ఉంటే పరిష్కరిస్తాం.

- ఒ.ఆనంద్‌, పోలవరం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి

ఏడు నెలలుగా చీకట్లోనే..

నిర్వాసితుడు ఇండెల రామగోపాల్‌రెడ్డి

‘ఏడు నెలల నుంచి విద్యుత్తు సరఫరా లేక అంధకారంలోనే జీవిస్తున్నాం. కొరుటూరులో 170 కుటుంబాలకు 85కు మాత్రమే పరిహారం ఇచ్చారు. వారికీ చెట్ల నష్టపరిహారం అందలేదు. ఉపాధి అవకాశాలు లేవు. తాగునీరు కలుషితమై వ్యాధులు వస్తున్నాయి. గ్రామస్థులందరికీ పరిహారం ఇస్తే బయటకు వెళ్లిపోతాం’ అని నిర్వాసితుడు ఇండెల రామగోపాల్‌రెడ్డి అన్నారు.

ప్రయాణ ఖర్చులూ భారం

వేట్ల చల్లాయమ్మ

‘అడవుల్లో జీవిస్తున్నాం. కరెంటు కూడా లేదు. వైద్యం, నిత్యావసరాలకు పోలవరం వెళ్లాలంటే రవాణా సౌకర్యం లేదు. ఇంజిన్‌ పడవపై వెళ్లిరావడానికి రూ.వెయ్యి వరకు ఖర్చవుతోంది. బతకడమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఈ ఖర్చులు అదనపు భారమే. గర్భిణులు, వృద్ధుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది’ అని చీడూరుకు చెందిన వేట్ల చల్లాయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

పరిహారం జాబితాలో పేరు లేదు

వి.స్వరూప

‘నాకు 2018కి 18 ఏళ్లు నిండాయి. పరిహారం జాబితాలో నా పేరు లేదు. అధికారులను అడిగితే 2017 నాటికి 18 ఏళ్లు నిండినవారిని మాత్రమే అర్హులుగా పరిగణిస్తున్నామని చెబుతున్నారు. ఇది అన్యాయం. దీనివల్ల మా గ్రామంలోనే ఎంతో మంది యువత నష్టపోతున్నారు’ అని చీడూరుకు చెందిన నిర్వాసితురాలు వి.స్వరూప తెలిపారు.

జీవనోపాధి కోల్పోతున్నాం..

ఉపసర్పంచి రామలక్ష్మి

‘గోదారి తల్లే మా జీవనాధారం. వ్యవసాయం, చేపలు పట్టడం, కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నాం. జీలుగుమిల్లి మండలంలో పునరావాస కాలనీ ఏర్పాటు చేస్తున్నారు. అది చాలా దూరం. అక్కడికెళితే ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండవు. గ్రామంలో 122 కుటుంబాలుంటే ఇప్పటివరకు ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదు’ అని కొరుటూరు ఉపసర్పంచి రామలక్ష్మి వాపోయారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.