ETV Bharat / city

మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని పీఆర్సీ నివేదిక

author img

By

Published : Jan 27, 2021, 10:21 AM IST

Updated : Jan 27, 2021, 1:00 PM IST

ప్రభుత్వ ఉద్యోగులకు మూలవేతనంపై ఏడున్నర శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని వేతనసవరణ సంఘం సిఫారసు చేసింది. ఉద్యోగుల కనీస వేతనం 19 వేలు.... గరిష్ఠ వేతనం లక్షా 62వేలా 70 రూపాయలుగా ప్రతిపాదించింది. ఉద్యోగల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని ప్రభుత్వానికి సూచించింది. ఇంటి కిరాయి భత్యాన్ని తగ్గించిన పీఆర్సీ... గ్రాట్యుటీని 12 నుంచి 16 లక్షలకు పెంచుతూ నివేదించింది.

Pay Revision Commission report of demands to telangana government
మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని పీఆర్సీ నివేదిక

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి వేతనసవరణ సంఘం సిఫారసులు వెల్లడయ్యాయి. 2018 మే 18వ తేదీన విశ్రాంత ఐఏఎస్ అధికారి సీఆర్ బిస్వాల్ నేతృత్వంలో ఉమామహేశ్వరరావు, మహమ్మద్ అలీ రఫత్‌లతో ఏర్పాటైన పీఆర్సీ కమిషనర్... 2020 డిసెంబర్ 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఉద్యోగుల వేతనసవరణ, పదవీ విరమణ వయస్సు పెంపు సహా ఇతర భత్యాలు, తదితరాలపై కమిషనర్ తన సిఫారసులను ప్రభుత్వానికి అందించింది. ఆ సిఫారసుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను మూలవేతనంపై ఏడున్నర శాతం పెంచాలని ప్రతిపాదించింది. పెరిగిన ధరలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని 45 నుంచి 80శాతం వరకు వేతనాలు పెంచాలని ఉద్యోగ సంఘాల కోరాయన్న కమిషన్... రాష్ట్ర ఆర్థికపరిస్థితులు, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని సిఫారసులు చేస్తున్నట్లు వివరించింది.

మూలవేతనం 7.5 శాతం

మూలవేతనంపై ఏడున్నర శాతం వేతనాలు పెంచాలని సిఫారసు చేసింది. 2018 జూలై నుంచి పెరిగిన 30.392 శాతం డీఏతోపాటు ఏడున్నర శాతం ఫిట్‌మెంట్ కలిపి వేతన స్కేళ్లు సవరణ చేయాలని పేర్కొంది. 2018 జూలై ఒకటో తేదీ నుంచే వేతన సవరణ వర్తింపజేయాలన్న కమిషన్... ఉద్యోగుల డిమాండ్లు, రాష్ట్ర వనరులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అటు... ఉద్యోగుల కనీస వేతనం 19వేల రూపాయలు, గరిష్ట వేతనాన్ని లక్షా 62వేలా 70 రూపాయలుగా ప్రతిపాదించింది. తద్వారా 1: 8.52 నిష్పత్తి కొనసాగుతుందని తెలిపింది.

రెండు డీఏల విధానం

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఏడాదిలో రెండు డీఏల విధానాన్ని కొనసాగించాలని కమిషన్ సూచించింది. ఇంటి కిరాయి భత్యాన్ని స్లాబుల వారీగా తగ్గించింది. ఆయా ప్రాంతాల్లోని జనాభా ఆధారంగా ఇప్పటి వరకు ఉన్న 30, 20, 14.5, 12శాతం ఉన్న హెచ్ఆర్ఏను 2, 17, 13, 11 శాతాలకు కుదించింది. ఉద్యోగుల పదవీవిరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 60 ఏళ్లకు పెంచాలని సిఫారసు చేసింది. శిశుసంరక్షణా సెలవులను 90 నుంచి 120కి పెంచాలన్న కమిషన్... దివ్యాంగులైన చిన్నారులు ఉంటే ఆ సంఖ్యను రెండేళ్ల వరకు పెంచాలని సూచించింది. ఉద్యోగుల చిన్నారులకు కేవలం తండ్రి మాత్రమే ఉంటే వారికి కూడా శిశుసంరక్షణా సెలవులు ఇవ్వాలని సిఫారసు చేసింది. ఉద్యోగుల మూలవేతనం, పెన్షనర్ల పింఛనులో ఒకశాతాన్ని వసూలు చేసి... ఆరోగ్యపథకాన్ని అమలు చేయాలని సూచించింది.

ఏడాదికి రూ.2252 కోట్ల అదనపు భారం

సీపీఎస్ విశ్రాంత ఉద్యోగుల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి వారికి ఆరోగ్యపథకాన్ని అమలు చేయాలని సిఫారసు చేసింది. ఎల్టీసీ సౌకర్యాన్ని సర్వీసు మొత్తంలో నాలుగుసార్లు దేశంలో ఎక్కడైనా ఎలాంటి పరిమితులు లేకుండా కల్పించింది. బ్లాకు పీరియడ్ అయిన నాలుగేళ్లలో ఒకసారి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఉద్యోగులు మరణిస్తే అంత్యక్రియల కోసం ఇచ్చే మొత్తాన్ని 30వేల రూపాయలకు పెంచారు. పెన్షనర్లకు కనీస పింఛను 9500గా ప్రతిపాదించారు. 20 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ పూర్తి పెన్షన్ ఇవ్వాలని సిఫారసు చేశారు. గ్రాట్యుటీని 12 లక్షల రూపాయల నుంచి 16 లక్షలకు పెంచుతూ సిఫారసు చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకానికి ఉద్యోగుల వాటాను పది నుంచి 14శాతానికి పెంచారు. సీపీఎస్ విశ్రాంత ఉద్యోగులకు కూడా పాత ఫించన్ వర్తించే ఉద్యోగుల తరహాలో డెత్ రిలీఫ్ ఇవ్వాలని సూచించింది. ఫుల్ టెైం, పార్ట్ టైం, కంటిన్ జెంట్ ఉద్యోగులు, డైలీవేజ్, ఎన్‌ఎంఆర్‌లకు కూడా సెలవులు, ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని కమిషన్ సూచించింది. కమిషన్ సిఫారసులతో ఖజానాపై ఏడాదికి 2252 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని తెలిపింది.

పరిష్కరించాల్సిందే..

ఒప్పంద అధ్యాపకులకు ఇస్తున్న వేతనాలను కూడా పెంచాలన్న కమిషన్... అయితే కళాశాలల్లో అధ్యాపకుల పోస్టులన్నింటినీ రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వానికి సూచించింది. భర్తీ సమయంలో ఒప్పంద పద్ధతిన పనిచేస్తున్న అధ్యాపకులకు వెయిటేజ్ ఇవ్వాలని పేర్కొంది. గ్రూప్ 3, 4 భర్తీలోనూ ఇప్పటికే తాత్కాలిక పద్ధతిని పనిచేస్తున్న వారికి వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలని అభిప్రాయపడింది. నివేదిక కసరత్తు సమయంలో ప్రజల నుంచి కొన్ని విజ్ఞప్తులు వచ్చాయని కమిషన్ తెలిపింది. సామాన్యుల పట్ల గౌరవం లేదని, సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల అంత సమర్థంగా పనిచేయడం లేదని, అలక్ష్యంతో పనుల్లో చాలా జాప్యం అవుతోందని, క్షేత్రస్థాయిలో సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలు కమిషన్ దృష్టికి తీసుకొచ్చినట్లు నివేదికలో పేర్కొంది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే సమయంలో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని, మరింత సమర్థంగా సేవలు అందించేలానే వేతన సవరణ ఉండాలని కోరినట్లు తెలిపింది. పెరిగిన పనిభారం, ఎక్కువ సంఖ్యలో ఖాళీలు ఉండడం, సరైన వాహన సౌకర్యం లేకపోవడం లాంటి సమస్యలను ఉద్యోగులు ప్రస్తావించారన్న కమిషన్... వాటిని పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించింది.

Last Updated :Jan 27, 2021, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.