ETV Bharat / city

రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యం..అవర్​ఫుడ్​కు ప్రోత్సాహం

author img

By

Published : Mar 13, 2021, 9:09 AM IST

రైతుల ఆదాయాలు రెట్టింపు లక్ష్యంగా పనిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువత, రైతులు, అంకుర కేంద్రాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయి. వినియోగదారుల ఆహారపు అలవాట్లు, అభిరుచులకు అనుగుణంగా.. శుద్ధి చేసిన ఆహారోత్పత్తులు అందించేందుకు అంకుర సంస్థలు ముందుకొస్తున్నాయి. తాజాగా అవర్ ఫుడ్ ప్రైవేటు లిమిటెడ్ (అంకుర సంస్థ‌) - ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. రాబోయే ఐదేళ్లల్లో ప్రభుత్వం, అవుర్‌ ఫుడ్ స్టాటప్‌ ఆధ్వర్యంలో 20 వేల సూక్ష్మ ఆహార శుద్ధి యూనిట్లు స్థాపనకు.. యువతకు చేయూత ఇవ్వాలని నిర్ణయించాయి.

Our Food has signed  memorandum of understanding with the government of Telangana
రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా స్టాటప్లకు ప్రోత్సాహం

రైతుల ఆదాయం రెట్టింపే లక్ష్యంగా స్టాటప్లకు ప్రోత్సాహం

రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. సాగు నీటి వనరులు అందుబాటులోకి రావడంతో.. వరి, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటల సాగు, విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగిన నేపథ్యంలో.. రైతులకు మంచి మద్దతు ధరలు లభించాలంటే.. ఆ ఉత్పత్తులు శుద్ధి చేసి మార్కెట్‌లోకి విక్రయించేందుకు చేయూతనిస్తోంది. వచ్చే ఐదేళ్లల్లో గ్రామీణ ప్రాంతాల్లో 20 వేల ఆహార శుద్ధి యూనిట్లు స్థాపనకు.. అవర్‌ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ స్టాటప్‌ ముందుకొచ్చింది. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్ సమక్షంలో.. అవర్ ఫుడ్ స్టాటప్, తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ మధ్య కీలక పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఎంఓయూ పత్రాలను అవర్ ఫుడ్ స్టాటప్ వ్యవస్థాపకులు బాల్‌రెడ్డి, టీఎస్ ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ సుష్మా ధరసోత్ స్వీకరించారు. ముడిసరుకుగా అమ్మడం కంటే.. ప్రాథమిక స్థాయిలో శుద్ధి చేసి విక్రయిస్తే రైతులకు మంచి ధరలు లభిస్తాయని... జయేష్‌ రంజన్‌ తెలిపారు.


లక్ష మందికి ఉపాధి..

ఇప్పటికే సెర్ఫ్ లాంటి సంస్థలు చేసిన అధ్యయనం ప్రకారం... గుర్తించిన 8 రకాల పంటలకు సంబంధించి ఒక్కో వ్యవసాయ క్లస్టర్ లేదా గ్రామంలో ఒక ప్రొసెసింగ్ యూనిట్ నెలకొల్పేందుకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సన్నాహాలు చేస్తోంది. ఇంటా బయటా వినియోగదారులు ఆహార శుద్ధి, ప్యాకింగ్, ఆకర్షణీయమైన బ్రాండింగ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తరుణంలో.. ఈ తరహాలో పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పసుపు, మిరప వంటి ఉత్పత్తులకు సంబంధించి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా లక్ష మందికి ఉపాధి కలుగుతుందని అధికారిక అంచనా.


యువ రైతులు ముందుకొస్తే..

కొవిడ్ నేపథ్యంలో నగరాలు, పట్టణాల నుంచి యువత, ప్రైవేటు ఉద్యోగులు, విద్యావంతులు పల్లెబాట పట్టారు. వ్యవసాయంలో కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఇలాంటి తరుణంలో ఔత్సాహిక యువత, నిరుద్యోగులు, యువ రైతులు ముందుకొస్తే ఫ్రాంచైయిజీ ఇచ్చేందుకు అవర్ ఫుడ్ స్టాటప్ సిద్ధంగా ఉంది. ఉచిత శిక్షణ, రుణం, మిల్లు యంత్రాలు అమర్చడం... రవాణా, మార్కెటింగ్ వసతులు కల్పిస్తోంది.


రైతులను పారిశ్రామికవేత్తలుగా..

అవర్‌ ఫుడ్‌ అంకుర సంస్థ.. యువ రైతు, గ్రామీణ యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి శక్తినిస్తుంది. కేవలం రైతులుగా ఉండిపోకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తోంది.

ఇవీ చూడండి: 'నీట్' ప్రవేశ పరీక్ష తేదీ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.