ETV Bharat / city

Campus Placements : క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో జాబ్ రాలేదని.. కలవరం వద్దు!

author img

By

Published : Oct 21, 2021, 8:01 AM IST

off Campus Placements
off Campus Placements

ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఎక్కువ మందికి ఉండే ఆందోళన ఇది. అలాంటి భయం అవసరమే లేదని, క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌(Campus Placements)లో ఉద్యోగం రాకున్నా, ఆఫ్‌ క్యాంపస్‌(Off campus recruitment) మార్గాల్లో కొలువుకు ఎన్నో అవకాశాలున్నాయని నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. నూతన టెక్నాలజీలు, కోడింగ్‌ నైపుణ్యాలున్న వారికి సాఫ్ట్‌వేర్‌ సంస్థల ద్వారాలు నిరంతరం తెరిచే ఉంటాయని భరోసా ఇస్తున్నారు. వాటిని అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి? తమకు అవసరమైన నిపుణులను గుర్తించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలు ఏరకమైన పరీక్షలు నిర్వహిస్తున్నాయి? కొత్త సాంకేతికతలను నేర్చుకునేందుకు ఉన్న వేదికలు ఏమిటి? వాటిపై పట్టు సాధించేలా శిక్షణ ఇస్తున్న వెబ్‌సైట్లు ఎన్ని ఉన్నాయి?

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది యువతకు మెరుగైన ఉపాధి కప్పించింది, కల్పిస్తున్నది సాఫ్ట్‌వేర్‌ సేవల రంగమే. అందుకే ఇంజినీరింగ్‌లో సీఎస్‌ఈ గ్రూపులకు గిరాకీ ఎక్కువ. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ఐటీ పరిశ్రమలో ఇప్పటికే దాదాపు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. కొత్త సాంకేతికతలు, డిజిటలైజేషన్‌తో మరిన్ని ఉద్యోగావకాశాలు సిద్ధంగా ఉన్నాయి. నిపుణులను గుర్తించి, నియామకాలు చేపట్టేందుకు సాఫ్ట్‌వేర్‌ సంస్థలు క్యాంపస్‌ ఇంటర్వ్యూలతోపాటు, సొంత పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ చదువుతున్న సమయంలో లేదా పూర్తయిన తరువాత వాటిని రాయొచ్చు.

యాప్‌లు.. సాఫ్ట్‌వేర్‌ కోర్సులు..

ఉద్యోగి అయినా, ఉద్యోగార్థి అయినా సాఫ్ట్‌వేర్‌ రంగంలో నిత్యనూతన విద్యార్థిలా కొత్త సాంకేతికతలను నేర్చుకోవాల్సిందే. ముఖ్యంగా ఆఫ్‌ క్యాంపస్‌ ఉద్యోగాలు(Campus Placements) సాధించాలనుకునే వారికి కోడింగ్‌ నైపుణ్యాలు తప్పనిసరి. ఇందుకు ప్రత్యేక యాప్‌లు, హ్యాకర్‌ర్యాంక్‌ లాంటి వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఉడెమీ, కోర్సెరా లాంటి యాప్‌లు అసైన్‌మెంట్లు, కోర్సులను అందిస్తున్నాయి. కొన్ని యాప్‌లు తక్కువ మొత్తం రుసుంతో సేవలు అందిస్తున్నాయి. తెలంగాణ నైపుణ్య అకాడమీ(టాస్క్‌(Telangana Academy of skills and Knowledge))లో నమోదైన విద్యార్థులకు సర్టిఫికేషన్‌ కోర్సులు అందిస్తోంది. ఇంజినీరింగ్‌ సహా ఇతర డిగ్రీలు పూర్తిచేసిన వారికి ఫినిషింగ్‌ స్కూళ్ల(కొలువుకు అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు)నూ నిర్వహిస్తోంది. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి కౌశల్‌ రుణ యోజనను వినియోగించుకోవచ్చు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌లో నమోదైన శిక్షణ సంస్థకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశపరీక్షలో అర్హత సాధిస్తే బ్యాంకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగం వచ్చాక ఐదేళ్లలో విడతల వారీగా రుణం చెల్లించవచ్చు.

ఒక్కో సంస్థదీ ఒక్కో బాట

  • టీసీఎస్‌ సంస్థ జాతీయ స్థాయిలో అర్హత (ఎన్‌క్యూటీ) పరీక్ష నిర్వహిస్తోంది. వేర్వేరు విభాగాల్లో నిపుణులను గుర్తించేలా స్మార్ట్‌ హైరింగ్‌, నిన్‌జా, డిజిటల్‌, టీసీఎస్‌ కోడ్‌విటా అనే పేర్లతో ఉంటాయి. ఈ పరీక్షల తాలూకూ స్కోరును టీసీఎస్‌తోపాటు ఇతర ఐటీ కంపెనీలూ ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.
  • విప్రో సంస్థ విప్రో ఎలైట్‌, ఇన్ఫోసిస్‌.. ఇన్ఫీటీక్యూ, హ్యాక్‌ విత్‌ ఇన్ఫీ పేర్లతో, వర్చుసా కంపెనీ న్యూరల్‌ హ్యాక్‌ పేరుతో పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
  • ఇవే కాదు ఇతర ప్రముఖ ఐటీ కంపెనీలు విద్యార్థి చదివిన బ్రాంచీతో సంబంధం లేకుండా జాతీయస్థాయి ఎంపిక పరీక్షల ద్వారా నియామకాలు చేపడుతున్నాయి. ఇంజినీరింగ్‌, డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులు, రెండేళ్లలోపు అనుభవమున్న ఫ్రెషర్స్‌ వాటిని రాసేందుకు అర్హులు. కొన్ని నియామకాలకు మాత్రం బ్యాక్‌లాగ్స్‌ లేకుండా కనీస మార్కులు తప్పనిసరి.

సర్టిఫికేషన్‌ కోర్సులపై దృష్టిపెట్టాలి

"సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు నిర్వహించే పోటీ పరీక్షల ద్వారా విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించవచ్చు. డేటా సైన్సు, జావా, పైథాన్‌తోపాటు కోడింగ్‌ నైపుణ్యాలు నేర్చుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనూ సర్టిఫికేట్‌ కోర్సులను అందిస్తోంది. చదువుకునే సమయంలోనే వాటిని పూర్తిచేస్తే అదనపు అర్హతలు లభిస్తాయి. కళాశాల నుంచే విద్యార్థులు క్రాస్‌ ఫంక్షనల్‌(చదివే చదువుకు భిన్నమైన) కెరీర్‌ అవకాశాలపై దృష్టి పెట్టాలి."

- కోట సాయికృష్ణ, వ్యవస్థాపక అధ్యక్షుడు, ఏపీ శిక్షణ, ఉపాధి అధికారుల సమాఖ్య

డిజిటల్‌ నైపుణ్యాలు నేర్చుకోవాలి

ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు బృందంతో కలిసి పనిచేసేవారికి, అనలటిక్స్‌, సమస్య-పరిష్కారం, వ్యాపార సవాళ్లను అర్థం చేసుకుని ముందుకెళ్లగలిగే, వేగంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నవారికి అవకాశాలిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా డిజిటలీకరణ వేగంగా జరుగుతోంది. మూడేళ్లలో డిజిటల్‌ రంగంలో 8 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. డిజిటల్‌ నైపుణ్య మానవ వనరుల్లో 75 శాతం భారత్‌లో ఉంటాయన్న అంచనాల నేపథ్యంలో ఈ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.