ETV Bharat / city

NEET: రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన నీట్​ పరీక్ష

author img

By

Published : Sep 12, 2021, 7:52 PM IST

neet exam
నీట్​ పరీక్ష

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసే నీట్(NEET) పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్ష మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నీట్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించారు. తాగునీటి బాటిళ్లు, చిన్న శానిటైజర్లను మాత్రమే పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా నీట్(NEET)​ పరీక్ష(exam) ప్రశాంతంగా నిర్వహించారు. నీట్ పరీక్ష(neet exam) మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. నీట్ రాత పరీక్షకు పెన్నులను నిర్వాహకులే ఇచ్చారు. బయటి నుంచి తీసుకువచ్చినవి అనుమతించలేదు. ఒకటిన్నర తర్వాత వచ్చిన వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. ఎన్టీఏ నిబంధనలను కచ్చితంగా అమలు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచే అర్హత పరీక్ష రాసే విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పరీక్ష కేంద్రానికి చేరుకోవటంతో కేంద్రాల వద్ద సందడి నెలకొంది.

పరీక్షా కేంద్రాల శానిటైజేషన్

కరోనా పరిస్థితుల మధ్య పరీక్షలు నిర్వహించటంతో ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రాలను పూర్తిగా శానిటైజేషన్ చేశామని, పరీక్షా కేంద్రాల్లో శానిటైజర్, తాగునీటితో పాటు గోడ గడియారం కూడా ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. సమయం విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇక కొవిడ్ సోకిన అభ్యర్థులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు. ప్రతి అభ్యర్థికి థర్మల్ స్క్రీన్​తో పరీక్షించి.. ముఖానికి మాస్కులు ధరించి, చేతులకు శానిటైజర్ రాసుకున్న తర్వాతనే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు.

పరీక్షా పేపర్ కాస్త టఫ్​గానే వచ్చింది

పొడుగు చొక్కాలు ధరించిన అభ్యర్థులు, ఆభరణాలను ధరించిన అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించకపోవటంతో పరీక్షా కేంద్రాల వద్ద కొంత అయోమయం నెలకొంది. అలా వచ్చిన అభ్యర్థులను లోపలికి అనుమతించబోమని నిర్వాహకులు ఖరాఖండిగా చెప్పటంతో కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక పరీక్షా పేపర్ కాస్త టఫ్​గానే వచ్చిందని అభ్యర్థులు తెలిపారు. కేంద్రాల వద్ద మౌలిక వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణ నుంచి 55వేల మంది

దేశవ్యాప్తంగా 202 నగరాలు, పట్టణాల్లో 3 వేల 842 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని..అందులో తెలంగాణ నుంచి దాదాపు 55వేల మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 50వేల మంది అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్​లో కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలో 151 పరీక్షా కేంద్రాలు, తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్​నగర్, హయత్​నగర్ 112 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ వెల్లడించింది.

ఆలస్యంగా వస్తే అనుమతించలేదు

నిజాం కళాశాల పరీక్ష కేంద్రంలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు నిర్వాహకులను బతిమాలినప్పటికీ.. అనుమతించలేదు. దీంతో కొందరు విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాసేపటి తర్వాత ఆలస్యమయ్యేందుకు గల కారణాలను అభ్యర్థులు వివరించడంతో తిరిగి లోనికి పంపించారు. తమ పిల్లలు పరీక్ష రాస్తున్నంతసేపు అభ్యర్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రాల వద్దనే వేచివున్నారు.

ఇదీ చదవండి: T-HUB: దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్​గా టీ-హబ్-2​: కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.