ETV Bharat / city

Godavari-Kaveri Rivers Connection : తుపాకులగూడెం బ్యారేజీ నుంచే గోదావరి-కావేరి అనుసంధానం

author img

By

Published : Oct 29, 2021, 6:52 AM IST

గోదావరి-కావేరి అనుసంధానాన్ని(Godavari-Kaveri Rivers Connection) తుపాకులగూడెం బ్యారేజీ నుంచే చేపట్టే అంశాన్ని పరిశీలించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ(National Water Development Corporation) ప్రతిపాదించింది. నీటి లభ్యతను ఖరారు చేసే ముందు తమ ఆమోదం కూడా తీసుకోవాలని, ప్రవాహ మార్గాన్ని రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకొని పోవడం ద్వారా భూసేకరణ సులభమవుతుందని తెలంగాణ తెలిపింది. మళ్లించే నీటిలో కనీసం యాభై శాతం తమకు ఇవ్వాలని కోరింది.

Godavari-Kaveri Rivers Connection
Godavari-Kaveri Rivers Connection

గోదావరి-కావేరి అనుసంధానాన్ని(Godavari-Kaveri Rivers Connection) ఇచ్చంపల్లి నుంచి కాకుండా తుపాకులగూడెం బ్యారేజి నుంచే చేపట్టే అంశాన్ని పరిశీలించాలని జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ(National Water Development Corporation)) ప్రతిపాదించింది. తెలంగాణ వ్యక్తంచేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచన చేసింది. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజి నిర్మిస్తే గోదావరి ఎత్తిపోతల, శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుపైన ఏ మేరకు ప్రభావం ఉంటుందో అధ్యయనం చేయాలని తెలంగాణ కోరింది. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలు కూడా పలు మార్పులు సూచించాయి.

గోదావరి-కావేరి అనుసంధానం ద్వారా 247 టీఎంసీల నీటిని మళ్లించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో సాగు, తాగునీటిని అందించేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ(National Water Development Corporation) ఈ పథకాన్ని ప్రతిపాదించింది. గోదావరిలో ఎక్కడి నుంచి నీటిని మళ్లించాలనే దానిపై పలు పరిశీలనల తర్వాత తెలంగాణ సూచన మేరకు ఇచ్చంపల్లి నుంచి అనుసంధానం చేసేలా గత ఏప్రిల్‌లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను తయారు చేసింది. దీనిని రాష్ట్రాలకు పంపి అభిప్రాయాలను కోరింది. ఈ అభిప్రాయాలను క్రోడీకరించి తాజాగా మళ్లీ రాష్ట్రాలకు పంపింది.

గోదావరి, కృష్ణా బేసిన్‌లోని పది రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలిపాయి. మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర సరేననగా, అనుసంధానంలో కీలకమైన రాష్ట్రాలు మాత్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కొత్త సూచనలు చేశాయి. నీటి లభ్యతను ఖరారు చేసే ముందు తమ ఆమోదం కూడా తీసుకోవాలని, ప్రవాహ మార్గాన్ని రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుకొని పోవడం ద్వారా భూసేకరణ సులభమవుతుందని తెలంగాణ తెలిపింది. మళ్లించే నీటిలో కనీసం యాభై శాతం తమకు ఇవ్వాలని కోరింది. ఇంద్రావతిలో తమకున్న వాటా నుంచి ఈ పథకానికి నీటిని మళ్లించడానికి వీల్లేదని ఛత్తీస్‌గఢ్‌ స్పష్టం చేసింది. ఇచ్చంపల్లి వద్ద ప్రతిపాదించిన పూర్తి స్థాయి నీటిమట్టం వల్ల తమ రాష్ట్రంలోని నాలుగు గ్రామాలకు చెందిన 171 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని తెలిపింది.

ప్రతిపాదిత పథకాలను డీపీఆర్‌లో పేర్కొనాలి: ఏపీ

ఇప్పటికే ఉన్న, నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదిత పథకాలను కూడా డీపీఆర్‌లో చేర్చాలని ఆంధ్రప్రదేశ్‌ కోరింది. గోదావరి నుంచి బనకచెర్లకు మళ్లించాలని ప్రతిపాదించిన 200 టీఎంసీలను, గోదావరి-పెన్నా అనుసంధానంతో ప్రతిపాదించిన 320 టీఎంసీలను కూడా డీపీఆర్‌లో చేర్చాలని పేర్కొంది. తమిళనాడులో మళ్లించే నీటిలో కూడా మార్పులు చేయాలని ప్రతిపాదించింది. ఈ అనుసంధానం ద్వారా మళ్లించే నీటిని బేసిన్లవారీగా కేటాయించాలి తప్ప రాష్ట్రాలవారీగా కాదని కర్ణాటక కోరింది. రాష్ట్రాలకు కేటాయింపులు చేయాలన్న ప్రతిపాదన పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆలమట్టి-పెన్నార్‌ అనుసంధానాన్ని పక్కనపెట్టాలని సూచింది. అనుసంధానం కావేరి ఆనకట్టపై ఉన్న గ్రాండ్‌ ఆనకట్టకు కాకుండా కట్టలై బ్యారేజికి అనుసంధానం చేయాలని తెలంగాణ కోరింది. పూండి రిజర్వాయర్‌ను అరణియార్‌తో అనుసంధానం చేస్తే మరో 15 టీఎంసీలను వినియోగించుకొని 609 చెరువులను నింపవచ్చని, గ్రాండ్‌ ఆనకట్టకు మళ్లించే 46 టీఎంసీలను కావేరి ఆయకట్టుతో సంబంధం లేదని స్పష్టం చేయాలని, లేదంటే కొత్త వివాదాలు తలెత్తుతాయంది. ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో తమిళనాడుకు 83 టీఎంసీలు కాకుండా 200 టీఎంసీలు ఇవ్వాలని కోరింది. కేరళ, పాండిచ్చేరి కూడా ఈ నీటిలో వాటా కోరాయి.

డీపీఆర్‌ల పరిశీలనలో పరిధి దాటుతున్నారు

గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆరు ప్రాజెక్టులకు సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికల(డీపీఆర్‌ల) పరిశీలనలో గోదావరి బోర్డు తన పరిధికి మించి వ్యవహరిస్తోందని తెలంగాణ నిరసన తెలిపింది. డీపీఆర్‌లను వెంటనే కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీకి) పంపేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. బోర్డు ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌ గురువారం రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు.

‘‘గోదావరి ప్రాజెక్టుల డీపీఆర్‌ల పరిశీలన అనేది ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం క్లాజ్‌ 85(8)(డీ)లో పేర్కొన్న నియమ నిబంధనల మేరకు చేపట్టాల్సి ఉంది. దీనికి భిన్నంగా బోర్డు అనేక అంశాల(రిమార్క్స్‌) పేరిట కాలయాపన చేస్తోంది. వాస్తవానికి ట్రైబ్యునళ్ల అవార్డులకు, నీటి లభ్యతకు విరుద్ధంగా ప్రాజెక్టులు ఉన్నాయా, విభజన చట్టం అమల్లోకి వచ్చిన తేదీకి ముందు నిర్మించినవా, కొత్తవా అనేది బోర్డు పరిశీలించాలి. గతంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ను కృష్ణా బోర్డుకు ఏపీ సమర్పించగా.. హైడ్రాలజీ, ఇరిగేషన్‌ ప్లానింగ్‌, నీటి లభ్యత, అంతర్రాష్ట్ర అంశాలను పరిశీలించే నిపుణత తమకు లేదంటూ దాన్ని సీడబ్ల్యూసీకి పంపించింది. కృష్ణా, గోదావరి బోర్డులకు ఒకే మాదిరి సిబ్బంది కేటాయింపులు ఉన్నాయి. విభజన చట్టం క్లాజ్‌లో సూచించిన అధికారాలకు బోర్డు పరిమితం కావాలి. మిగిలిన అంశాలను పరిశీలించడానికి కేంద్ర జల సంఘంలో అనేక డైరెక్టరేట్లు ఉన్నాయి. కాలయాపన చేయకుండా డీపీఆర్‌లను వెంటనే సీడబ్ల్యూసీకి పంపాలి’ అంటూ లేఖలో ఈఎన్‌సీ విజ్ఞప్తి చేశారు.

గోదావరి-కావేరి అనుసంధానంపై నేడు సమావేశం

గోదావరి (ఇచ్చంపల్లి), కావేరి (గ్రాండ్‌ ఆనికట్‌) నదుల అనుసంధానంపై చర్చించేందుకు జాతీయ జలాభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) శుక్రవారం ఎనిమిది సభ్య రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించనున్న ఈ సమావేశానికి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ భూపాల్‌ సింగ్‌ అధ్యక్షత వహించనున్నారు. దిల్లీ నుంచి కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అధికారులు, తెలంగాణ, ఏపీతోపాటు కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు కొందరు ప్రత్యక్షంగా, మరికొందరు ఆన్‌లైన్‌లో పాల్గొననున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.