ETV Bharat / city

KTR ON TEXTILE: 'ఆ పథకానికి మరిన్ని మార్పులు చేస్తే సరిపోతుంది'

author img

By

Published : Sep 10, 2021, 9:13 PM IST

KTR
కేటీఆర్​

రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​కు లేఖ రాశారు. టెక్స్ టైల్ పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన ప్రొడభన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకానికి మరిన్ని అంశాలను జోడించాలని లేఖలో కోరారు.

టెక్స్ టైల్ పరిశ్రమకు కేంద్రం ప్రకటించిన ప్రొడభన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకానికి మరిన్ని అంశాలను జోడించాలని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​కు లేఖ రాశారు. పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపిన కేటీఆర్... దీంతో చైనా నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి టెక్స్ టైల్ ఉత్పత్తులను కొనుగోలు చేసే వివిధ దేశాలను ఆకర్షించవచ్చని అన్నారు. పథకానికి మరిన్ని అంశాలు జోడించడం ద్వారా పరిశ్రమ పురోగతిని మరింతగా బలోపేతం చేసేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పరిశ్రమకు ఉపయుక్తంగా మార్చేందుకు అవసరమైన పలు సలహాలు, సూచనలను లేఖలో తెలిపారు.

పథకం కింద ప్రోత్సాహకాలు మ్యాన్ మేడ్ ఫైబర్​కు మాత్రమే వర్తిస్తాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా టెక్స్ టైల్ ఉత్పత్తుల్లో 50 శాతానికి పైగా ఉన్న కాటన్ సెగ్మెంట్​ను పరిగణలోకి తీసుకోలేదని కేటీఆర్ అన్నారు. కాటన్ ఆధారిత టెక్స్ టైల్ ఉత్పత్తులు చేసే వారికి సైతం పథకం ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తే అటు పరిశ్రమతో పాటు పత్తిని అధికంగా పండించే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లోని రైతాంగం వరకు అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని లేఖలో తెలిపారు. దీంతో అన్ని రకాల ఫైబర్​తో కూడిన కొత్త పెట్టుబడులు టెక్స్ టైల్ రంగంలోకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు.

కాటన్ సెగ్మెంట్​కూ ప్రోత్సాహకాలు ఇస్తే కేంద్రం ఈ రంగంలో ఆశిస్తున్న ఏడున్నర లక్షల ఉద్యోగాలు వేగంగా కల్పించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రోత్సాహకాలు పొందేందుకు నిర్ణయించిన నిర్ణీత కనీస పెట్టుబడిని తగ్గించాలని కేటీఆర్ కోరారు. మ్యాన్ మేడ్ ఫైబర్ సెగ్మెంట్లో 300 కోట్ల రూపాయల కనీస పెట్టుబడిని అర్హతగా నిర్ణయించారని... చైనా లాంటి దేశాలతో పోటీ పడాలంటే భారీ ఎత్తున ఈ రంగంలో పెట్టుబడులతో పాటు అధునాతన యంత్రాలతో పెట్టుబడులు పెట్టే చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. గార్మెంట్ రంగంలో నిర్ణయించిన కనీస 100 కోట్ల పెట్టుబడి పరిమితిని 50 కోట్లకు తగ్గించాలని కోరారు.

దేశంలో ఉన్న రెడీమేడ్ గార్మెంట్ సెగ్మెంట్​లో చిన్న యూనిట్లే ఎక్కువగా ఉన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని... ప్రముఖ సంస్థలకు సేవలందిస్తోన్న చిన్న యూనిట్లను సైతం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. భారీ పెట్టుబడులు రావాలంటే పెద్ద ఎత్తున భూమి, మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ మెగా టెక్స్ టైల్ పార్కులను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో ఇప్పటికే యంగ్ వన్ లాంటి అంతర్జాతీయ, కిటేక్స్ లాంటి దేశీయ ప్రముఖ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని ఉదహరించారు.

ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్ పార్క్ పథకాన్ని తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్... ప్రభుత్వ సహకారంతో ఇలాంటి పార్కుల్లో భారీగా పెట్టుబడులు వస్తాయని తెలిపారు. ఇప్పటికే తెలంగాణలోని సిరిసిల్లలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడంతో పదివేలకు పైగా ఉద్యోగాలు కల్పించే మేరకు పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. తమ సూచనలను పరిగణలోకి తీసుకొని పీఎల్ఐ పథకంలో మార్పులు చేయాలని లేదంటే మరో సమాంతర పథకాన్ని ప్రకటించాలని కేటీఆర్ కోరారు. తద్వారా టైక్స్ టైల్ రంగంలోకి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు.

ఇదీ చదవండి: CM KCR: కుటుంబసభ్యులతో కలిసి పండుగ జరుపుకున్న సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.