ETV Bharat / city

KTR COMMENTS: 'కడుపులో ద్వేషం పెట్టుకుని కపట యాత్రలా..?'

author img

By

Published : Apr 15, 2022, 12:46 PM IST

Updated : Apr 16, 2022, 4:17 AM IST

KTR Comments: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై మంత్రి కేటీఆర్​ పలు విమర్శలు చేశారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాశారు. కడుపులో ద్వేషం పెట్టుకుని కపట యాత్రలు చేస్తే ఏం లాభమని నిలదీశారు.

Minister KTR comments on BJP state president bandi sanjay Padayatra
Minister KTR comments on BJP state president bandi sanjay Padayatra

KTR Comments: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తోన్నది ప్రజావంచన రైతు విద్రోహయాత్ర అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణ అంటేనే భాజపాకు గిట్టదని, కడుపులో ద్వేషం పెట్టుకుని కుట్రలు చేసిన వాళ్లే కపట యాత్రలు చేయడం సిగ్గుచేటన్నారు. విభజన హామీలు నెరవేర్చకుండా.. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో చేసిన పాపాలకు సంజయ్‌ మోకాళ్ల యాత్ర చేయాలన్నారు. ఆయన చేపట్టిన మలిదశ ప్రజాసంగ్రామయాత్రపై కేటీఆర్‌ శుక్రవారం బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘‘అబద్ధాలకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్నదగా కోరు యాత్ర ఇది. పాలమూరు గడ్డకు భాజపా చేసిన ద్రోహం, ప్రాజెక్టుల మంజూరులో చూపిన నిర్లక్ష్యం, నిధుల విడుదలలో కేంద్రం చేసిన వంచనకు బండి సంజయ్‌ క్షమాపణ చెప్పాలి. పొత్తిళ్లలో ఉన్న తెలంగాణ పసిగుడ్డుపై ఆ పార్టీ కత్తిగట్టింది. అధికారం ఉందనే అహంకారంతో తెలంగాణ 7 మండలాలను అన్యాయంగా ఆంధ్రాలో కలిపిన భాజపా దౌర్జన్యాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు.

రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన విభజన హామీలు నెరవేర్చే తెలివిలేదు. నీతిఆయోగ్‌ చెప్పినా నిధులిచ్చే నీతి లేదు. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వరు. నదీ జలాల్లో వాటాలు తేెల్చకుండా జలదోపిడీకి సహకరిస్తారు. ఉచిత కరెంట్‌ ఇస్తుంటే మోటర్లకు మీటర్ల పెట్టమని బ్లాక్‌ మెయిల్‌ చేస్తారు. పండించిన పంటలు కొనకుండా రైతును గోస పెడుతున్నారు. దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న రాష్ట్ర అస్తిత్వాన్ని పదేపదే ప్రశ్నిస్తూ.. ఎగతాళి చేస్తూ.. నియంతృత్వ పోకడలను అవలంబిస్తోంది. పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు పెట్టి పెత్తనం చేస్తూ.. పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్లు ఇప్పుడు యాత్రలు చేస్తారా..?. పాలమూరు జిల్లా వ్యవసాయానికి ఆయువుపట్టు అయిన కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు పేరుతో ఒక శిఖండి సంస్థను ఏర్పాటుచేసి నదీ జలాల వాటాను సందిగ]్ధంలోకి నెట్టిన కుట్రపూరిత పార్టీ భాజపా. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమని చేసిన విజ్ఞప్తికి కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ స్పందన ఏంటో సంజయ్‌ చెప్పాలి. పక్కనే ఉన్న కర్ణాటక అప్పర్‌ భద్రా ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చి పాలమూరు ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదో పాదయాత్రలో వివరించాలి? జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన గద్వాల, మాచర్ల రైల్వే లైన్‌ను ఎలా పూర్తి చేస్తారో స్పష్టం చేయాలి.

దేవాలయాలకు ఏం తెచ్చారు..
ఆదిశక్తి పీఠమైన జోగులాంబను దర్శించుకుని పాదయాత్ర ప్రారంభిస్తున్న సంజయ్‌, రాష్ట్రంలోని చారిత్రక ప్రాశస్త్యం కలిగిన దేవాలయాలకు అదనంగా ఎన్ని నిధులు తీసుకొచ్చారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. తెల్లారి లేస్తే రాముడి పేరుతో రాజకీయాలు చేసే పార్టీ, ఆ కోదండరాముడు నడయాడిన భద్రాద్రి క్షేత్రానికి ఏం చేసిందో తెలపాలి. దేవాలయాలను, దేవుళ్లను రాజకీయాలకు వాడుకునే చరిత్ర సంజయ్‌ది.. ఆయన పార్టీది. మేం మాత్రం అచంచలమైన భక్తి, అకుంఠిత దీక్షతో ఆ సేతు హిమాచలంలోనే అద్భుతమైన దైవక్షేత్రంగా యాదాద్రిని నిర్మించాం. ఈ దైవకార్యంలో భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఏమన్నా ఉందా?

రైతు ద్రోహి.. రాష్ట్ర ద్రోహి..
వడ్లు వేస్తే కేంద్ర ప్రభుత్వంతో కొనిపిస్తామని తెలంగాణ రైతాంగాన్ని తప్పుదోవ పట్టించి, పంట చేతికొచ్చాక తప్పించుకు తిరుగుతున్న బండి సంజయ్‌ తన పాదయాత్రకు రైతు ధోకా యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిది. తెలంగాణ రైతాంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితిపై సంజయ్‌ తన వైఖరిని స్పష్టం చేసిన తర్వాత పాదయాత్ర ప్రారంభించాల్సింది. వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని... అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా..? రైతులతో వికృత రాజకీయం చేసి వడ్లను కొనమని అడిగితే చేతగాదని చేతులెత్తేసిన మీరు.. ఇప్పుడు మిడతల దండులా యాత్రకు బయల్దేరతారా? వడ్లు కొనమని అడిగితే నూకలు తినండని తెలంగాణ ప్రజల్ని అవమానించిన దురహంకారంతో...రైతు ద్రోహి.. రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న మీకు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేదు. దశాదిశా లేని భాజపా దరిద్ర విధానాలతో దేశంలో ఎన్నడూ లేని విధంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి’’ అని కేటీఆర్‌ విమర్శించారు.

ఇదీ చూడండి:

Last Updated : Apr 16, 2022, 4:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.