ఉద్వేగభరితంగా జనగణమన, దేశభక్తితో మురిసిన తెలంగాణ

author img

By

Published : Aug 16, 2022, 12:09 PM IST

Updated : Aug 16, 2022, 2:20 PM IST

Mass singing of national anthem

Mass singing of national anthem స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. ప్రజలంతా ఒకేచోట ఏకమై జనగణమన గీతాన్ని ఆలపించారు. మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంటే ఒకే గొంతుకలో వినిపించిన జాతీయ గీతంతో తెలంగాణం మురిసిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ అబిడ్స్‌లో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉద్వేగభరితంగా జనగణమన.. దేశభక్తితో మురిసిన తెలంగాణ

Mass singing of national anthem : స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రజలంతా ఒకేచోట ఏకమై.. ఒకే గొంతుకలో జనగణమన గీతాన్ని ఆలపించారు. ఆ ఒక్కక్షణం రాష్ట్రమంతా ఉద్వేగానికి లోనైంది. ప్రతి ఒక్కరి కళ్లు 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని గుర్తుచేసుకుంటూ చెమ్మగిళ్లాయి. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుల పోరాటాన్ని స్మరిస్తూ ప్రజలంతా జాతీయ గీతాన్ని పాడారు.

KCR at Mass singing of national anthem in Abids ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హైదరాబాద్ అబిడ్స్ జీపీవో కూడలి వద్ద జాతీయ గీతాలాపనలో పాల్గొన్నారు. అబిడ్స్ సర్కిల్‌కు చేరుకున్న కేసీఆర్.. నెహ్రూ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు కేశవరావు, అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.

సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లు త్రివర్ణాలతో కళకళలాడాయి. అబిడ్స్ జీపీవో సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు, రంగుల బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమం కోసం ట్రాఫిక్‌ పోలీసులు అన్ని కూడళ్ల వద్ద రెడ్‌ సిగ్నల్ వచ్చేలా ఏర్పాటు చేశారు. జాతీయ గీతాలాపన ముగిసే వరకు వాహనాలన్ని కూడళ్ల వద్ద నిలిపివేశారు.

వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులూ జాతీయగీతాన్ని ఆలపించారు. సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ నియమాలను చెప్పేందుకు ఏర్పాటు చేసిన మైకుల్లోనూ జాతీయ గీతం వినిపించారు. హైదరాబాద్ ట్రాఫిక్ సంయుక్త సీపీ రంగనాథ్ ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరిగింది. సామూహిక జాతీయ గీతాలాపన ముగిసిన తర్వాత వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిగ్నళ్లను నిర్వహిస్తున్నారు.

Last Updated :Aug 16, 2022, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.