ETV Bharat / city

భాగ్యనగరంలో వర్షం భయం.. డెత్​ స్పాట్​లుగా మ్యాన్ హోళ్లు

author img

By

Published : Oct 14, 2020, 10:29 AM IST

హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. చినుకు పడితే చిత్తడే. నీళ్లు వెళ్లే పరిస్థితి లేకపోవడం వల్ల.. రోడ్లపైనే నీరు నిలిచిపోతుంది. శాఖల మధ్య సమన్వయ లోపంతో.. రోడ్లను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఎక్కడ గుంత ఉందో తెలుసుకోవాలంటే ఇబ్బందులు తలెత్తున్నాయి. భారీ వర్షం పడిన నీళ్లు పోయేందుకు స్థానికులు మ్యాన్ హోళ్లు తెరుస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి, పోలీసులకు కనీసం సమాచారం ఇవ్వకపోవడం వల్ల ఎక్కడ మ్యాన్ హోళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయో తెలియక అమాయకులు అందులో పడి ప్రాణాలు కోల్పోవాల్సిన దుస్థితి ఎదురవుతుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

Manhole as dead spots in hyderabad area
భాగ్యనగరంలో వర్షం భయం.. డెత్​ స్పాట్​లుగా మ్యాన్ హోళ్లు

హైదరాబాద్​లో గట్టిగా గంటసేపు వాన దంచికొడితే..రోడ్లన్నీ పొంగిపొర్లుతాయి. మోకాళ్ల లోతు నీళ్లు వచ్చి చేరుతున్నాయి. అందుకు ప్రధాన కారణం ఎప్పుడో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థనే. దాన్ని ఆధునికీకరించకపోవడం వల్ల.. నగర వాసులకు సమస్యలు తప్పడం లేదు. ఇబ్బందులు తలెత్తినప్పుడు వాటికి మరమ్మతులు చేస్తున్నారు. తర్వాత వదిలేస్తున్నారు. భాగ్యనగరంలో వరసగా ఇలాగే 3, 4 రోజులు భారీ వర్షం పడితే.. పడవలో ప్రయాణం చేయాల్సిందే అంటున్నారు... నగరవాసులు.

ఓపెన్​ నాలా వల్లే

భాగ్యనగరంలో చాలావరకు ఓపెన్ నాలాలు ఉన్నాయి. దీనివల్ల వర్షం పడితే ఎక్కడ నాలా ఉందో.. ఎక్కడ రోడ్డు ఉందో తెలియక.. వాటిలో పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఇటీవల చోటుచేసుకున్నాయి. అలాంటి ఘటన మరో ఇంట్లో జరగకుండా ఉండాలంటే ఓపెన్‌నాలాలు మూసేయాలని ప్రభుత్వానికి చేతులెత్తి వేడుకుంటున్నారు. దేశంలో అత్యధికంగా పన్నులు వసూలు చేసే నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని.. పన్నులు బాగా వసూలు చేస్తున్నారు కానీ.. అభివృద్ధి కూడా అదే విధంగా చేయాలని సూచిస్తున్నారు.

గుంతలతో ప్రమాదాలు

వర్షం పడితే చాలు నగరరోడ్లన్నీ గుంతల మయమే. ఎక్కడ గుంత ఉందో.. తెలియక వాహనదారులు ప్రమాదాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. అలా గుంతలు పడ్డ సమయంలో తిరిగి మళ్లీ వర్షం వస్తే మరింత ప్రమాదకరంగా మారిపోతుందని నగరవాసులు వాపోతున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటికీ.. వర్షం వస్తే తక్షణమే సహాయ బృందాలను అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల్లోకి తరలించలేకపోతున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు. సహాయ బృందాలు సకాలంలో స్పందించకపోవడం వల్ల స్థానికులే.. అప్రమత్తమై రోడ్లపై ఉన్న నీళ్లను తొలగించేందుకు ప్రయత్నాలు చేయడం.. ఆ క్రమంలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం జరుగుతోంది.

మ్యాన్​ హోల్​ ఉందని గమనించక

అందుబాటులో ఉన్న జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందిస్తున్నప్పటికీ వాళ్లు అన్ని ప్రాంతాల్లోకి తక్షణమే చేరుకోలేకపోతున్నారు. వర్షం వస్తే.. రోడ్లపై నీళ్లు రావడం వల్ల వాటిని వెంటనే నాలాల్లోకి పంపేందుకు మ్యాన్ హోళ్లు తెరుస్తున్నారు. తెరిచిన వాళ్లు ఆ నీళ్లు పోయిన తర్వాత మూస్తున్నారా.. అంటే మూయడం లేదు. తర్వాత ఆ దారిలో వచ్చే వాళ్లు అక్కడ మ్యాన్ హోల్ తెరిచి ఉందని గమనించక... అందులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. చిన్న నిర్లక్ష్యమే నిండు ప్రాణాలను నీళ్లలో కలిపేస్తోంది. ఇవి జరగకుండా.. అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

వందల్లో ఫిర్యాదులు

గ్రేటర్​లో సుమారు 9 వేల కిలోమీటర్ల మేర రోడ్లు విస్తరించి ఉన్నాయి. అందులో ప్రధాన రహదారులు సుమారు 709 కిమీ మేర విస్తరించి ఉన్నాయి. కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో రోడ్లపై గుంతలు, నీళ్లు నిలిచిన ప్రాంతాలకు సంబంధించి వందల్లో ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే తక్షణమే స్పందిస్తున్నప్పటికీ.. అధికారుల రాక ఆలస్యమైతే స్థానికులే బరిలోకి దిగకతప్పడం లేదు. ఫలితంగా కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి.

సకాలంలో తోడకపోవడం

గ్రేటర్ శివారు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రమాదాలు చోటు చేసుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో నీరు నిలిచి ఉండే ప్రాంతాలను అధికారులు గుర్తించి.. అక్కడ మోటార్లతో తోడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ..అవి సకాలంలో చేయకపోడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

ఇదీ చూడండి : గగన్‌పహాడ్‌ వద్ద వరద ఉద్ధృతి.. 3 మృతదేహాలు వెలికితీత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.