ETV Bharat / city

రాష్ట్రంపై వివక్షతో కేంద్రం దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది: కేటీఆర్

author img

By

Published : Sep 2, 2022, 5:39 PM IST

Updated : Sep 2, 2022, 7:02 PM IST

KTR
KTR

KTR Letter to Central Minister Mansukh Mandaviya బల్క్ డ్రగ్ పార్కు కేటాయింపులో రాష్ట్రానికి మొండి చేయి చూపడం.. తెలంగాణ పట్ల కేంద్రం వివక్షకు నిదర్శనమని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ ధ్వజమెత్తారు. అన్ని అనుమతులు, అనుకూలతలు ఉన్న హైదరాబాద్ ఫార్మాసిటీని విస్మరించి.. నాలుగేళ్లయినా పట్టాలెక్కలేని ప్రాంతాలకు కేటాయించిందని ఆరోపించారు. రాష్ట్రానికి వెంటనే బల్క్ డ్రగ్ పార్కు కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మాండవీయకు కేటీఆర్ లేఖ రాశారు.

KTR Letter to Central Minister Mansukh Mandaviya: తెలంగాణ పట్ల మోదీ సర్కారు వివక్ష కొనసాగుతూనే ఉందని.. కేంద్రం ప్రకటించిన బల్క్ డ్రగ్ పార్క్ పథకంలో రాష్ట్రానికి చోటు దక్కకపోవడమే దీనికి నిదర్శనని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ ఆరోపించారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని హైదరాబాద్​ను ఉద్దేశపూర్వకంగా విస్మరించి.. ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను ఎంపిక చేయడం మోదీ సర్కార్ వివక్షపూరిత రాజకీయాలకు పరాకాష్ఠ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పుతున్న హైదరాబాద్ ఫార్మా సిటీ పేరును కనీసం పరిశీలించకపోవడం అన్యాయమంటూ.. కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయకు లేఖ రాశారు.

బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కొన్నేళ్లుగా ఎన్నో సార్లు కేంద్రాన్ని కోరుతూనే ఉన్నామని... తెలంగాణకు కేటాయించాలని కేంద్ర ఫార్మాసూటికల్ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలనూ సమర్పించామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ ఫార్మసిటీలోని 2వేల ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్రానికి స్పష్టం చేస్తూ.. మాస్టర్ ప్లాన్​ను కూడా అందజేశామన్నారు. కీలకమైన భూసేకరణ, పర్యావరణ అనుమతులతో పాటు ఫార్మాసిటీకి ఉన్న సానుకూల అంశాలను వివరిస్తూ కేంద్రానికి సమగ్రమైన నివేదిక ఇచ్చామన్నారు. దిల్లీ వెళ్లిన ప్రతీసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశామని కేటీఆర్ వివరించారు.

తెలంగాణకు చోటు దక్కకపోవడం తమను షాక్​కు గురిచేసిందని కేటీఆర్ అన్నారు. కొత్తగా బల్క్ డ్రగ్ పార్క్​ను ఏర్పాటు చేయాలంటే భూసేకరణ, ప్లానింగ్, డిజైన్, పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకోవడానికే కనీసం మూడేళ్ల సమయం పడుతుందని కేటీఆర్ చెప్పారు. దేశీయ ఫార్మా రంగాన్ని అత్మనిర్భరత వైపు త్వరగా తీసుకుపోవాలన్న ఉద్దేశంపై కేంద్రానికి చిత్తశుద్ధి ఉన్నట్లయితే కనీసం మరో రెండు మూడేళ్లు పట్టే ప్రాంతాలకు పార్కుల కేటాయింపును చేసేది కాదన్నారు. తెలంగాణకు కేటాయిస్తే వెంటనే పని ప్రారంభించవచ్చన్న కనీస సోయి కేంద్ర ప్రభుత్వానికి లేకపోవడం దేశ ప్రజల దురదృష్టమని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మోదీ సర్కార్ నిర్వాకంతో దిగుమతుల కోసం విదేశాలపై ఆధారపడుతున్న ఫార్మా పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలగడంతో పాటు బల్క్ డ్రగ్ తయారీ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న ఆశయానికి తూట్లు పొడవడమేనని విమర్శించారు. మోదీ సర్కార్ నిర్ణయంతో తెలంగాణతో పాటు యావత్ దేశం కూడా భారీగా నష్టపోతుందన్నారు. ఫార్మాసిటీ ప్రాధాన్యతను గుర్తించి ప్రశంసించిన కేంద్రమే బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటులో హైదరాబాద్ ని విస్మరించడం ఆశ్చర్యానికి గురి చేసిందన్న కేటీఆర్.. ఈ ఎంపిక పట్ల అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. దేశీయ ఫార్మా రంగాన్ని స్వయం సమృద్ధిగా మార్చాలన్న చిత్తశుద్ధి ఉన్నట్లయితే.. తెలంగాణలో వెంటనే బల్క్ డ్రగ్ పార్క్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పార్కుల కేటాయింపులో తెలంగాణని విస్మరించడమంటే దేశీయ ఫార్మా రంగం పురోగతిని దారుణంగా దెబ్బతీయడమే అని విమర్శించారు. రాజకీయ ప్రజయోజనాల కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టొద్దని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 2, 2022, 7:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.