ETV Bharat / city

KRMB, GRMB MEETING: గెజిట్‌ అమలు సమస్యలపై రేపు అత్యవసర సమావేశం

author img

By

Published : Sep 12, 2021, 4:58 AM IST

నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించిన కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్​పై సోమవారం దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో సమీక్ష నిర్వహించనున్నారు.

KRMB, GRMB MEETING
KRMB, GRMB MEETING

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నందున దీనిపై చర్చించేందుకు కేంద్రం అత్యవసరం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నెల 13న దిల్లీలో జరిగే ఈ సమావేశానికి నేరుగా హాజరు కావాలని కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లు ఎంపీ సింగ్‌, చంద్రశేఖర్‌ అయ్యర్‌లను కోరింది. నోటిఫికేషన్‌ అమలు తేదీని వాయిదా వేయాలని, రెండో షెడ్యూలులోని ప్రాజెక్టుల విషయంలో మార్పు చేయాలని రాష్ట్రాలు కోరుతున్న నేపథ్యంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ నిర్వహించనున్న అత్యవసర సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

అక్టోబరు 14 నుంచి అమలులోకి..

కృష్ణా, గోదావరి పరిధులను ఖరారు చేస్తూ జులై 15న కేంద్రం గెజిట్‌ జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొంది. అనుమతి లేని ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు పొందాలని, లేకుంటే నిలిపివేయాలని కూడా పేర్కొంది. ఈ పరిస్థితుల్లోనే సెప్టెంబరు ఒకటిన కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశం జరిగింది. గెజిట్‌లో పేర్కొన్న గడువుల ప్రకారం చేయడం సాధ్యం కాదని, దశలవారీగా అయితే ఇబ్బంది ఉండదని రెండు రాష్ట్రాలూ వివరించాయి. ట్రైబ్యునల్‌.. నీటిని కేటాయించకుండా అనుమతులు ఎలా వస్తాయని తెలంగాణ ప్రశ్నించింది. కాలువలు తెగిపోవడం, డ్యాంల నిర్వహణలో సమస్యలు వస్తే ఎలా చేస్తారని, మీ దగ్గర ఏ యంత్రాంగం ఉందని, ఒక రోడ్‌మ్యాప్‌ ఉండాలని సూచించింది. 2నెలల్లోగా ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్‌ చేయడం సాధ్యంకాదని, 15 రోజులకోసారి అప్పటి అవసరం ఎంతో చెప్తే దానికి తగ్గట్లుగా విడుదల చేస్తామని కూడా వివరించాయి.

పూర్తి అజమాయిషీలో..

ఈ సమావేశం తర్వాత కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు బోర్డు పూర్తి అజమాయిషీలో రెండో షెడ్యూలులో ఉంటే సరిపోతుందని, ప్రకాశం బ్యారేజి, పోతిరెడ్డిపాడు కింద ఉన్న కాలువలు, ప్రాజెక్టులు అవసరం లేదని ఏపీ కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాసింది. సీఎం కేసీఆర్‌ ఈ నెల 6న కేంద్ర జల్‌శక్తి మంత్రిని కలిసి పలుఅంశాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరిలో అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలో చేర్చడం, కాళేశ్వరం అదనపు టీఎంసీ పనికి అనుమతి లేదని పేర్కొనడం సరికాదన్నారు. వీటన్నిటిపై ఈ నెల పదిన కేంద్రజల్‌శక్తి కార్యదర్శి దిల్లీలో సమావేశం నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా సోమవారం బోర్డు ఛైర్మన్లతో సమావేశం కావాలని నిర్ణయించారు.

ఇవీ చూడండి: సీఎం కేసీఆర్​తో కేంద్రమంత్రి సింధియా భేటీ.. ఏఏ అంశాలు చర్చించారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.