ETV Bharat / city

Dialysis Treatment: అప్పుల ఊబిలో మూత్రపిండ వ్యాధిగ్రస్తులు

author img

By

Published : Sep 9, 2021, 4:10 AM IST

రెండు మూత్రపిండాలు ఓ వ్యక్తిలో నిత్యం 1500 లీటర్ల రక్తాన్ని శుద్ధిచేసి మలినాలను తొలగిస్తాయి. ఏ కారణం చేతనైనా అవి పనిచేయడం మానేస్తే రక్తంలో, శరీరంలో విషతుల్యాలు పేరుకుపోతాయి. అలాంటి పరిస్థితుల్లో డయాలసిస్‌ చేయడం తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా రెండు కిడ్నీలు పనిచేయని వారు 23,451 మంది ఉన్నట్టు అంచనా. మొదలే అనారోగ్యంతో మానసికంగా కుంగిపోతున్న బాధితులకు డయాలసిస్‌ కేంద్రాలకు వెళ్లడానికయ్యే ఖర్చులు మరింత భారంగా మారాయి. కొందరు ఉన్నదంతా అమ్ముకుంటున్నారు. అప్పులు చేస్తూ ఆ ఊబిలో కూరుకుపోయి అర్ధంతరంగా తనువు చాలిస్తున్న వారూ ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయని, జీవితంపై ఆశ క్రమంగా చచ్చిపోతోందని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సర్కారు కనీసం ఆసరా పింఛనైనా అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

Dialysis Treatment
Dialysis Treatment

పాపం..20 ఏళ్లకే చిక్కిశల్యం

మె జగిత్యాల జిల్లా అలీపూర్‌ గ్రామానికి చెందిన కొప్పుల నాగలక్ష్మి. నాలుగేళ్ల క్రితం ఈమెకు రెండు కిడ్నీలూ చెడిపోయాయి. డయాలసిస్‌తో బతుకు వెళ్లదీస్తోంది. రోగం ఉందని భర్త వదిలేశాడు. అమ్మానాన్నలు బాల్యంలోనే చనిపోయారు. 30 కిలోమీటర్ల దూరంలోని జగిత్యాల డయాలసిస్‌ కేంద్రానికి వారానికి రెండుసార్లు వెళ్లడానికయ్యే ఖర్చుల కోసం నానాపాట్లూ పడుతున్నానని కన్నీటిపర్యంతమవుతోంది.

వారానికి రెండుసార్లు ఎలా వెళ్లడం

కుమురం భీం జిల్లా, లింగాపూర్‌ మండలం లొద్దిగూడ వాసి సజన్‌లాల్‌కు రెండేళ్ల క్రితం రెండు కిడ్నీలు చెడిపోయాయి. చికిత్స కోసం సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశారాయన. డయాలసిస్‌ కోసం 45 కిలోమీటర్ల దూరంలోని ఉట్నూర్‌కు వారానికి రెండుసార్లు వెళ్తున్నానని, నడవలేని స్థితిలో ఉన్న తాను వాహనానికే రూ.5 వేలు ఖర్చుపెట్టాల్సి వస్తోందని వాపోయారు.

ఈ రెండు ఉదంతాలు మూత్రపిండాల సమస్య బాధితుల కష్టాలను కళ్లకు కట్టేవే. వీళ్లే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది ఇలాంటి సమస్యలే ఎదుర్కొంటున్నారు. మొదలే అనారోగ్యంతో మానసికంగా కుంగిపోతున్న బాధితులకు డయాలసిస్‌ కేంద్రాలకు వెళ్లడానికయ్యే ఖర్చులు మరింత భారంగా మారాయి. కొందరు ఉన్నదంతా అమ్ముకుంటున్నారు. అప్పులు చేస్తూ ఆ ఊబిలో కూరుకుపోయి అర్ధంతరంగా తనువు చాలిస్తున్న వారూ ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల నుంచి ఛీత్కారాలు ఎదురవుతున్నాయని, జీవితంపై ఆశ క్రమంగా చచ్చిపోతోందని బాధితులు కన్నీటిపర్యంతమవుతున్నారు. సర్కారు కనీసం ఆసరా పింఛనైనా అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.

రాష్ట్రంలో 23,451 మంది బాధితులు

రెండు మూత్రపిండాలు ఓ వ్యక్తిలో నిత్యం 1500 లీటర్ల రక్తాన్ని శుద్ధిచేసి మలినాలను తొలగిస్తాయి. ఏ కారణం చేతనైనా అవి పనిచేయడం మానేస్తే రక్తంలో, శరీరంలో విషతుల్యాలు పేరుకుపోతాయి. అలాంటి పరిస్థితుల్లో డయాలసిస్‌ చేయడం తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా రెండు కిడ్నీలు పనిచేయని వారు 23,451 మంది ఉన్నట్టు అంచనా. వీరిలో నిత్యం డయాలసిస్‌ చేసుకునే వారు 2,154 మంది. ఇలాంటి వారికోసం రాష్ట్ర సర్కారు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డీమెడ్‌ అనే జర్మనీ కంపెనీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో రక్తశుద్ధి కేంద్రాలను ఏర్పాటుచేసింది. వాటిలో డయాలసిస్‌ చేయించుకునే వారికి ఒక్కసారికి రూ.1215 చొప్పున ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిధుల నుంచి కంపెనీకి చెల్లిస్తుంది.

రవాణా ఖర్చులు.. భరించలేక

వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారికి నెలకు ఒకట్రెండుసార్లు డయాలసిస్‌ అవసరమవుతుంది. మరికొందరికి వారానికి రెండుసార్లు కూడా చేయాల్సి ఉంటుంది. కొందరు జీవితాంతం చేయించుకోవాల్సి ఉంటుంది. డయాలసిస్‌ ఖర్చు ప్రభుత్వం భరిస్తున్నప్పటికీ, సుదూర ప్రాంతాల నుంచి కేంద్రాల వద్దకు రావడమే అతిపెద్ద సమస్యగా మారిందని బాధితులు వాపోతున్నారు. ‘రోగుల్లో చాలామంది నడవలేని స్థితిలో ఉన్నారు. మంచానికే పరిమితమైన వారూ ఉన్నారు. అలాంటి వాళ్లంతా ప్రత్యేక వాహనం మాట్లాడుకుని కేంద్రాలకు రావడానికి నానాపాట్లూ పడుతున్నారు. ఖర్చులు భరించలేక రాకుండా ఆగిపోయి ప్రాణాలమీదికి తెచ్చుకునే వాళ్లూ ఉన్నారు’ అని కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది చెబుతున్నారు.

పక్క రాష్ట్రంలో పింఛను

పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు తీవ్రత ఆధారంగా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పింఛన్‌ నెలనెలా అందజేస్తున్నారు. సికిల్‌సెల్‌, తలసీమియా బాధితులకూ పింఛను ఇస్తున్నారు. అదే తరహాలో తెలంగాణలోనూ అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

  • రాష్ట్రంలో డయాలసిస్‌ కేంద్రాలు: 41
  • నిత్యం డయాలసిస్‌ చేసుకునేవారు: 2,154 మంది (వీరిలో కొందరు వారానికి రెండు, మూడు రోజులు, వారానికి ఒకసారి డయాలసిస్‌ చేసుకునే వాళ్లున్నారు)
  • రెండు కిడ్నీలు చెడిపోయినవారు: 23,451 మంది
  • కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు: 523 కేంద్రాలు
  • నిత్యం వాటిలో డయాలసిస్‌ చేసుకునే వారు: 4,324 మంది

సిరిసిల్ల జిల్లా అంతారం గ్రామానికి చెందిన దారవేని సురేష్‌ది దీనగాథ. రెండేళ్ల కిందట ఈయన రెండు కిడ్నీలు చెడిపోయాయి. కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం ఎవరో ఒకరి సహాయం లేనిదే నడవలేని పరిస్థితి. డయాలసిస్‌ కేంద్రాలకు తీసుకెళ్లేందుకూ సహాయకుడు ఉండాల్సిందే. కూలి పనులుచేసే అమ్మే తనను డయాలసిస్‌ కేంద్రానికి తీసుకెళ్తోందని, ఇది ఆమెకు మరింత భారంగా మారిందని ఆయన వాపోయారు.

ఇవీ చూడండి: పురుషులు ఆరోగ్యానికి ఈ ఆహారాలు ఎంతో మేలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.