ETV Bharat / city

Kanuma: కనుమ.. పాడిపంటలు, పశువులతో రైతన్న అనుబంధాన్ని ఆవిష్కరించే పండుగ

author img

By

Published : Jan 16, 2022, 6:58 AM IST

KANUMA: తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, ఆప్యాయత, అనురాగాలతో పాటు.. పల్లె సొగసులను అందంగా ఆవిష్కరించే పండగ సంక్రాంతి. మూడు రోజులపాటు ముచ్చటగా జరుపుకునే పండగలో చివరి వేడుక కనుమ..! అన్నదాతకు, వ్యవసాయానికి దన్నుగా నిలిచే వృషభరాజాలు, పాడిపశువుల పట్ల కృతజ్ఞత తెలిపే వేడుకే కనుమ..! పశువుల పండుగగానూ వ్యవహరించే ఈ రోజున.. పశువుల్ని అందంగా అలంకరించి పూజలు చేస్తారు. కనుమరోజు మినుము తినాలనే ఆచారం మేరకు.. మినప్పప్పుతో పిండి వంటలు చేస్తారు. ఇంటి ముందు రథం ముగ్గులు వేసి.. ఊరి పొలిమేరకు అనుసంధానిస్తారు. కొన్నిచోట్ల ప్రభల తీర్థం ఉత్సవంతో.. సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి.

kanuma pandaga
కనుమ పండుగ

పాడిపంటలు, పశువులతో రైతన్న అనుబంధాన్ని ఆవిష్కరించే పండుగ కనుమ

KANUMA: తెలుగునేలపై అతి పెద్ద పండుగైన సంక్రాంతి వేడుకలు ముక్కనుమతో ముగుస్తాయి. ఇంటినిండా బంధువులు.. వారికి కొసరి కొసరి వడ్డించే ఇల్లాలు.. కొత్త అల్లుళ్లను మురిపెంగా చూసుకొనే మామలు.. బావల్ని ఆటపట్టించే కొంటె మరదళ్లు.. ఓణీల్లో వయ్యారాలు ఒలకబోసే యువతులు.. కొత్త దుస్తులను చూసి మురిసిపోయే చిన్నారులు.. భూదేవికి సారె ఇచ్చినట్లు దారిపొడవునా పరచుకునే అందమైన రంగవల్లులు.. వాటిలో ముచ్చటగా ఒదిగిపోయే గొబ్బెమ్మలు... ఇలా మూడ్రోజుల పాటు అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు ముక్కనుమతో ముగుస్తాయి.

పశువుల పూజ..

భోగి మంటలతో మొదలై.. మకర సంక్రాంతి రోజున పితృదేవతల తర్పణంలో ఉజ్వలమై కనుమ రోజున కలిమిని అందిస్తూ బలిమిగా మారిన పశువులను పూజించడం ద్వారా మూడురోజుల మహాసంబరం ముగుస్తుంది. కనుమ పర్వదినాన పశువులను పూజించడం ఆనవాయితీ. పశువుల్ని అందంగా అలంకరించి.. శరీరమంతా పసుపు- కుంకుమ పూసి ఊరేగిస్తారు. మెడలో మువ్వలపట్టీలు కట్టి కొమ్ములకు ప్రత్యేకంగా రూపొందించిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపుపై అలంకార శోభితమైన పట్టీ పెడతారు. పశువులకు హారతులిచ్చి వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు.

ఈ రోజు ప్రయాణాలు చేయరు..

కనుమనాడు మాంసాహారం తినడం సంప్రదాయం. మినుములతో గారెలు, ఆవడలు చేసుకోవడం తెలుగు లోగిళ్లలో పరిపాటి. కనుమనాడు ప్రయాణాలు చేయకుండా చూసుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో పశువులకు ఉప్పు చెక్క తినిపిస్తారు. వివిధ మూలికలను ముద్దగా చేసి.. పశువులకు తినిపిస్తే రోగాలు రావని రైతుల నమ్మకం. పశువుల మందలు అభివృద్ధి చెందితే.. వచ్చే పండక్కి పొట్టేలు, కోడిని ఇస్తామని మొక్కుకుంటారు. ఇంటికి వచ్చిన బంధువులకు పశువుల్ని పరిచయం చేస్తూ శుభాకాంక్షలు చెప్పిస్తారు.

రథం ముగ్గులతో..

కనుమ రోజున వేసే రథం ముగ్గులకు ప్రత్యేకత ఉంది. ప్రతి మనిషీ రథం అని... ఆ రథం నడిపేవాడు పరబ్రహ్మ అని భావిస్తూ శరీరమనే రథాన్ని సరైన మార్గంలో నడిపించాల్సిందిగా పరమాత్మని ప్రార్థించడమే రథం ముగ్గు ఉద్దేశం. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చిన సంక్రాంతి పురుషుడు... అన్ని శుభాలను కలిగించాలని కోరుకుంటూ.. ఇంటిముందు రథం ముగ్గులు వేసి అందులో పళ్లు-పూలు, పసుపు-కుంకుమ వేసి గౌరవంగా సాగనంపుతారు. వాకిళ్లలో వేసిన రథం ముగ్గును పక్కింటి ముగ్గుతో అనుసంధానం చేస్తారు. ఈ విధంగా ప్రతి ఇంటి ముందు గీసిన గీతలన్నీ ఊరు పొలిమేర వరకూ సాగుతాయి.

ప్రభల తీర్థాలు..

కనుమ సందర్భంగా ఉభయగోదావరి జిల్లాల్లో నిర్వహించే ప్రభల తీర్థాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ప్రభల తీర్థానికి ఓ ప్రత్యేకత ఉంది. రుద్రులు కొలువైన కొబ్బరితోటల్లో తమ ఊరి నుంచి ప్రభలను తీసుకెళ్లి పూజిస్తే సుఖసంతోషాలతో ఉంటామనేది గోదావరి వాసుల నమ్మకం. తూర్పుగోదావరి జిల్లా జగ్గన్నతోట సహా చాలా ప్రాంతాల్లో కొలువుదీరే ప్రభలు రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తాయి. వందల గ్రామాలకు చెందిన వేల ప్రభలను తీర్థానికి తరలిస్తారు. అక్కడికి పిల్లాపాపలతో వెళ్లి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు. సంక్రాంతి పండుగ వేళ పాటించే ప్రతి ఆచారం మనిషిని ప్రకృతితో జత చేసేదే. బంధుత్వాలను కలుపుతూ ఆనందాలను పంచుతూ మనుషులందరినీ ఒక్కటి చేసేదే ఈ పండుగ.

ఇదీ చదవండి: Decreasing Paddy Cultivation: ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.