ETV Bharat / city

Floods in kadapa: 'కట్టుబట్టలతో మిగిలాం... జీవితాంతం కష్టపడ్డా ఈ నష్టం పూడ్చుకోలేం'

author img

By

Published : Nov 26, 2021, 9:21 AM IST

Floods in kadapa
Floods in kadapa

FLOODS IN KADAPA: భారీ వరదల కారణంగా ఏపీలోని కడప జిల్లాలో చాలా మంది తమ జీవనాన్నే పోగొట్టుకున్నారు. ఇల్లూ, వాకిలీ, నగలు, నగదు సహా సర్వం పోగొట్టుకున్నారు. జిల్లాలోని ఎవరిని కదలించినా కన్నీటితోనే సమాధానం చెబుతున్నారు.

Kadapa people affected with floods: భారీ వర్షాలకు ఏపీలోని కడప జిల్లాలో(Floods in kadapa) గల అన్నమయ్య జలాశయం మట్టికట్ట కొట్టుకుపోయి ఎన్నో గ్రామాల ప్రజలు తమ జీవనాన్ని కోల్పోయారు. ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, రామచంద్రాపురం, గండ్లూరు తదితర గ్రామాల్లో ఎవర్ని కదిలించినా కన్నీటి కథలతోనే దర్శనమిస్తున్నారు. ఎవరి నోట వెంట విన్నా ఇలాంటి కష్టాలే. కట్టుబట్టలతో నడిరోడ్డుపై మిగిలిన ఆ నిస్సహాయులు తమ దశాబ్దాల కష్టార్జితాన్ని గంగపాలు చేసిన ఆ కాళరాత్రి గుర్తొస్తే చాలు వణికిపోతున్నారు. ‘ఈ నష్టం నుంచి మేం కోలుకోవటానికి ఈ జన్మ సరిపోదంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

వరదలో మునిగి పనికిరాకుండా పోవడంతో బయటపడేసిన గృహోపకరణాలు

సర్వం కోల్పోయారు..

వరద ప్రభావానికి గురైన గ్రామాల్లో కొందరి ఇళ్లు మొత్తం నేలమట్టమై వరదలో (Kadapa people affected with floods)కొట్టుకుపోయాయి. ఇళ్లలో ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. బంగారం, డబ్బులే కాదు గ్యాస్‌ సిలిండర్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు సహా అన్నీ కొట్టుకుపోయిన కుటుంబాలు పులపుత్తూరు, ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, రామచంద్రాపురం, తోగూరుపేట తదితర గ్రామాల్లో వందల సంఖ్యలో ఉన్నాయి. అన్నమయ్య ఆనకట్ట దిగువన చెయ్యేరు నది ఒడ్డునున్న ఈ గ్రామాలతోపాటు గండ్లూరు, పాటూరు, చొప్పావారిపల్లె తదితర గ్రామాల్లో మిద్దెలంత ఎత్తులో వరద నీరు ప్రవహించింది. వరద తాకిడికి ఇళ్లు తట్టుకున్నా సామాన్లన్నీ(floods damages inAP) కొట్టుకుపోయాయి. ధాన్యం బస్తాలు కొన్ని కొట్టుకుపోగా.. మరికొన్ని తడిచిపోవడంతో తిండిగింజలూ కరవయ్యాయి. వరద వచ్చి వారం గడుస్తున్నా ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, గండ్లూరు తదితర గ్రామాల్లో ఇప్పటికీ ఇళ్లలో పేరుకున్న బురద తొలగించే పనులు సాగుతూనే ఉన్నాయి.

35 ఆవులు కొట్టుకుపోయాయి..

కొమ్మగిరి శంకరమ్మ

కుమారుణ్ని కువైట్‌ పంపించేందుకు అప్పు చేసి తెచ్చిన రూ.లక్ష నగదు వరదల్లో కొట్టుకుపోయిందని విలపిస్తున్న(floods problems in kadapa) ఈ మహిళ పేరు కొమ్మగిరి శంకరమ్మ. కడప జిల్లా పులపుత్తూరు ఎస్సీ కాలనీకి చెందిన శంకరమ్మ ఇల్లూ వాకిలీ, డబ్బూ, బంగారం అన్నీ వరదల్లో కొట్టుకుపోయాయి. తన అత్త, భార్య 15 ఏళ్లపాటు కువైట్‌లో ఉండి సంపాదించిన మొత్తాన్ని వరద ఊడ్చేసిందని వాపోయారు ఇదే గ్రామానికి కొమ్మగిరి పెంచలయ్య. అప్పుగా తెచ్చిన రూ.1.30 లక్షల నగదు, 35 ఆవులు, 14 ఉంగరాలు నీటిప్రవాహంలో కొట్టుకుపోయాయని కన్నీరుమున్నీరయ్యారు.

ఈ జీవితంలో కోలుకోలేం...

రజని

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు రజని. గతేడాది ఆమె భర్త లక్ష్మీనరసయ్య కొవిడ్‌ బారినపడ్డారు. అప్పులు చేసి లక్షలు వెచ్చించినా ప్రాణాలు దక్కలేదు. ఇప్పుడు వరద ముంపులో ఇంట్లోని సర్వం కొట్టుకుపోయింది. పొలాలన్నీ ఇసుక మేటలు వేసేశాయి. ఈ నష్టం నుంచి కోలుకోవాలంటే ఈ జీవితం సరిపోదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

నాకంటూ ఏమీ మిగల్లేదు...

-గౌనుపురం వెంకటలక్ష్మి

20 తులాల బంగారం, రూ.4 లక్షలు వరదలో కొట్టుకుపోయింది. నా జీవితంలో ఏమీ మిగల్లేదు.. పులపుత్తూరు గ్రామానికి చెందిన గౌనుపురం వెంకటలక్ష్మి వేదన ఇది. ‘అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న 30 తులాల బంగారం మొత్తం వరద పాలైపోయింది. మాకంటూ ఇప్పుడు ఏమీ లేదు’ అని కన్నీటి పర్యంతమయ్యారు గౌనుపురం సావిత్రమ్మ. ‘ఒకరికి బాకీ తీర్చేందుకు ఈ నెల 18న రూ.1.50 లక్షలు అప్పు తెచ్చాను. ఆ సొమ్ము వరదలో కొట్టుకుపోయింది. ఇప్పుడు రెండు అప్పులూ తీర్చాలి’ అని గొల్లుమన్నారు ఇదే గ్రామానికి చెందిన జి.బాలరాజు.

తెల్లారితే పెళ్లి.. అంతలోనే అంతా తల్లకిందులు

- ముమ్మిడి రాజేశ్వరమ్మ

తెల్లారితే ఆ ఇంట్లో పెళ్లి. అందరూ ఆ సందడిలో ఉండగా ముంచెత్తిన వరద రామచంద్రాపురం గ్రామానికి చెందిన ముమ్మడి రాజేశ్వరమ్మ కుటుంబాన్ని తల్లకిందులు చేసేసింది. పెళ్లి కోసం ఉంచిన 20 తులాల బంగారం, రూ.8 లక్షల నగదు సహా ఇంట్లో వస్తువులన్నీ వరదలో కొట్టుకుపోయాయి. డబ్బులు, నగలు తీసుకుని బయటకొచ్చేద్దామని ప్రయత్నించిన రాజేశ్వరమ్మ తల్లి సావిత్రమ్మ వరదలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ‘ఇప్పటివరకూ మేం సంపాదించుకున్నదంతా వరద ఊడ్చేసింది. మళ్లీ మేం పాత జీవితం తెచ్చుకోవడం అసాధ్యం’ అని ఆవేదన వ్యక్తం చేశారు రాజేశ్వరమ్మ.

ఇరవై ఏళ్ల కష్టం మట్టిలో కలిసింది..

తిరుమలశెట్టి వెంకటసుబ్బమ్మ

కువైట్‌ వెళ్లి ఇరవై ఏళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి రూపాయి కూడబెట్టుకున్నారు ఎగువ మందపల్లి గ్రామవాసి ఈశ్వరయ్య. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఇల్లు, వాకిలి, కొంత ఆస్తి సమకూర్చుకున్నారు. ఇన్నేళ్ల ఆయన శ్రమ, కష్టార్జితం ఒక్క రాత్రిలో(floods damages in kadapa) సర్వనాశనమైపోయింది. రూ.30 లక్షలతో నిర్మించిన ఇల్లు వరద ధాటికి కుప్పకూలిపోయింది. పది తులాల బంగారం, నగదు, ఇంట్లోని ఇతర ఖరీదైన వస్తువులన్నీ కొట్టుకుపోయి కట్టుబట్టలతో మిగిలారు. ‘జీవితాంతం కష్టపడ్డా ఈ నష్టం పూడ్చుకోలేం’ అని ఈశ్వరయ్య భార్య వెంకటసుబ్బమ్మ కన్నీటిపర్యంతమయ్యారు.

భవిష్యత్తు తలచుకుంటే భయమేస్తోంది..

నా భర్త హైదరాబాద్‌లో కూలి పనులు చేస్తూ డబ్బులు పంపిస్తే కుటుంబాన్ని పోషించుకుంటూ ఇల్లు కట్టుకున్నాం. పదితులాల బంగారం దాకా కొనుక్కున్నాం. వరదకు ఇల్లు నేలమట్టమైపోయింది. బంగారం, డబ్బు అంతా కొట్టుకుపోయింది. భవిష్యత్తు గురించి తలచుకుంటేనే భయమేస్తోంది.

ఇదీ చడవండి: Flood Damages Estimation: వరదలతో రూ. 6,054 కోట్ల నష్టం... ప్రాథమిక అంచనాలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.