ETV Bharat / city

Historic monuments : నేలకూలుతున్న చరిత్ర.. నిర్లక్ష్యపు నీడన కనుమరుగు

author img

By

Published : Jul 19, 2021, 7:33 AM IST

గంగా జమునా తెహజీబ్‌ వర్ధిల్లిన నేల.. ఇండో పర్షియన్‌ సంస్కృతి వికసించిన ప్రాంతం. నాలుగు వందల ఏళ్ల ఈ చారిత్రక భాగ్య నగరంలో ఇప్పటికీ చెక్కుచెదరకుండా నిల్చున్నాయి ఎన్నో పురాతన కట్టడాలు(Historic monuments). నిర్లక్ష్యపు నీడన ఇవన్నీ ఒక్కొక్కటిగా కనుమరుగవుతూ వస్తున్నాయి. బుధవారం 116ఏళ్ల మహబూబ్‌ మాన్షన్‌ కూలడంతో అందరి దృష్టి మరోసారి వీటిపై పడింది.

నేలకూలుతున్న చరిత్ర.
నేలకూలుతున్న చరిత్ర

భాగ్యనగరంలో.. ఈ ఏడాది ఏ కొంచెం గట్టిగా వానలు పడినా కుప్పకూలేలా ఉన్నాయి ఎన్నో కట్టడాలు(Historic monuments). మెరుగులు దిద్ది పునర్వైభవమిస్తామన్న పాలకుల మాటలు గాల్లో కలిసిపోతుండగా.. నేలమట్టమయ్యే దశలో బేల చూపులు చూస్తున్నాయీ చారిత్రక సౌధాలు. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా ఆస్పత్రి, గౌలిగూడ బస్టాండ్, పాత జైల్ ఖానా, లైలా మజ్ను బురుజులు, చార్మినార్ వంటి కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వందల ఏళ్ల చరిత్ర నేలకూలుతుంటే చూస్తూ ఉండటం తప్ప.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అధికారులు.

గతేడాది వానలకు కూలిన గోల్కొండ కోట గోడ

ఉస్మానియా ఆసుపత్రి : 1866లో సాలార్‌జంగ్‌-1 చేతుల మీదుగా ప్రారంభమైంది ఉస్మానియా ఆసుపత్రి. 2010లో ప్రభుత్వం ఈ భవనం బాగు చేసేందుకు రూ.200కోట్ల నిధులు విడుదల చేసింది. కానీ పనులు ముందుకు సాగలేదు. చారిత్రక కట్టడానికి మరమ్మతులు చేసి పక్కనున్న మిగిలిన భవనాల్ని కూలగొట్టి కొత్తది కట్టాలని నిర్ణయించారు. కానీ అవేమీ ముందుకు సాగలేదు. గతేడాది వానలకు పాత భవనం పెచ్చులూడింది.

గౌలిగూడ బస్టాండు : తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆటోమొబైల్‌ వారసత్వ కట్టడం గౌలిగూడ సిటీ బస్‌ స్టేషన్‌. వందేళ్ల చరిత్ర కలిగిన ఈ అరుదైన కట్టడం ఎన్నో విపత్తులను తట్టుకొని నిలబడింది. కానీ పాలకుల నిర్లక్ష్యంతో 2018లో నేలకూలింది.

పాత జైల్‌ఖానా: సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌ వద్ద 160 ఏళ్లక్రితం పాత జైల్‌ఖానా నిర్మించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటీష్‌ వారికి బందీలైన వారిని ఇక్కడ ఉంచేవారు. బల్దియా నిర్వహణ మరవడంతో ఎనిమిదేళ్ల కింద పాక్షికంగా కూలిపోయింది.

లైలా మజ్నూ బురుజులు: గోల్కొండ నయాఖిల్లాలో 500 ఏళ్ల క్రితం లైలామజ్నూల పేరుతో రెండు బురుజులు నిర్మించారు. ఇందులో మజ్నూ బురుజు పెద్దది. గతేడాది అక్టోబర్‌లో కురిసిన భారీ వర్షాలకు ఇది కుప్పకూలింది.

ఇంకా ఎన్నో.. : దారుల్షిఫా, ఇర్రం మంజిల్‌, జాంసింగ్‌ ఆలయం, దివాన్‌ దేవిడీ, బాద్‌షాహీ అషుర్‌ఖానా నిర్మాణాలు, ఖైరున్నీసా టూంబ్‌, ఖుర్షిదా దేవిడీ, విక్టోరియా అనాథ శరణాలయం, సర్దార్‌ మహల్‌, మొఘల్‌పురా భాగమతి టూంబ్‌, మౌలాలీ కమాన్‌ ఇలా వందల్లో కట్టడాలు శిథిలావస్థకు చేరాయి.

శిథిలస్థితికి చేరుకున్న చార్‌మినార్‌లోని ఓ మినార్‌.. దీని పునరుద్ధరణ పనులు రెండేళ్లుగా కొనసాగుతున్నాయి

కమిషనర్‌తో కమిటీ ఏదీ..?

ఫోరం ఫర్‌ బెటర్‌ హైదరాబాద్‌ సంస్థ 2007లో 1486 చారిత్రక భవనాల్ని గుర్తించింది. అన్ని సర్వేలు చేసి వీటిలో కనీసం 800 భవనాలకు మెరుగులద్దితే వారసత్వ గుర్తింపు వస్తుందని తెలిపింది. వాటిలో ఇప్పటికే 90శాతం భవనాలు ఇంకొద్ది రోజుల్లో కూలేలా ఉన్నాయి. అంతకుముందు 1981లో హుడా ఆధ్వర్యంలో ఏర్పాటైన వారసత్వ పరిరక్షణ కమిటీ 160 నిర్మాణాలను వారసత్వ కట్టడాలుగా గుర్తించారు. 2017లో హెరిటేజ్‌ తెలంగాణ-2017 పేరుతో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. దాంతో పాత జాబితా రద్దయింది. కానీ చట్టంలో మార్గదర్శకాలు రూపొందించలేదు. నగర పరిధిలోని చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఛైర్మన్‌గా కమిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ గతంలో హామీ ఇచ్చారు. ఆ వాగ్దానం ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని చారిత్రక కట్టడాల(Historic monuments) ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.