Hyderabad Rains Today : హైదరాబాద్‌లో కుండపోత వర్షం
Updated on: Aug 1, 2022, 12:10 PM IST

Hyderabad Rains Today : హైదరాబాద్‌లో కుండపోత వర్షం
Updated on: Aug 1, 2022, 12:10 PM IST
Hyderabad Rains Today : హైదరాబాద్ మహానగరాన్ని వరణుడు మరోసారి వణికించేస్తున్నాడు. ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. రహదారులన్నీ జలమయమై వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించడంతో అవస్థలు పడుతున్నారు.
Hyderabad Rains Today : హైదరాబాద్ నగరంలో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. గ్యాప్ ఇస్తూ మరీ వరణుడు నగరవాసులన్ని వణికించేస్తున్నాడు. నగరంలోని కూకట్‌పల్ల, ఎర్రమంజిల్, ఖైరతాబాద్, బషీర్‌బాగ్, అమీర్‌పేట్, తార్నాక, చింతలబస్తీ, సోమాజిగూడ, కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్, మాదాపూర్, ఉప్పల్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్‌లో వర్షం పడుతోంది. ఉదయాన్నే పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు వెళ్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద భారీగా వాన నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Heavy Rain in Hyderabad : భారీ వర్షానికి నగరంలోని రహదారులన్ని జలమయమయ్యాయి. పలుప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పనుల మీద బయటకు వెళ్తున్న వాహనదారులు వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్, జవహర్‌నగర్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపిలేని వానకు నాలాలు పొంగి ఆ నీరంతా రోడ్లపైకి చేరుతోంది. మురుగు కంపు కొడుతున్న నీటివల్ల స్థానికులు అవస్థలు పడుతున్నారు.
అసలే వర్షాకాలం.. ఇక ఈ నాలాల నీటి వల్ల దోమలు ఎక్కువవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే వైరల్, టైఫాడ్, డెంగీ జ్వరాలతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పొంగుతున్న నాలాల వల్ల మరిన్ని సమస్యలు ఎదుర్కొంటున్నామంటున్నారు. అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపి తమను రోగాల బారిన పడకుండా కాపాడాలని వేడుకుంటున్నారు.
మరోవైపు ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య గాలులతో 900 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకూ విస్తరించింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
