నేలమ్మకు అనారోగ్యం.. సహజ ఎరువులు వాడకుంటే మరింత నష్టం..

author img

By

Published : Jun 23, 2022, 7:07 AM IST

Harm to the soil with chemical fertilizers

నేలమ్మకు సుస్తీ చేసింది. ఇప్పుడు కావాల్సింది సేంద్రియ స్ఫూర్తి. భూమిలో సేంద్రియ కర్బనం రోజురోజుకు తగ్గిపోతోంది. రసాయన ఎరువుల వాడకంతో అనర్థం వాటిల్లుతోంది. సహజ ఎరువులు వాడకుంటే మున్ముందు మరింత నష్టం జరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

విచ్చలవిడిగా రసాయన ఎరువుల వాడకంతో వ్యవసాయ భూములు నిస్సారమవుతున్నాయి. రాష్ట్రంలోని పంట భూముల్లో సేంద్రియ కర్బనం(ఆర్గానిక్‌ కార్బన్‌) గణనీయంగా తగ్గిపోతోంది. దీని వల్ల భూమి సారం కోల్పోయి మున్ముందు పంటల దిగుబడి పెరగదు. ఒక పొలంలో మట్టి నమూనాలను తీసుకుని పరీక్షిస్తే కనీసం 0.75 నుంచి 3 శాతం వరకైనా సేంద్రియ కర్బనం ఉంటే.. ఆ భూమిలో కొంతైనా సారం ఉన్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ పరిగణిస్తుంది. 'జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్‌'(ఎన్‌ఎంఎస్‌ఏ) కింద రాష్ట్రవ్యాప్తంగా 2015-19 మధ్యకాలంలో 19.95 లక్షల మట్టి నమూనాలను కేంద్రం పరీక్షించి సేంద్రియ కర్బనం 0.52 శాతమే ఉన్నట్లు తేల్చింది.

పంజాబ్‌ తరువాత తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రసాయన ఎరువులు వాడుతున్నారని ఎన్‌ఎంఎస్‌ఏ పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని నేలల్లో భాస్వరం బాగా పేరుకుపోయినట్లు ఈ పరీక్షల్లో గుర్తించారు. ఈ పొలాల్లో ‘డై అమ్మోనియం ఫాస్ఫేట్‌’(డీఏపీ) ఎరువు వాడకుండా చూడాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే నేలలో ఉన్న భాస్వరాన్ని కరిగించి పైరుకు అందించేందుకు ‘ఫాస్ఫరస్‌ సొల్యూబుల్‌ బ్యాక్టీరియా’(పీఎస్‌బీ)ను వాడేలా రైతులను ప్రోత్సహించాలని పేర్కొంది.

నేలలను కాపాడుకోవాలి.. ప్రతి రైతు నేల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని జయశంకర్‌ వర్సిటీ పరిశోధనా సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ తెలిపారు.‘సేంద్రియ ఎరువులు తప్పనిసరిగా వాడాలి. పశువుల పేడ, కోడిపెంట, వానపాముల ఎరువు, సాగుకు ముందు పచ్చిరొట్ట పైర్లు వేసి కలియదున్నడం వంటివి చేస్తే నేలలో సేంద్రియ కర్బనం, పోషకాలు పెరిగి సారవంతమవుతుంది. పంట కోసిన తరువాత మిగిలిన వ్యర్థాలను తగలపెట్టకుండా అక్కడే దున్నాలి. పంటలమార్పిడి విధానం పాటించాలి. రసాయన ఎరువుల వాడకాన్ని బాగా తగ్గించాలి. భూసార పరీక్షలు చేయించి ఏ పోషకం తక్కువుంటే అది మాత్రమే రసాయన ఎరువు రూపంలో పరిమితంగా వాడాలి’ అని ఆయన సూచించారు

ఏమిటీ సేంద్రియ కర్బనం.. నేలలో సారాన్ని పెంచేందుకు దోహదపడే సహజ పోషకాన్ని సేంద్రియ కర్బనం అని పిలుస్తారు. నేలలో ఇది లేకపోతే ఎన్ని రసాయన ఎరువులు వాడినా పంటలకు కావాల్సిన పోషకాలు సమతుల్యంగా అందవని వ్యవసాయశాఖ రాష్ట్ర భూసార విభాగం సంయుక్త సంచాలకుడు కె.రాములు ‘ఈనాడు’కు చెప్పారు. రసాయన ఎరువుల వాడకం వల్ల నేలలోని సేంద్రియ కర్బనం ఆవిరై కార్బన్‌డై ఆక్సైడ్‌ రూపంలో గాల్లోకి విడుదలై పర్యావరణం కలుషితమవుతుంది. దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, భూతాపం అధికమై పంటల ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. రాష్ట్రంలో ఇటీవల తరచూ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకూ అధికంగా నమోదవడానికి ఇదీ ఒక కారణమని అంచనా.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.