ETV Bharat / city

EWS: రూ.8 లక్షల్లోపు ఆదాయం ఉంటే ఈడబ్ల్యూఎస్‌..

author img

By

Published : Jul 16, 2021, 8:26 AM IST

govt-orders-relaxations-to-ews-reservations-in-the-state
EWS: రూ.8 లక్షల్లోపు ఆదాయం ఉంటే ఈడబ్ల్యూఎస్‌..

ఈడబ్ల్యూఎస్‌(ews) వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల అమలుకు కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉండాలన్న ఒక్క నిబంధన మాత్రమే అమల్లో ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మినహాయింపులు కల్పిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది.

విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల అమలు నిబంధనల్లో ఏపీ ప్రభుత్వం భారీ మినహాయింపులనిచ్చింది. కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉండాలన్న ఒక్క నిబంధన మాత్రమే అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మిగతా అర్హత నిబంధనల నుంచి వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తెస్తూ బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో విడుదల చేసిన జీవోలో ఆ విషయం స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలకూ రూ.8 లక్షల్లోపు వార్షికాదాయం ఉండాలన్న ఒకే ఒక్క నిబంధననే వర్తింపజేస్తూ మరో ఉత్తర్వు ఇచ్చింది.

కేంద్ర నిబంధనలు ఇవీ..

కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు వీలు కల్పిస్తూ చట్టం చేసినప్పుడు అందుకు కొన్ని అర్హత నిబంధనలు పొందుపరిచింది. దాని ప్రకారం..

  • కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్నవారే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అర్హులు.
  • కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఉన్నప్పటికీ.. ఆ కుటుంబానికి 5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్నా, 1000 చ.అడుగులు, అంతకు మించిన వైశాల్యం కలిగిన ఫ్లాట్‌ ఉన్నా, ఏదైనా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌ పరిధిలో 100 చ.గజాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం గల స్థలం ఉన్నా, ఇతర ప్రాంతాల్లో 200 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలం ఉన్నా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు అర్హులు కాదని స్పష్టం చేసింది.
  • ఆ కుటుంబ ఆస్తులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా కూడా అవన్నీ కలిపే లెక్కిస్తారని తేల్చిచెప్పింది.
  • కుటుంబ వార్షికాదాయాన్ని లెక్కించేటప్పుడు.. రిజర్వేషన్‌ కోరుతున్న వ్యక్తితో పాటు, వారి తల్లిదండ్రులు, భార్య/భర్త, 18 ఏళ్ల లోపు వయసున్న సోదరులు, పిల్లల ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారని తెలిపింది.

రెండేళ్ల కిందట యథాతథంగానే..

ప్రభుత్వం రెండేళ్ల క్రితం విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమల్లోకి తెచ్చినప్పుడు కేంద్ర నిబంధనల్ని యథాతథంగా వర్తింపజేసింది. ఇప్పుడు వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య ఉన్న సాంస్కృతిక, ఆర్థిక, భౌగోళిక వైరుధ్యాల్ని పరిగణనలోకి తీసుకుని.. వార్షికాదాయం రూ.8లక్షల్లోపు అన్న నిబంధన తప్ప మిగతావన్నీ మినహాయిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రం.. కేంద్రం నిర్దేశించిన అర్హత నిబంధనలే యథాతథంగా అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: Hyd Rains : తొలి చినుకుకే చిత్తడయిన భాగ్యనగరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.