ETV Bharat / city

సమగ్ర భూ సర్వేపై దృష్టి సారించని ప్రభుత్వం... వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు..

author img

By

Published : Jun 1, 2022, 7:48 AM IST

comprehensive land survey
comprehensive land survey

Land Survey in Telangana : ఇప్పటికే భూ విస్తీర్ణాల్లో దస్త్రాలకు అనుగుణంగా లేక చాలామంది బాధితులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సమగ్ర సర్వే చేస్తేనే శాశ్వత పరిష్కారం సాధ్యమని గత ఏడాది సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ చేపట్టలేదు. ఆ ప్రక్రియ గుత్తేదారుల గుర్తింపు వరకు వచ్చి నిలిచిపోయింది.

Land Survey in Telangana : రాష్ట్రంలో భూ విస్తీర్ణాలకు సంబంధించి దస్త్రాల్లో స్పష్టత ఉన్నప్పటికీ ఆన్‌లైన్‌లో తప్పులతో నమోదవడంతో క్షేత్రస్థాయిలో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. వీటిపై జిల్లా కలెక్టరేట్లకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో భూ సంస్కరణలను 2020 అక్టోబరు నుంచి అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం సర్వేపై మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. టైటిల్‌ డీడ్‌ లాంటి చట్టం అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ సర్వేకు ముందడుగు పడడం లేదు. ప్రస్తుతం పోర్టల్‌ ద్వారా రెవెన్యూ దస్త్రాల్లో ఉన్న సమాచారం ప్రకారం డిజిటల్‌ లావాదేవీలను నిర్వహిస్తోంది. క్షేత్రస్థాయితో సంబంధం లేకుండా జరుగుతున్న ఈ లావాదేవీలు మరిన్ని సమస్యలు సృష్టిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో భూమి ఉందో లేదో పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్‌తో పాటు యాజమాన్య హక్కు మార్పిడి (మ్యుటేషన్‌) పూర్తిచేయడమే దీనికి కారణమని చెబుతున్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో భూ భారతి పేరిట 2005లో జాతీయ భూ దస్త్రాల ఆధునికీకరణ కార్యక్రమం (ఎన్‌ఎల్‌ఆర్‌ఎంపీ- భూ భారతి) కింద ఏరియల్‌ ఫొటోగ్రఫీ సర్వే నిర్వహించారు. అందులో తొమ్మిది లక్షల మంది రైతుల భూములు సర్వే చేస్తే దాదాపు 11 వేల మంది నుంచి అభ్యంతరాలు వచ్చాయి. వాటిపై మరోసారి సర్వే చేయగా తేలిన దాదాపు వెయ్యి వ్యత్యాసాలను అధికారులు సరిచేశారు. ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న 2.45 కోట్ల ఎకరాల భూమిని సర్వే చేస్తే చాలా అభ్యంతరాలొస్తాయని సర్వే రంగ నిపుణులు చెబుతున్నారు. రెండు మూడు దశల్లో సర్వే చేస్తే వాటిని పరిష్కరించవచ్చని సూచిస్తున్నారు.

యథేచ్ఛగా ఉప సంఖ్యల సృష్టి..

క్షేత్రస్థాయిలో భూమిని విభజించకుండానే దస్త్రాల్లో ఉపసంఖ్యలు (బై నంబర్లు) వేయడం గందరగోళానికి కారణమవుతోంది. దస్త్రాల ప్రక్షాళనలోనూ ఇష్టారీతిన భూ విస్తీర్ణాలను కొందరి పేర్లతో రాసేశారు. తిరిగి వాటిని సరిచేసే క్రమంలో (ఆర్‌ఎస్‌ఆర్‌) ఉప సంఖ్యలు వేశారు. కొందరికి ఎక్కువ విస్తీర్ణం నమోదైంది. మరికొందరికి తగ్గిపోయింది. వీటిని సరిచేయకుండానే ధరణిలో లావాదేవీలు కొనసాగించడం భూమి నష్టపోయిన రైతులను కలవరపెడుతోంది. తమకు తెలియకుండానే ఉన్న సర్వే నంబరుకు ఉపసంఖ్యను సృష్టించి విస్తీర్ణాన్ని ఎలా నమోదు చేశారని రైతులు అడుగుతున్న సంఘటనలు అనేకం కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఫిర్యాదులు చేస్తున్న సమస్యల్లో కొన్ని..

* భాగ పంపిణీలో హద్దులు సరిగా గుర్తించలేదు
* విస్తీర్ణాల్లో హెచ్చుతగ్గులు
* ఒకరి భూమిలోకి మరొకరు వచ్చారు
* పట్టా భూమిలో ప్రభుత్వ భూమి ఉందంటూ నిషేధిత జాబితాలో చేర్చుతున్నారు
* రెవెన్యూ-అటవీ సరిహద్దు సమస్యతో పట్టా భూములకూ స్పష్టత లేదు
* భూమి ఒకచోట.. సర్వే నంబరు మరోచోట ఉన్నాయి.

ఇవీ చదవండి:కీలక రాబడులపై ప్రభుత్వ దృష్టి.. రూ.30వేల కోట్ల సమీకరణే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.