ETV Bharat / city

అమలులోకి కోడ్​: వాయిదా పడ్డ వేతన సవరణ

author img

By

Published : Feb 12, 2021, 7:12 AM IST

రాష్ట్రంలో ఎలక్షన్​ కోడ్ అమలులోకి వచ్చింది. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రక్రియలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఉద్యోగుల వేతన సవరణ, పదవీ విరమణ వయోపరిమితి పెంపు వాయిదా పడ్డాయి. ఈలోపు నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికల షెడ్యూలు కూడా వస్తే- ఉద్యోగులు, నిరుద్యోగుల ప్రయోజనాలకు మరింత జాప్యం తప్పదు!

election code implemented in telangana state
అమలులోకి కోడ్​: వాయిదా పడ్డ వేతన సవరణ

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు గురువారం షెడ్యూలు వెలువడటంతో... ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్ర ఉద్యోగుల వేతన సవరణ, పదవీ విరమణ వయోపరిమితి పెంపు వాయిదా పడ్డాయి. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి వాటిని కూడా ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాతే అమలుచేసే వీలుంది. విశ్వవిద్యాలయ ఉపకులపతుల (వీసీ) నియామకాలు, జిల్లాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిలిచిపోనున్నాయి. ఈలోపు నాగార్జునసాగర్‌ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికల షెడ్యూలు కూడా వస్తే- ఉద్యోగులు, నిరుద్యోగుల ప్రయోజనాలకు మరింత జాప్యం తప్పదు!

బడ్జెట్‌ను మాత్రం..

రాష్ట్ర బడ్జెట్‌ను మాత్రం షెడ్యూలు ప్రకారం ప్రవేశపెట్టే అవకాశముంది. డిసెంబరు 31న వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. దీనిపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ త్రిసభ్య కమిటీ చర్చలు జరిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా త్రిసభ్య కమిటీతో సమావేశం నిర్వహించారు. ఒకటి, రెండు రోజుల్లో వేతన సవరణ, వయోపరిమితి పెంపుపై నిర్ణయాలు వెలువడతాయని భావిస్తున్న తరుణంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. కోడ్‌ విషయమై ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) శశాంక్‌ గోయల్‌ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి, అన్ని శాఖలకూ ఉత్తర్వులు పంపారు. ఎన్నికలు ముగిసే వరకూ ఓటర్లనుప్రభావితంచేసే నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.

వాటికి అనుమతి కష్టమే..

పట్టభద్రులు ఓటర్లుగా ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులకు సంబంధించిన వేతనాల పెంపు, పదవీ విరమణ వయోపరిమితి సడలింపు, ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి అమలు చేపట్టడం కష్టసాధ్యమని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. వీసీల నియామక ప్రక్రియ కూడా నిలిచిపోనుంది.

బడ్జెట్‌ యథాతథం

వచ్చే నెలలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు వీలుగా మార్చి తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని సర్కారు యోచిస్తోంది. బడ్జెట్‌ రాజ్యాంగబద్ధ ప్రక్రియ అయినందున, ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సమాచారమిచ్చి, యథావిధిగా ప్రవేశపెట్టవచ్చు. ఎన్నికలు జరిగే మార్చి 14న మాత్రం శాసనసభ, మండలి సమావేశాలు నిర్వహించేందుకు వీల్లేదు.

ఇవీ చూడండి: హైదరాబాద్​ భవిష్యత్​ మీ చేతుల్లోనే.. నూతన కార్పొరేటర్లతో సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.