ETV Bharat / city

జడలు విప్పుతున్న కంఠసర్పి.. పది రోజుల్లో 60కి పైగా కేసులు

author img

By

Published : Jun 25, 2022, 5:16 AM IST

నగరంలో డిఫ్తీరియా(కంఠసర్పి) కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 10 రోజుల్లోనే 60కిపైగా కేసులు నమోదయ్యాయి. కొవిడ్​ నేపథ్యంలో చాలా మంది చిన్నారులు టీకాలకు దూరంగా ఉండిపోవటమే ఇందుకు ప్రధాన కారణంగా వైద్యనిపుణులు చెబుతున్నారు.

diphtheria-cases
జడలు విప్పుతున్న కంఠసర్పి

కొవిడ్‌ నేపథ్యంలో చాలామంది చిన్నారులు టీకాలకు దూరంగా ఉండిపోవడంతో ఇప్పుడా ప్రభావం కనిపిస్తోంది. తాజాగా నగరంలో డిఫ్తీరియా(కంఠసర్పి) కేసులు పెరగడానికి ఇది కూడా కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. కొన్ని రోజులుగా నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రికి నిత్యం పదిమందికి పైనే చిన్నారులు కంఠసర్పితో చికిత్స కోసం వస్తున్నారు. పదిరోజుల్లో ఈ ఒక్క ఆసుపత్రిలోనే 60కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. నగరంలో ప్రైవేటు ఆసుపత్రులనూ లెక్కలోకి తీసుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువే ఉంటుందని అంటున్నారు.

  • ఏమిటీ వ్యాధి..? సాధారణంగా 0-10 ఏళ్ల వయసు పిల్లలను ఎక్కువగా కంఠసర్పి(డిఫ్తీరియా) సోకుతుంది. బ్యాక్టీరియా ప్రభావంతో ఈ వ్యాధి బారినపడిన వ్యక్తి దగ్గినప్పుడు గాలిద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.
  • తీవ్రమైన జ్వరం, గొంతునొప్పి, గొంతులో తెల్లని పొర ఏర్పడతాయి. శ్వాస కష్టమవుతుంది. లక్షణాలు గుర్తించిన వెంటనే చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే గుండెకండరాలు, నరాల వాపు, మూత్రపిండాల సమస్యలు, పక్ష వాతం తదితర సమస్యలకు దారితీస్తుంది.
  • నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. ముఖ్యంగా పిల్లలకు సకాలంలో టీకాలు ఇప్పించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

పంపిణీపై కొవిడ్‌ ప్రభావం.. జాతీయ వ్యాధినిరోధక కార్యక్రమం కింద డిఫ్తీరియాకు ప్రభుత్వమే ఉచితంగా టీకాలు అందజేస్తోంది. డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం..ఈ మూడూ సోకకుండా డీపీటీ పేరుతో టీకాను శిశువు పుట్టిన మూడున్నర నెలల వ్యవధిలో మూడు డోసులు ఇస్తారు. 18నెలలు, 5ఏళ్ల వయసులో మరో రెండు డోసులు అందిస్తారు. పదో ఏట బూస్టర్‌ డోసు ఇస్తారు. తల్లిదండ్రుల్లో అవగాహన లేక చాలామంది పిల్లలు సకాలంలో టీకాలకు నోచుకోవడం లేదు. కొందరికి ఒకటి,రెండు డోసులు ఇప్పించి ఊరుకుంటున్నారు. మరోవైపు కరోనా.. టీకాల కార్యక్రమంపై తీవ్ర ప్రభావం చూపింది. అనేకమందికి టీకాలు అందలేదు. ఫలితంగా పిల్లల్లో వ్యాధి నిరోధకశక్తి తగ్గి కంఠసర్పి సోకుతోంది. వానాకాలం ఈ బ్యాక్టీరియా విస్తరణకు అనుకూలం. కొన్నిసార్లు వ్యాధి లక్షణాలు కనిపించినా చాలామందికి అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తున్నారు. వ్యాధి ముదిరాక ఆసుపత్రులకు తీసుకొస్తుండటంతో పరిస్థితి చేయిదాటి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారని వైద్యులు తెలిపారు.

నిర్లక్ష్యం పనికిరాదు.. గడువులోపు పిల్లలకు టీకా డోసులు ఇవ్వాలని, నిర్లక్ష్యం పనికిరాదని గాంధీ చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ సుచిత్ర తెలిపారు. కొవిడ్‌ ఇతర కారణాలతో మొదటి సంవత్సరంలో ఏవైనా టీకాలు ఇవ్వకపోతే వైద్యుల సూచనలతో చిన్నారులకు రెండో ఏడాది పూర్తయ్యేలోపు అందించాలన్నారు. కంఠసర్పిని ముందే గుర్తిస్తే చికిత్స చేయవచ్చన్నారు.

.

ఇదీ చూడండి: రాష్ట్రంలో పెరుగుతోన్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..!

అభివృద్ధే నా కులం.. సంక్షేమమే నా మతం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.