ETV Bharat / city

Group 4 Notification గ్రూప్‌ 4 పోస్టుల ఉద్యోగ ప్రకటన ఎప్పుడంటే

author img

By

Published : Aug 20, 2022, 8:04 AM IST

Group 4 Notification Update రాష్ట్రంలో 9,168 గ్రూప్‌ 4 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనల తయారీపై జాప్యం నెలకొంది. భారీ సంఖ్యలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. జిల్లాస్థాయి పోస్టులైన వీటిని వేగంగా భర్తీ చేసేందుకు ఈ ఏడాది మేనెలాఖరు నాటికే నోటిఫికేషన్‌కు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 3 నెలలు గడుస్తున్నా ఆ పోస్టులు గుర్తిస్తూ ఆర్థికశాఖ ఇప్పటికీ కనీసం ఉత్తర్వులు జారీ చేయలేదు.

Group 4 Notification
గ్రూప్‌-4

Group 4 Notification Update : రాష్ట్రప్రభుత్వం ఇప్పటివరకు 80 వేల ఉద్యోగాల్లో 19,178 పోస్టులకు ప్రకటనలు వెలువరించింది. ఇందులో అత్యధికంగా పోలీసు నియామక బోర్డు కింద 17,516, వైద్య నియామక బోర్డు కింద 969 పోస్టులున్నాయి. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 కింద 503 పోస్టులకు ప్రకటన ఇచ్చింది. మరో 3 ప్రకటనలు వెలువరించినా పోస్టులన్నీ కలిపి 200 లోపే ఉన్నాయి. మరికొన్ని పోస్టులకు ప్రకటనలు ఇవ్వాలని భావించినా, ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలు, సర్వీసు నిబంధనల్లో లోపాలతో జాప్యం నెలకొంది. టీఎస్‌పీఎస్సీ పరిధిలో అత్యధికంగా గ్రూప్‌-4 కింద 9,168 పోస్టులు రానున్నాయి. వీటిలో విభాగాల అధికారులు పోస్టుల సంఖ్య, రోస్టర్‌, సర్వీసు నిబంధనలపై స్పష్టత ఇచ్చారు.

మే నెలాఖరులోగా ఉత్తర్వులు జారీ చేస్తామని, జూన్‌లో ప్రకటన వెలువరించేలా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. ఈ సమావేశానికి టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి హాజరుకావడంతో త్వరలోనే ప్రకటన వస్తుందని నిరుద్యోగులు ఆశించారు. కానీ ఇప్పటివరకు అడుగులు ముందుకు పడలేదు. కొన్ని విభాగాలు రోస్టర్‌ వారీగా ప్రతిపాదనలు రూపొందించి, కమిషన్‌ అధికారులను సంప్రదించినా, ఉత్తర్వులు వచ్చేవరకు పరిశీలన చేసేందుకు వీలుండదని సూచించారు. ప్రతిపాదనల తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాథమికంగా రూపొందిన ప్రతిపాదనల్లో లోపాల్ని సూచించారు. గ్రూప్‌-4 ఉద్యోగాలకు జిల్లా స్థాయిలో విభాగాల వారీగా ప్రతిపాదనల్ని పరిశీలించాలి. తొలుత జీవో జారీ అయితే.., నిబంధనల ప్రకారం ప్రతిపాదనల తయారీకి కొంత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జీవో జారీ ఆలస్యమయ్యే కొద్దీ.. గ్రూప్‌-4 ఉద్యోగాలను క్రోడీకరించి, రోస్టర్‌ నిబంధనల పరిశీలనతో ప్రకటన జారీకి ఆలస్యమవుతుందని పేర్కొన్నాయి.

జీవో 317తో నిలిచిన గురుకుల ప్రకటనలు.. పాఠశాల విద్యాశాఖలోని టీచర్లు, గురుకుల టీజీటీ పోస్టులకు టెట్‌ తప్పనిసరి. ఈ ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. మరోవైపు గురుకులాల్లో ఖాళీ పోస్టులను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు నియామకాలు చేపట్టేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమ శాఖల్లో దాదాపు 10 వేలకు పైగా పోస్టులు ఉంటే.. గురుకులాల్లో 9,096 పోస్టులు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు గురుకుల నియామకబోర్డుకు అనుమతి మంజూరు చేసింది. గురుకుల సొసైటీలు ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశాయి. అయితే గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో సొసైటీల వారీగా జీవో 317 అమలుకు ఆదేశాలు జారీ చేసింది. సొసైటీలు కసరత్తు పూర్తిచేసి, ఆదేశాలు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత సొసైటీల వారీగా జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ పోస్టుల ఖాళీల్ని గుర్తించేందుకు వీలుంటుందని సంక్షేమవర్గాలు చెబుతున్నాయి. జీవో 317 ప్రకారం కేటాయింపు ఆదేశాలతో పాటు ఒప్పంద గురుకుల టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరణ పూర్తికావాల్సి ఉంది. ఈ ప్రక్రియ అయ్యాకనే గురుకుల నియామక ప్రకటనల జారీకి వీలుందని వెల్లడించాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.