ETV Bharat / city

TS Cabinet Meeting: నేడు మంత్రి వర్గ సమావేశం... దళితబంధు పథకమే ప్రధాన అజెండా

author img

By

Published : Jul 31, 2021, 9:14 PM IST

Updated : Aug 1, 2021, 3:07 AM IST

దళితబంధు పథకమే ప్రధాన అజెండాగా ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పథకంతో పాటు హుజూరాబాద్​లో పైలట్ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. ఉద్యోగ నియామకాలపై కూడా సమావేశంలో చర్చించవచ్చని సమాచారం. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం నోటిఫికేషన్ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చించవచ్చని తెలుస్తోంది. వరద నిర్వహణా బృందం ఏర్పాటు సహా ఇతర అంశాలపై మంత్రిమండలిలో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

dalitha bandhu scheme is the main agenda in Telangana Cabinet Meeting
dalitha bandhu scheme is the main agenda in Telangana Cabinet Meeting

రాష్ట్ర మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం భేటీ జరగనుంది. దళితబంధు పథకమే ప్రధాన అజెండాగా సమావేశం జరిగే అవకాశం ఉంది. అఖిలపక్ష ప్రతినిధులు, హుజూరాబాద్ దళిత ప్రతినిధుల సమావేశంలో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా పథకం అమలుపై చర్చించనున్నారు. దళితబంధు మార్గదర్శకాలపైనా కేబినెట్ భేటీలో చర్చిస్తారు.

పైలట్ ప్రాజెక్టుకు ఆమోదం..

ఉపాధి అవకాశాల కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ ఇప్పటికే వివిధ యూనిట్లను గుర్తించింది. గ్రామీణ, సబర్బన్, పట్టణ ప్రాంతాలకు వేర్వేరుగా వీటిని సిద్ధం చేశారు. యూనిట్ల ఏర్పాటు కోసం పది లక్షల రూపాయలు లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దళితబంధు పథకంతో పాటు హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. మార్గదర్శకాల ఖరారు విషయమై కూడా కేబినెట్​లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పథకం అమలు, కార్యాచరణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. దీంతో పాటు దళితవాడల అభివృద్ధి, మౌలికసదుపాయాల కల్పన తదితర అంశాలపైనా కేబినెట్​లో చర్చించనున్నారు.

ఉద్యోగ నియామకాలపై చర్చ..

ఉద్యోగ నియామకాలపైనా కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా కేడర్ వర్గీకరణ పూర్తి చేసి ఐదు రోజుల్లో వివరాలు ఇవ్వాలని గత కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్ని శాఖల మంత్రులు, అధికారులతో చర్చించి వివరాలు సిద్ధం చేశారు. అన్నింటినీ క్రోడీకరించి ఆర్థిక శాఖ సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. వివరాలను పరిశీలించి ఉద్యోగ నియామక ప్రక్రియపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

గెజిట్ నోటిఫికేషన్ విషయమై..

కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జలశక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకు సంబంధించి కూడా తదుపరి కార్యాచరణపై కేబినెట్​లో చర్చించే అవకాశం ఉంది. గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసిన గోదావరి బోర్డు... కమిటీ మొదటి సమావేశాన్ని మంగళవారం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ విషయమై కేబినెట్​లో చర్చించి ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. నీటిపారుదల ప్రాజెక్టులు, నల్గొండ జిల్లాకు మంజూరు చేసిన ఎత్తిపోతల పథకాలు, వరద నిర్వహణా బృందం ఏర్పాటు సహా సంబంధిత అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

పోడు భూముల అంశంపై...

పోడు భూముల అంశంపై కూడా మంత్రిమండలిలో చర్చ జరగవచ్చని సమాచారం. వీటితో పాటు ఆదాయ సమీకరణ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటు, ఆయిల్ పామ్, పంటల సాగు, ఇతర పాలనాపరమైన, రాజకీయ అంశాలపైనా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:

Last Updated : Aug 1, 2021, 3:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.