ETV Bharat / city

రోజుకు 5 వేల పరీక్షలు సాధ్యమేనా..?: హైకోర్టు

author img

By

Published : Jun 18, 2020, 8:22 PM IST

కరోనా కేసుల వివరాలు ప్రజలకు మరింత స్పష్టంగా వివరించాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో చేస్తున్న కరోనా పరీక్షలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ విచారణ జరిగింది. కరోనా పరీక్షలు, కేసుల వివరాల వెల్లడిపై న్యాయస్థానం పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.

corona tests pil hearing in high court and give orders to government
రోజుకు 5 వేల పరీక్షలు సాధ్యమేనా..?: హైకోర్టు

రాష్ట్రంలో కరోనా పరీక్షలు, గణాంకాల వెల్లడిపై ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన పలు కేసులపై ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ఐసీఎంఆర్​ తాజా మార్గదర్శకాల అనుగుణంగా రాపిడ్ యాంటీజెంట్ టెస్టులు నిర్వహించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు మరింత ఎక్కువగా చేయాలని సూచిందింది. పది రోజుల్లో 50వేల కరోనా పరీక్షలు జరుపుతామని సర్కారు వివరించగా... రోజుకు 5 వేలు జరిపితేనే ఇది సాధ్యమవుతుందని హైకోర్టు పేర్కొంది. కేరళ తరహాలో సంచార కరోనా పరీక్షలు నిర్వహించడం ఎందుకు కష్టతరమో వివరించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావును ఆదేశించింది.

విస్తృత ప్రచారం చేయాలి..

కరోనా కేసుల వివరాలు మీడియా బులెటిన్లలో ప్రజలకు మరింత వివరంగా తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు తెలిపింది. జీహెచ్​ఎంసీ పరిధిలో కరోనా కేసుల గణాంకాలు వార్డుల వారీగా వెల్లడించి, కాలనీ సంఘాలకు ఎప్పటికప్పుడు తెలపాలని ఆదేశించింది. దానివల్ల స్థానిక ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారని పేర్కొంది. గాంధీతో పాటు రాష్ట్రంలో 54 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు వివరించగా... రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం చాలా మందికి తెలియదని, ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది.

పీపీఈ కిట్టు ఇవ్వండి

కోవిడ్ ఆసుపత్రుల్లో సూపరిండెంట్ నుంచి వార్డు బాయ్ వరకు అందరికీ కరోనా రక్షణ కిట్లు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. గాంధీ ఆసుపత్రి వద్ద భద్రతగా ఉన్న సుమారు 240 మంది పోలీసులకు కరోనా రక్షణ కిట్లు ఇవ్వాలని సూపరింటెండెంట్ సూచించింది. గాంధీ తరహాలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా సిబ్బందిని షిఫ్ట్​ల వారీగా పనిచేసేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని తెలిపింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలతో ఎవరైనా వస్తే.. వెంటనే ప్రభుత్వం, వారి బంధువులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. లక్షణాలు లేని ప్రైమరీ కాంట్రాక్టులకు కరోనా పరీక్షలు జరపాలన్న ఐసీఎంఆర్​ మార్గదర్శకాలు ఎందుకు అమలు చేయడం లేదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 29 లోగా పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ... ఈ నెల 30కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: శునకంతో.. పులిబిడ్డకు దోస్తీ కుదిరింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.