ETV Bharat / city

సాగునీటి పథకాల పనుల పురోగతిపై నేడు ఉన్నతస్థాయి సమావేశం

author img

By

Published : May 25, 2021, 4:09 AM IST

CM kcr review today on the progress of work on irrigation  projects in the Telangana
సాగునీటి పథకాల పనుల పురోగతిపై నేడు ఉన్నతస్థాయి సమావేశం

ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ నేడు సమీక్షించనున్నారు. సాగునీటి పథకాల పనుల పురోగతి, భూసేకరణపై ప్రధానంగా భేటీలో చర్చ జరగనుంది. పెండింగ్‌ బిల్లులు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం తదితరాలపై సమావేశం సాగనుంది.

సాగునీటి పథకాల పనుల పురోగతి, భూసేకరణ, పెండింగ్‌ బిల్లులు, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం తదితరాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్‌ ఇవాళ ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, సమ్మక్కసాగర్‌ బ్యారేజి నిర్మాణం, సింగూరు నుంచి కొత్తగా చేపట్టనున్న ఎత్తిపోతల పథకాలపై చర్చించనున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన పనులు జరుగుతున్నా, డిస్ట్రిబ్యూటరీల పనులకు టెండర్‌ ప్రక్రియ చేపట్టలేదు. సుమారు 2,500 కోట్లతో.... 3.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టేందుకు 8 ప్యాకేజీలుగా విభజించి ఇంజినీర్లు.... నీటిపారుదల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం టెండర్‌ ప్రక్రియకు ఆమోదం తెలపాల్సి ఉంది.

దేవాదులఎత్తిపోతల..

దేవాదులఎత్తిపోతల పథకానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా జరగడంతోపాటు గోదావరి నీటిని నిల్వ చేసేందుకు చేపట్టిన సమ్మక్కసాగర్‌ బ్యారేజి దాదాపు పూర్తి కావచ్చింది. మిగిలిన పనులు, ప్రారంభోత్సవం, చెక్‌డ్యాంల నిర్మాణం పురోగతిపై భేటీలో చర్చించే అవకాశం ఉంది. దేవాదుల మూడో దశపనులు సహా.....మొదటి, రెండో దశల్లో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం జరగాల్సి ఉంది. పనుల్లో జాప్యం చేస్తున్న గుత్తేదారుపై చర్య తీసుకోగా కోర్టును ఆశ్రయించారు. ఆ పథకం కింద చెరువులు నింపడానికే ఇప్పటివరకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ విషయంపై సమీక్షించి కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

కాళేశ్వరం..

కాళేశ్వరం ద్వారా మళ్లించే నీటితో సింగూరు నుంచి 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.అందుకు కావాల్సిన సర్వే కోసం రూ. 22 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అది పూర్తయ్యాక సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయాల్సి ఉంటుంది. నాగార్జునసాగర్‌ నుంచి పలు ఎత్తిపోతల పథకాల పూర్తిపై మొన్నటి ఉపఎన్నిల్లో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వాటిని పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించనున్నారు.


ఇవీ చూడండి: కరోనా పరీక్షలు మరింత పెంచాలి: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.