ETV Bharat / city

జేఈఈ, నీట్ నిర్వహణపై ఉత్కంఠ... నేడు స్పష్టత వచ్చే అవకాశం

author img

By

Published : Jul 3, 2020, 8:38 AM IST

జేఈఈ మెయిన్‌, నీట్‌ పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ముందుగా ప్రకటించిన తేదీల్లో జరుగుతాయా లేదా వాయిదా వేస్తారా అనేదానిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేయాలని తల్లిదండ్రుల నుంచి వినతులు వస్తున్నాయి. ఈ క్రమంలో పరిస్థితిని సమీక్షించి తగిన సిఫార్సులు చేసేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రి... గురువారం ఓ కమిటీని నియమించారు. ఇవాళ నివేదికను అందజేయాలని గడువు విధించారు.

jee
jee

జేఈఈ మెయిన్‌, నీట్‌... ముందుగా ప్రకటించిన తేదీల్లో జరుగుతాయా? వాయిదా వేస్తారా? దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల మదిని తొలుస్తున్న ప్రశ్నలివి. కరోనా మహమ్మారి కారణంగా పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్రాల విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వినతిపత్రాలు అందాయి. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం తమకు ముఖ్యమని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ చెబుతూ వస్తున్నారు. కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాయిదా వేయాలని కొందరు విన్నవిస్తుండగా... మరికొంత మంది మాత్రం ఏదో ఒకటి స్పష్టత ఇవ్వాలని అడుగుతున్నారు.

ఈ క్రమంలో పరిస్థితిని సమీక్షించి తగిన సిఫార్సులు చేసేందుకు కేంద్ర మానవ వనరుల మంత్రి గురువారం ఓ కమిటీని నియమించారు. కమిటీ శుక్రవారం లోపు నివేదికను అందజేయాలని గడువు విధించారు. కమిటీలో జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) డైరెక్టర్‌ జనరల్‌, ఇతర నిపుణులు ఉంటారు. ఈనెల 18-23వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌, 26న నీట్‌ నిర్వహిస్తామని ఇంతకుముందు ఎన్‌టీఏ ప్రకటించింది. జేఈఈ మెయిన్‌కు దాదాపు 9 లక్షల మంది, నీట్‌కు సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేశారు.

నిర్వహించాలని ప్రకటిస్తే వెబ్‌సైట్లో హాల్‌టికెట్లు

పరీక్షకు 15 రోజులు ముందు నుంచి హాల్‌టికెట్లు(అడ్మిట్‌ కార్డు) వెబ్‌సైట్లో ఉంచుతామని ఎన్‌టీఏ ఇప్పటికే ప్రకటించింది. అంటే శుక్రవారం నుంచి జేఈఈ మెయిన్‌ హాల్‌టికెట్లు ఉంచాలి. కమిటీ శుక్రవారం నివేదిక ఇచ్చిన వెంటనే పరీక్ష నిర్వహణపై ఏదో ఒక నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. ఈనెల 18 నుంచి జేఈఈ ఉంటుందని చెబితే హాల్‌టికెట్లను వెబ్‌సైట్లో ఉంచనున్నారు.

దరఖాస్తు ఫీజు వెనక్కి ఇచ్చేస్తామంటే...

మున్ముందు కరోనా కేసులు ఇంతకంటే తగ్గుతాయని చెప్పలేని పరిస్థితి. దానికి తోడు పరీక్షలు నిర్వహించకుండా సీట్ల భర్తీకి మరో ప్రత్యామ్నాయం లేదని చెబుతున్నారు. ఇంటర్‌ మార్కుల ఆధారంగా భర్తీ చేస్తే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మార్కుల కేటాయింపు ఉన్నందున సమస్య అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ‘‘సాధారణంగా జేఈఈ మెయిన్‌, నీట్‌లో సీట్లు పొందే స్థాయిలో ర్యాంకులు సాధించేవారు తక్కువ. విఫలమయ్యేవారు ఎక్కువ. అందుకే వాయిదా వేయమనే వారే అధికంగా ఉంటారు’’ అని జేఈఈ శిక్షణ నిపుణుడు కృష్ణ చైతన్య అభిప్రాయపడ్డారు. ‘‘చాలా మంది వివిధ కారణాల వల్ల పరీక్షకు దరఖాస్తు చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దరఖాస్తు ఫీజు వెనక్కి ఇస్తామని చెబితే దేశవ్యాప్తంగా లక్షల మంది పరీక్ష రాయకుండా విరమించుకునే అవకాశం ఉంది. ఎన్‌టీఏ ఆ దిశగా ఆలోచన చేయాల’’ని ఆయన సూచించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో యాజమాన్య కోటా భర్తీ చేస్తుండటంతో వేల మంది రాస్తున్నారు. ఈ పరీక్షకు దాదాపు ఏపీ, తెలంగాణ నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో రికార్డు.. ఒక్కరోజే 1,213 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.