ETV Bharat / city

అధైర్యపడొద్దు.. అండగా ఉంటా: నరేంద్రకు చంద్రబాబు హామీ

author img

By

Published : Oct 14, 2022, 9:14 PM IST

ఏపీ తెలుగుదేశం పార్టీ మీడియా సమన్వయకర్త నరేంద్రతో పోలీసులు ప్రవర్తించిన తీరుపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అధికారులు చట్టాన్ని అతిక్రమించవద్దంటూ హెచ్చరించారు. సీఐడీ కేసు, దర్యాప్తు దృష్ట్యా నరేంద్రను, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

చంద్రబాబు
చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్​లో సీఐడీ విభాగాన్ని సమగ్రంగా ప్రక్షాళన చేయటంతో పాటు.. సీఐడీ చీఫ్​ను మార్చాలని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల కేసులో అరెస్ట్​ అయ్యి.. విడుదలైన తెదేపా మీడియా సమన్వయకర్త దారపనేని నరేంద్రను గుంటూరులోని ఆయన నివాసంలో చంద్రబాబు పరామర్శించారు. నరేంద్ర ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీఐడీ అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టారని ఆరా తీశారు. నరేంద్రతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

అధైర్యపడొద్దు... అండగా ఉంటానని నరేంద్రకు చంద్రబాబు హామీ

అనంతరం వైకాపా ప్రభుత్వం, సీఐడీ అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇదే కేసులో అరెస్ట్​ అయిన అంకబాబుకు బెయిల్ వచ్చిందని.. అయినా మళ్లీ నరేంద్రను అరెస్టు చేసి హింసించటం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులను గుర్తు పెట్టుకుంటామని హెచ్చరించారు. వైకాపా పతనం ప్రారంభమైందని.. ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఇప్పటివరకూ చర్యలు లేవని కానీ గన్నవరం విమానాశ్రయంలో బంగారం పట్టుబడితే.. ఆ విషయం షేర్ చేసిన వాళ్లపై కేసులేంటని ప్రశ్నించారు. నరేంద్ర అరెస్ట్ విషయం తెలియగానే ఆయన్ను హింసిస్తారనే ఉద్దేశంతోనే తాను డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపారు. అయినప్పటికీ నరేంద్రను చిత్రహింసలకు గురి చేయటంపై ఆగ్రహం వెలిబుచ్చారు.

తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాక్షి సిబ్బందిని ఇలా చేస్తే పరిస్థితి ఎలా ఉండేదని ప్రశ్నించారు. పోలీసులను రక్షణ కల్పించే వ్యవస్థగానే చూశానని.. ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోందని వ్యాఖ్యానించారు. బరితెగించి వ్యవహరిస్తోన్న ప్రభుత్వాన్ని దింపటానికి ప్రజలంతా ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి: టీఎస్ బీపాస్ అమల్లో నిర్లక్ష్యం.. అధికారులకు జరిమానా..

కుమార్తె మర్డర్​.. తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య.. తల్లికి క్యాన్సర్​.. ప్రేమ హత్య కేసులో విషాదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.