ETV Bharat / city

Central on illegal mining in AP : మైనింగ్‌ అక్రమాలు.. నిగ్గు తేల్చేందుకు కేంద్రం ఆదేశం

author img

By

Published : Aug 4, 2022, 11:57 AM IST

Central on illegal mining in AP : ఆంధ్రప్రదేశ్‌లోని బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌లో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం విచాణకు ఆదేశించింది. పర్యావరణ కాలుష్యం, మైనింగ్‌ చట్టాల ఉల్లంఘన, మోనోజైట్‌ అక్రమ ఎగుమతులపై కేంద్ర గనుల శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్టు కేంద్ర అణు ఇంధన శాఖ పార్లమెంట్‌కు తెలిపింది.

Central on illegal mining in AP
Central on mining: మైనింగ్‌ అక్రమాలు.. నిగ్గు తేల్చేందుకు కేంద్రం ఆదేశం

Central on illegal mining in AP : ఆంధ్రప్రదేశ్‌లోని బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌లో జరిగిన అక్రమాలు నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం విచాణకు ఆదేశించింది. పర్యావరణ కాలుష్యం, మైనింగ్‌ చట్టాల ఉల్లంఘన, మోనోజైట్‌ అక్రమ ఎగుమతులపై కేంద్ర గనులశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్టు కేంద్ర అణు ఇంధన శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. రాష్ట్రంలో అణు ఇంధనానికి సంబంధించిన ఖనిజాలు అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయని తెలిపింది. మోనోజైట్‌ అక్రమ ఎగుమతులను తీవ్రంగా పరిగణించిన అణు ఇంధన శాఖ ఇండియన్‌ బ్యూరో ఆఫ్‌ మైన్స్‌ను ఆదేశించినట్టు ప్రధాని కార్యాలయ వ్యవహారాలు, అణు ఇంధన శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ వెల్లడించారు.

అణు ఇంధనానికి కీలక ఖనిజాల్లో మోనోజైట్‌ ఒకటి.. అణు ఇంధనానికి సంబంధించిన కీలక ఖనిజాల్లో మోనోజైట్‌ ఒకటని, అక్రమ మైనింగ్‌ ద్వారా మోనోజైట్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు కూడా కేంద్ర గనుల శాఖకు ఫిర్యాదులు రావడంతో విచారణ జరుపుతున్నట్టు మంత్రి తెలిపారు. ఎంత మేరకు ఖనిజాన్ని వెలికి తీశారు? ఎంత రవాణా చేశారు?ఎంత మేరకు అమ్మకాలు జరిపారనే అంశాలతో పాటు.. పర్యావరణం సహా ఇతర అనుమతుల ఉల్లంఘనపైనా విచారణ జరపాలని ఇండియన్‌ బ్యూరో ఆఫ్ మైన్స్‌ను కోరినట్టు మంత్రి లోక్‌సభలో చెప్పారు. వైకాపా ఎంపీ కోటగిరి శ్రీధర్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

మచిలీపట్నం, భీమునిపట్నం వద్ద పరిమితులతో కూడిన అనుమతులు.. ఇదే సందర్భంలో బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌ జరిపే లీజు హక్కులను రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీఎండీసీకి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందన్నారు. ఈ మేరకు భీమునిపట్నం, మచిలీపట్నం వద్ద మైనింగ్‌ చేసుకునేందుకు పరిమితులతో కూడిన అనుమతులు ఇచ్చినట్లు జితేంద్రసింగ్‌ వెల్లడించారు. బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌ కోసం 17 ప్రదేశాల్లో ఏపీఎండీసీకి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని కేంద్ర మంత్రి తన సమాధానంలో చెప్పారు. భీమునిపట్నం వద్ద 90.15 హెక్టార్లలో, మచిలీపట్నం వద్ద 1978.471 హెక్టార్లలో బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌కు గత ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన వినతులను పక్కన పెట్టినట్లు వివరించారు. తమ వద్దకు వచ్చిన పిర్యాదులపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అణు ఇంధన శాఖ కోరినట్లు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.