ETV Bharat / city

ఇరు రాష్ట్రాల నీటి కేటాయింపులపై కేంద్రం నివేదిక

author img

By

Published : Oct 11, 2020, 6:14 AM IST

కృష్ణా, గోదావరి నదుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ట్రైబ్యునళ్లు చేసిన కేటాయింపులు; తర్వాత జరిగిన పునఃకేటాయింపులు, నీటి కేటాయింపులు లేకుండానే చేపట్టిన ప్రాజెక్టులు తదితర వివరాలతో కేంద్రం సమగ్రంగా ఓ నివేదిక తయారు చేసింది. ఈ నెల ఆరున జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులకు ప్రజంటేషన్‌ ఇచ్చింది. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా వివరించింది.

central-report-on-srisailam-dam
ఇరు రాష్ట్రాల నీటి కేటాయింపులపై కేంద్రం నివేదిక

‘‘శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు చేపట్టిన వివిధ పథకాలకు 384.5 టీఎంసీలు అవసరం. శ్రీశైలంలో ఆవిరయ్యే నీటితో కలుపుకొని మొత్తం 417.5 టీఎంసీలు కావాలి. ఈ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకొనే పథకాల కిందనే 40.95 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది’’ అని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ పేర్కొంది. శ్రీశైలం ప్రాజెక్టుపై ఎంత ఒత్తిడి ఉందో తెలియజేసింది. కృష్ణా, గోదావరి నదుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ట్రైబ్యునళ్లు చేసిన కేటాయింపులు; తర్వాత జరిగిన పునఃకేటాయింపులు; నీటి కేటాయింపులు లేకుండానే చేపట్టిన ప్రాజెక్టులు తదితర వివరాలతో కేంద్రం సమగ్రంగా ఓ నివేదిక తయారు చేసింది. ఈ నెల ఆరున జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అధికారులకు ప్రజంటేషన్‌ ఇచ్చింది. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టు ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా వివరించింది. ఏయే ప్రాజెక్టులకు కేటాయింపులు ఉన్నాయో, వేటికి లేవో వివరంగా పేర్కొంది. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్‌ ట్రైబ్యునల్‌ కృష్ణా నదిలో 811 టీఎంసీలు కేటాయించగా, ఇందులో ఆంధ్రప్రదేశ్‌ 512, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకొనేలా 2015 జూన్‌లో తాత్కాలిక ఒప్పందం జరిగింది. పునఃకేటాయింపుల ద్వారా చెన్నై తాగునీటికి ఐదు, శ్రీశైలం కుడి గట్టు కాలువకు 19, పులిచింతలలో ఆవిరికి తొమ్మిది, భీమా ఎత్తిపోతలకు 20 టీఎంసీలు కేటాయించారు. మొత్తం నీటిలో చిన్న నీటి వనరుల కింద 111.26 టీఎంసీలు ఉండగా, ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 22.11, తెలంగాణలో 89.15 టీఎంసీలు ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. మొత్తం కేటాయింపులో రాయలసీమకు 144.70, కోస్తాంధ్రకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీల కేటాయింపు ఉన్నట్లు కూడా పేర్కొంది.

కృష్ణాజల వివాద ట్రైబ్యునల్‌-2 వివిధ నీటి లభ్యతల కింద 448 టీఎంసీలను కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో 65 శాతం నీటి లభ్యత కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు క్యారీఓవర్‌కు(వరద వచ్చినప్పుడు నిల్వ చేసుకొని తర్వాత అవసరానికి వాడుకోవడానికి) 30, జూరాలకు తొమ్మిది, ఆర్డీఎస్‌ కుడి కాలువకు నాలుగు, నదిలో కనీస ప్రవాహానికి ఆరు టీఎంసీలు కేటాయించింది. సరాసరి నీటి లభ్యతలో క్యారీఓవర్‌కు 120, తెలుగుగంగకు 25 టీఎంసీలు నిర్దేశించింది. అయితే ఈ ట్రైబ్యునల్‌ తీర్పు సుప్రీంకోర్టులో కేసుల కారణంగా ఇంకా గెజిట్‌లో ప్రచురితం కాక అమలు కాలేదు.

ఏ ప్రాజెక్టుకు ఎంత నీరు అవసరమంటే...

వినియోగంలో ఉన్న, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, ఆవిరయ్యే 33 టీఎంసీల నీటితో కలిసి శ్రీశైలంలోనే 417.5 టీఎంసీలు అవసరం. ఇందులో తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టుకాలువకు 40, పాలమూరు-రంగారెడ్డికి 90, డిండి ఎత్తిపోతలకు 30, కల్వకుర్తికి 40 టీఎంసీలు అవసరం. ఆంధ్రప్రదేశ్‌లో వెలిగొండకు 43.5, తెలుగుగంగకు 29, చెన్నై తాగునీటి సరఫరాకు 15, శ్రీశైలం కుడిగట్టు కాలువకు 19, గాలేరు-నగరికి 38, హంద్రీనీవాకు 40 టీఎంసీలు అవసరం. శ్రీశైలం నుంచి నీటిని తీసుకొనేలా చేపట్టిన ప్రాజెక్టులలో చాలా వరకు కేంద్ర జలసంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుల అనుమతులు లేవని కేంద్రం పేర్కొంది.

కృష్ణా, గోదావరి బేసిన్లలో ఏయే ప్రాజెక్టులకు నీటి లభ్యత అనుమతి, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి, ట్రైబ్యునల్‌ కేటాయింపులు ఉన్నాయో, వేటిని పునర్విభజన చట్టంలో పేర్కొన్నారో వివరంగా కేంద్రం వెల్లడించింది. ఎక్కువ ప్రాజెక్టులకు ఇవేమీ లేవని తెలిపింది. తాజాగా తెలంగాణ 2020 మార్చిలో కాళేశ్వరం మూడో టీఎంసీ పనిని చేపడితే, మే 2020లో ఆంధ్రప్రదేశ్‌ రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణను చేపట్టిందని వివరించింది.

ఇదీచదవండి

ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి పచ్చజెండా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.