ETV Bharat / city

KISHAN REDDY: 'ఈ పదవి.. కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా'

author img

By

Published : Jul 7, 2021, 9:40 PM IST

Updated : Jul 8, 2021, 3:43 AM IST

తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో పని చేసేందుకు కృషి చేస్తానని... కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని.. తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తానని హామీనిచ్చారు. కేబినెట్‌ మంత్రిగా తనకిచ్చిన అవకాశం కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా అభివర్ణించారు.

central minister kishan reddy about his promotion
central minister kishan reddy about his promotion

కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి పదోన్నతి లభించింది. కేంద్ర కేబినెట్‌ హోదా కల్పించిన ప్రధాని మోదీ... పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి బాధ్యతలను కట్టబెట్టారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు ప్రధాని మోదీకి... మార్గదర్శనం చేసినందుకు అమిత్‌షాకు కిషన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని అంచనాలకు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని తెలిపారు. నవభారత నిర్మాణం కోసం తెలంగాణ అమరవీరుల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా వారి కలలు సాకారమయ్యేలా రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయడం అనే రెండు వ్యూహాలు ప్రస్తుతం తన ముందున్నాయన్నారు. తనను ఆదరించి పార్లమెంటుకు పంపించిన సికింద్రాబాద్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

చిత్తశుద్ధితో నెరవేరుస్తా..

"కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తోన్న సబ్​కాసాత్​ సబ్​కా వికాస్​ స్ఫూర్తితో రెండు తెలుగు రాష్ట్రాలను సమన్వయంతో పనిచేసేందుకు కృషిచేస్తా. విభజన తర్వాత ఏర్పడిన సమస్యల పరిష్కారానికి పాటుపడుతా. రెండు రాష్ట్రాల అభివృద్ధికి నా వంతుగా ఎలాంటి సహకారం కావాల్సి వచ్చినా చేస్తా. తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తా. నా మీద ఉంచిన బాధ్యతను మోదీ, అమిత్​షా, నడ్డా ఆశీర్వాదంతో అంకితభావంతో చిత్తశుద్ధితో తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తా."

- కిషన్​రెడ్డి, కేంద్ర మంత్రి

ఆస్పత్రుల్లో సౌకర్యాల కల్పనకు కృషి..

నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనాపై పోరాటంలో అన్ని వర్గాలను కలుపుకొని పోతున్నామని కిషన్​రెడ్డి తెలిపారు. హైదరాబాద్​లోని ఆస్పత్రులను పరిశీలించి మౌలిక సౌకర్యాల కల్పనకు కృషిచేసినట్లు తెలిపారు. వ్యాక్సిన్​ విషయంలోనూ ప్రభుత్వం చెప్పిన అన్ని విధులు నిర్వర్తించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సామాన్య కార్యకర్త నుంచి కేంద్రమంత్రి దాకా...

తెలుగు ప్రజలందరికీ కృతజ్ఞతలు..

"ఇప్పటి వరకు సహాయమంత్రిగా పలు చట్టాలు చేయటంలో భాగస్వామ్యమయ్యాను. ఇప్పుడు కేబినెట్​ మంత్రిగా ఎలాంటి బాధ్యత ఇచ్చినా అంతే చిత్తశుద్ధితో కృషి చేస్తా. 1980 నుంచి ఇప్పటి వరకు ఎన్నో బాధ్యతలు నెరవేర్చాను. అప్పడు సాధారణ కార్యకర్తగా ఎలా పనిచేశానో.. ఇప్పుడు కూడా అంతే సేవాభావంతో కృషి చేస్తా. నేను ఈ స్థాయికి రావటానికి కారణమైన... నన్ను గెలిపించిన సికింద్రాబాద్​ ప్రజానికానికి, తెలుగు ప్రజలందరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో ఇది మరుపురాని సంఘటన."

- కిషన్​రెడ్డి, కేంద్ర మంత్రి.

'ఈ పదవి.. కార్యకర్తలకు ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నా'

సీఎంల వల్ల కాకపోతే మేము...

తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చేందుకు తన కేంద్ర మంత్రి పదవికి ఎలాంటి సంబంధం లేదన్న కిషన్​రెడ్డి... ఆ దిశగా పార్టీ తరఫున తన వంతు కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న కృష్ణా జలాల వివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవాలన్నారు. జల వివాదమైనా.. మరే విషయమైనా... రెండు రాష్ట్రాల సీఎంలు పరిష్కరించుకోలేని సమయంలో కేంద్రం ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకుంటుందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: కేంద్ర మంత్రులుగా 43 మంది ప్రమాణ స్వీకారం

Last Updated : Jul 8, 2021, 3:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.