ETV Bharat / city

Polavaram Projects Funds: పోలవరంలో రూ.15,037 కోట్ల కోత!

author img

By

Published : Dec 12, 2021, 12:02 PM IST

Polavaram Project Funds : పోలవరం పూర్తి చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తామని, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే మొత్తం నిధులు తామే భరిస్తామని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం పేర్కొన్నా ఆచరణలో అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఏపీ ప్రభుత్వం సమర్పించిన సవరించిన అంచనా మొత్తంలో వివిధ రూపాల్లో ఇంతవరకు రూ.15,037 కోట్లు కేంద్రం కోత పెట్టింది.

Polavaram Project Problems
Polavaram Project Problems

Polavaram Project Funds : పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అన్ని విధాలా సహకరిస్తామని, నిర్మాణానికి మొత్తం నిధులు తామే భరిస్తామని రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం పేర్కొన్నా ఆచరణలో అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సవరించిన అంచనా మొత్తంలో వివిధ రూపాల్లో ఇంతవరకు రూ.15,037 కోట్లు కేంద్రం కోత పెట్టింది. కేవలం రూ.35,950.16 కోట్లకే పెట్టుబడి అనుమతి ఇస్తామని కేంద్ర మంత్రి తాజాగా ప్రకటించారు. ఆ ప్రక్రియా వేగంగా సాగడం లేదు. ఇప్పటికే సందేహాలపై సందేహాలు వ్యక్తం చేసి రెండు కీలక కమిటీలు ఈ అంచనాలను ఆమోదించినా మళ్లీ పోలవరం అథారిటీ కొర్రీలపై కొర్రీలు వేస్తోంది.

ఇంత కోత ఏ రూపంలో?

Polavaram Project News : సవరించిన అంచనాలు రూ.55,548.87 కోట్లకు కేంద్ర జల సంఘం ప్రతిపాదిస్తే సాంకేతిక సలహా కమిటీ ఎప్పుడో 2019 ఫిబ్రవరిలో ఆమోదం తెలియజేసింది. ఆ తర్వాత అంచనాల సవరణ కమిటీ (రివైజ్డు కాస్ట్‌ కమిటీ- ఆర్‌సీసీ) ఆమోదమూ తీసుకోవాలని అనడంతో అక్కడికి చేరింది. ఆ కమిటీ చర్చలపై చర్చలు జరిపి రూ.7,823.13 కోట్ల కోత విధించింది. రూ.47,725.74 కోట్లకే 2020 మార్చిలో ఆమోదం తెలియజేసింది. ఇప్పుడు మళ్లీ ఇందులో తాగునీటి విభాగం నిధులు రూ.7,214.67 కోట్లు ఇవ్వబోమని కేంద్ర మంత్రి ప్రకటించారు. దీంతో ఇప్పటివరకూ అనేక కొర్రీల రూపంలో రూ.15,037.80 కోట్లను కోత పెట్టినట్లయింది. విద్యుత్కేంద్రం పనులకు రూ.4,560.91 కోట్లు ఖర్చవుతుంది. ఆ నిధులు ఏపీ అడగడం లేదు. అవి ఎలాగూ మినహాయించాల్సి ఉంది. అన్ని మినహాయింపులూ కలిపి ఇప్పుడు రూ.35,950.16 కోట్లకే పెట్టుబడి అనుమతి ఇస్తామంటున్నారు. అప్పట్లో సవరించిన అంచనాల కమిటీ ముందు అధికారులు రూ.7,823.13 కోట్లు కోత పడకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. పునరావాస, భూసేకరణ వ్యయంలోనే రూ.5,000 కోట్ల వరకు కోత పెట్టారు. భూములు సేకరించేందుకు నోటీసు ఇచ్చినప్పటి నుంచి డ్రాఫ్టు డిక్లరేషన్‌ వరకు ఉన్న మధ్య సమయంలో పరిహారంపై 12శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 2013 భూసేకరణ చట్టమే ఈ విషయం పేర్కొంటోంది. ఆ కేటగిరీ కింద ప్రతిపాదించిన నిధులను ఆర్‌సీ కమిటీ తిరస్కరించింది. కుడి, ఎడమ కాలువలకు పని పరిమాణం కింద కమిటీ సంతృప్తి చెందక రూ.2,800 కోట్ల మేర కోత పెట్టింది. ముందు ఆమోదింపజేసుకోండి... ఆనక అవసరమయితే సవరణ ప్రతిపాదన పెట్టి ఆ నిధులు పొందవచ్చని నాడు ఆర్‌సీసీ సభ్యులు కొందరు అధికారులకు చెప్పారు. ఇప్పుడు కొత్తగా మరికొంత కోతేశారు. ఇలా తాగు, సాగునీరు అన్న విభజన జాతీయ ప్రాజెక్టుల్లో లేదని కేంద్ర జల సంఘం పెద్దలు చెబుతున్నా అది పరిగణనలోకి తీసుకోకుండా కోత పెడుతున్నారంటూ రాష్ట్ర అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సందేహాలపై సందేహాలు.. ఎన్నాళ్లిలా?

Funds Issue for Polavaram Project : ఈ ప్రాజెక్టుకు 2017-18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్ల అంచనాతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించగా పోలవరం అథారిటీ ఎప్పుడో 2018లోనే పరిశీలించి పంపింది. సాంకేతిక సలహా కమిటీ ముందు కేంద్ర జలసంఘం పెద్దలే ప్రతిపాదించాలి. ఆ క్రమంలో వారికి వచ్చిన సందేహాలన్నీ నివృత్తి చేసుకునేందుకు ఏడాదిన్నర సమయం తీసుకున్నారు. జల వనరులశాఖ బృందం నెలపాటు దిల్లీలోనే ఉండి సమాధానాలు చెప్పింది. జల వనరులశాఖ కార్యదర్శి అన్ని అనుమానాలను నివృత్తి చేసి వచ్చారు. 600 కిలోల బరువున్న సమాధాన పత్రాలు ఇచ్చి వచ్చారు.

Polavaram Project Updates : ఆ తర్వాత సాంకేతిక సలహా కమిటీ అన్నీ పరిశీలించి ఆ మొత్తానికి ఆమోదించింది. రూ.10,000 కోట్ల కన్నా అధికంగా నిధులిచ్చే ప్రాజెక్టులో అంచనాల సవరణ కమిటీ (ఆర్‌సీసీ) ఆమోదమూ తీసుకోవాలన్నారు. వారు ఏడాది పాటు పరిశీలించి రూ.7,823.13 కోట్లకు కోత పెట్టి ఆమోదించారు.

Polavaram Project Problems : ప్రాజెక్టు అథారిటీ కిందటి ఏడాది నవంబరులోనే సమావేశం నిర్వహించింది. కేంద్ర ఆర్థికశాఖ పంపిన ప్రతిపాదన రూ.20,398.61 కోట్లకు అథారిటీ ఆమోదించడంతో పాటు రూ.47,725.74 కోట్ల నిధులిస్తేనే పూర్తి చేయడం సాధ్యమవుతుందని కూడా సిఫార్సు చేసింది. ఆ మినిట్లనూ కేంద్ర జలశక్తిశాఖకు పంపింది. కేంద్ర జలశక్తిశాఖ నుంచి అది మళ్లీ పోలవరం అథారిటీకి వచ్చింది. సవరించిన అంచనాలు ఆమోదించే క్రమంలో మళ్లీ అథారిటీయే మూడు నెలలకోసారి సందేహాలు లేవనెత్తడం, కొర్రీలు వేయడం జరుగుతోంది. ప్రతి అనుమతికీ, ప్రతి పైసాకు తమదే బాధ్యత అని రాష్ట్ర విభజన వేళ చెప్పిన కేంద్రం రెండు ఉన్నతస్థాయి కమిటీలు ఆమోదించిన తర్వాతా సందేహాలు వ్యక్తం చేయడమే ప్రస్తుతం పెద్ద సందేహంగా మారిందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.