ETV Bharat / city

corona third wave: డెల్టాను మించిన వేరియంట్‌వస్తేనే కరోనా మూడో ముప్పు..

author img

By

Published : Sep 10, 2021, 3:34 PM IST

డెల్టా కంటే తీవ్రమైన వేరియంట్ వస్తేనే.. కరోనా మూడో ముప్పు పొంచి ఉంటుందని సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందుకూరి అభిప్రాయపడ్డారు. అయితే.. ఇప్పటివరకు ఆ ఛాయలు కనిపించ లేదన్నారు. డెల్టా ప్లస్​లో ఏవై4, ఏవై12 వేరియంట్ల ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు.

coroan
కరోనా

‘‘దేశవ్యాప్తంగా పరిశీలిస్తే కొన్నిచోట్ల మినహా కొవిడ్‌ రెండోదశ ప్రభావం దాదాపుగా తగ్గింది. ప్రస్తుతం ఏపీలో కేసులు, మరణాలు పెరగడానికి డెల్టా వేరియంటే కారణం. దీని ప్రభావమూ క్రమంగా తగ్గుతోంది. కేరళలో యాంటీబాడీస్‌ వృద్ధి చెందిన వారు 40% మాత్రమే ఉండటంతోనే ఈ వేరియంట్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. డెల్టా కంటే తీవ్రమైన వేరియంట్‌ వస్తేనే మూడో దశ ప్రభావం అధికంగా ఉంటుంది’ అని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ ఎన్‌.నందికూరి అభిప్రాయపడ్డారు. ఏపీలోని విజయవాడలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ సర్వైలెన్స్‌ కేంద్రం ఏర్పాటులో భాగంగా స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలను గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈటీవీ భారత్​తో మాట్లాడారు.

ఇన్‌ఫ్లూయెంజా స్థాయికి కరోనా

‘‘ప్రపంచంలో 1918లో ఇన్‌ఫ్లూయెంజా మొదటిసారిగా వచ్చింది. దాని తీవ్రత తగ్గేందుకు రెండేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఇన్‌ఫ్లూయెంజా కేసులు వస్తున్నాయి. కానీ... ఆందోళన చెందేంతగా లేవు. ప్రస్తుత కరోనా వ్యాప్తి మొదలై రెండేళ్లు పూర్తవుతోంది. రెండింటినీ పోలిస్తే... ఈ వైరస్‌ కూడా బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జర్మనీ విధానాన్ని పాటిస్తే మేలు

కొవిడ్‌ జాగ్రత్తలతోపాటు వెలుతురు బాగుండే వాతావరణంలో విద్యా సంస్థలు నడిస్తే అంతగా ప్రమాదం ఉండదు. జర్మనీలో ఇదే విధానాన్ని పాటించగా వైరస్‌ ప్రభావం తగ్గినట్లు నిపుణులు చెబుతున్నారు.

వైరస్‌ జన్యుక్రమాల గుర్తింపుతో మంచి ఫలితాలు

సాధారణ కేంద్రాల్లో కేవలం కరోనా సోకిందా? లేదా? అని నిర్ధారిస్తారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ సర్వైలెన్స్‌ కేంద్రంలో వైరస్‌ జన్యుక్రమాన్ని గుర్తిస్తారు. ఎక్కడైనా కేసులు ఎక్కువగా వస్తుంటే.. కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు పరీక్షిస్తాం. వీటి ఫలితాల ఆధారంగా అప్రమత్తం కావచ్చు. విజయవాడలో ఏర్పాటయ్యే కేంద్రంలో రాష్ట్ర నమూనాలను మాత్రమే పరీక్షిస్తారు. దాంతో ఫలితాలు తక్షణమే తెలుస్తాయి.

సీసీఎంబీ ఒప్పందం

హైదరాబాద్​లోని సీసీఎంబీ పర్యవేక్షణలో విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాలలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ సర్వైలెన్స్‌ శాటిలైట్‌ కేంద్రం ఏర్పాటుకాబోతుంది. దీనిపై వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ భాస్కర్‌ కాటంనేని, సీసీఎంబీ డైరెక్టర్‌ వినయ్‌ కె.నందుకూరి మధ్య గురువారం ఒప్పందం జరిగింది. వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వినోద్‌, వైద్య విద్య సంచాలకులు డాక్టర్‌ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. అనంతరం కేంద్రం ఏర్పాటయ్యే ప్రాంతాన్ని సందర్శించారు.

corona third wave: డెల్టాను మించిన వేరియంట్‌వస్తేనే కరోనా మూడో ముప్పు..

ఇదీ చదవండి: Be Alert: వరుస పండుగల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరం!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.