తెలంగాణ వైభవానికి అద్దం పట్టేలా.. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు..

author img

By

Published : Jun 27, 2022, 5:12 AM IST

BJP MEETING

BJP MEETING: వచ్చే నెల 3న పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించనున్న భాజపా భారీ బహిరంగ సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. సభకు దాదాపు 10 లక్షల మంది జనసమీకరణను టార్గెట్​గా​ పెట్టుకున్నామని తెలిపారు. తమ పార్టీ పాలసీ ప్రకటించడానికి, ప్రజలను చైతన్యం చేయడానికే ఈ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.

BJP MEETING: హైదరాబాద్‌లో జరగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, ఆహారపు అలవాట్లు తెలిపేలా ప్రదర్శన (ఎగ్జిబిషన్‌) నిర్వహించనున్నారు. నోవాటెల్‌-హెచ్‌ఐసీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసే ఈ ఎగ్జిబిషన్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జులై 1న ప్రారంభిస్తారు. 2, 3 తేదీల్లో జరిగే కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే ప్రధాని నరేంద్రమోదీ సహా ప్రముఖ నేతలంతా ప్రదర్శనను తిలకిస్తారు. తెలంగాణ విమోచనోద్యమంలో రజాకార్ల అకృత్యాలు, వీర భైరాన్‌పల్లి, పరకాల ఘటనల జ్ఞాపకాలను ప్రదర్శిస్తారు. 1997 నాటి కాకినాడ తీర్మానం నుంచి పార్లమెంటులో గళమెత్తడం వరకు ప్రత్యేక రాష్ట్రం కోసం భాజపా చేసిన పోరాటాలు, సకలజనుల సమ్మె వంటి ఫొటోలు ప్రదర్శించనున్నారు. గద్వాల, నారాయణపేట, పోచంపల్లి చేనేత వస్త్రాలు, అగ్గిపెట్టెలో పట్టే చీర, వ్యవసాయ, ఇతర పనిముట్లు, హస్తకళలకూ చోటు కల్పిస్తున్నారు. సజ్జలు, మక్కలు జొన్నలు, వరి వంటి పంట నమూనాలు.. సకినాలు, మడుగులు, సర్వపిండి తదితర వంటకాలు.. బతుకమ్మ, బోనాలను ప్రదర్శిస్తామని ఎగ్జిబిషన్‌ ఇన్‌ఛార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి తెలిపారు. కాకతీయ కళాతోరణంతో టైమ్‌ మిషన్‌లోకి ప్రవేశించిన అనుభూతి కలిగించేలా ఏర్పాటు చేయబోతున్నారు. ‘తెలంగాణ సంస్కృతి- సంప్రదాయాలను జాతీయ స్థాయి నేతలందరికీ పరిచయం చేయనున్నాం’ అని కార్యవర్గ సమావేశాల ఇన్‌ఛార్జి కె. లక్ష్మణ్‌, బండి సంజయ్‌ చెప్పారు.

తెరాస చీలిపోయే పార్టీ..

కేసీఆర్‌ తనయుడు సహా కుటుంబీకులు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారని, మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రూపులుగా విడిపోయారని, తెరాస చీలిపోయే పార్టీ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. వరంగల్‌ పాలకుర్తికి చెందిన రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్‌, తెరాస నేత సామ వెంకట్‌రెడ్డి, జాతీయ బంజారా మిషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణనాయక్‌, చందానగర్‌ మాజీ కార్పొరేటర్‌ నవతారెడ్డి, సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజాగౌడ్‌తో పాటు పలువురు ఆదివారం భాజపాలో చేరారు. వారికి సంజయ్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎంపీ రవీంద్రనాయక్‌, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

* తెలంగాణలో పేదలకు కొత్త రేషన్‌ కార్డులను మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌కు బండి సంజయ్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు తెరాస ప్రభుత్వ హయాంలో 19 లక్షల రేషన్‌కార్డులను రద్దు చేశారంటూ కమిషన్‌కు ఆదివారం లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

కేసీఆర్‌ సర్కారు పతనం ప్రారంభం..

.

తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఇటీవల పలు సర్వేల్లో ఇది స్పష్టమైందని, దీంతో సీఎంకు భాజపా అంటే భయం పట్టుకుందన్నారు. జులై 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో భాజపా నిర్వహించనున్న బహిరంగసభ పనులకు ఎంపీ సోయం బాపురావు, ఇతర నేతలతో కలసి సంజయ్‌ ఆదివారం భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారని.. దాదాపు 10 లక్షల మందితో సభను విజయవంతం చేస్తామన్నారు. కేసీఆర్‌ పాలన అంతం కావడానికి ‘సాలు దొర.. సెలవు దొర’ అనే నినాదంతో తాము ముందుకెళ్తామని చెప్పారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చిన ప్రతిసారీ సీఎం కేసీఆర్‌ ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నారని, ఈసారి రాష్ట్రపతి ఎన్నికల పేరుతో దిల్లీకి వెళ్తారని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.